పుష్ప.. మరో జాక్‌పాట్

అదృష్టం అంటే పుష్ప మూవీదే. ఈ సినిమాకు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎంత బాగా క‌లిసొచ్చిందో తెలిసిందే. డివైడ్ టాక్‌తో మొద‌లైన‌ప్ప‌టికీ ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌ప్ప విడుద‌లైన అన్ని చోట్లా ఈ చిత్రం లాభాల పంట పండించింది బ‌య్య‌ర్ల‌కు.ముఖ్యంగా హిందీ ఈ సినిమా అంచ‌నాల్ని మించిపోయి బ్లాక్‌బ‌స్ట‌ర్ స్టేట‌స్ అందుకుంది. ఇప్ప‌టిదాకా అక్క‌డ రూ.70 కోట్ల‌కు పైగా గ్రాస్  క‌లెక్ట్ చేసింది. త‌మిళం, మ‌ల‌యాళ వెర్ష‌న్లు కూడా సూప‌ర్ హిట్ అయ్యాయి.

తెలుగులోనూ మూడో వారంలోనూ ఈ చిత్రానికి హౌస్ ఫుల్స్ ప‌డ్డాయి. తెలంగాణ‌లో ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు మంచి లాభాలందుకున్నాడు. ఆంధ్రాలో మాత్ర‌మే బ్రేక్ ఈవెన్ క‌ష్టంగా ఉంది. అందుకు అక్క‌డ టికెట్ల ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉండ‌టం కార‌ణం. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యాన్నే అందుకుంది. ఈ విష‌యంలో టీం అంతా సూప‌ర్ హ్యాపీగా ఉంది. నిర్మాత‌ల‌కైతే భారీగానే లాభాలందిన‌ట్లు తెలుస్తోంది.

ఐతే కేవ‌లం థియేట్రిక‌ల్ హ‌క్కుల ద్వారానే కాదు.. వేరే మార్గంలోనూ పుష్ప మంచి ఆదాయ‌మే తెచ్చి పెడుతోంది. ఈ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్ సంస్థ శుక్ర‌వారం నుంచి స్ట్రీమ్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. పుష్ప డిజిట‌ల్ రైట్స్‌ను ప్రైమ్ వాళ్లు రూ.22 కోట్ల‌కు కొన్నార‌ట‌. రిలీజైన మూడు వారాల త‌ర్వాత స్ట్రీమ్ అవుతున్న చిత్రానికి 22 కోట్లంటే మంచి రేటే. ఇక శాటిలైట్ రైట్స్ కూడా మంచి రేటే ప‌లికే అవ‌కాశ‌ముంది. హిందీలో పుష్ప‌కు పోటీయే లేకపోవ‌డం, ఇప్ప‌టికీ మంచి షేర్ వ‌స్తుండ‌టంతో ప్రైమ్‌లో హిందీ వెర్ష‌న్‌ను ఇప్పుడే స్ట్రీమ్ చేయ‌ట్లేదు.

అక్క‌డ థియేట్రిక‌ల్ ర‌న్ ముగిశాకే డిజిట‌ల్లోకి రాబోతోందీ సినిమా. ఇంకో విశేషం ఏంటంటే.. పుష్ప హిందీ వెర్ష‌న్ ఇండియాలో స‌ర్ప్రైజ్ హిట్ కావ‌డంతో.. ఇప్పుడు ఆ చిత్రాన్ని అమెరికాలో హిందీలో రిలీజ్ చేయ‌బోతున్నారు. ముందు హిందీ వెర్ష‌న్‌కు అక్క‌డ డిమాండ్ లేక‌పోవ‌డంతో ఆ భాష‌లో రిలీజ్ చేయ‌లేదు. కానీ ఇండియాలో రెస్పాన్స్ చూశాక లేటుగా ఇప్పుడు యుఎస్‌లో హిందీ వెర్ష‌న్‌ను దించుతుండ‌టం విశేషం.