పోల‌వ‌రం విమ‌ర్శ‌ల్లో వైసీపీ మునిగిందా...

పోల‌వ‌రం విమ‌ర్శ‌ల్లో వైసీపీ మునిగిందా...

అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి దూకుడు మీదున్న వైసీపీ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో అవినీతి జరిగిందని, అధిక ధరలకు నవయుగకి కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపిస్తూ ఆ కాంట్రాక్టులని జగన్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై రివర్స్ టెండరింగ్ కి వెళ్లాలని జగన్ నిర్ణయం కూడా తీసుకున్నారు. దీంతో నవయుగ సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది.

దీనిపై విచారణ చేసిన హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి పెద్ద షాక్ ఇచ్చింది. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌పై ముందుకెళ్లొద్దని హైకోర్టు ఆదేశించింది. నవయుగకు హైడల్‌ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సస్పెండ్‌ చేసింది.

అయితే ఇప్పటికే పోలవరం విషయంలో ప్రతిపక్ష టీడీపీ, జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు హైకోర్టు తీర్పుని ఆసరాగా చేసుకుని వైసీపీపై నిప్పులు చెరుగుతున్నారు. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వానికి పిచ్చి అనుకోవాలా ? లేక రాష్ట్రానికి పట్టిన శని అనుకోవాలా ? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక మిగతా టీడీపీ నేతలు కూడా దొరికిందే సందు అన్నట్లు వైసీపీపై విమర్శలు చేస్తున్నారు.

అటు టీడీపీకి ధీటుగా బీజేపీ కూడా విమర్శలు గుప్పిస్తుంది. అసలే తాము తీసుకునే నిర్ణయాలు అన్నిటికి మోడీ, అమిత్ షాల మద్ధతు ఉందంటూ విజయసాయి చేసిన ప్రకటనపై సీరియస్ గా ఉన్న బీజేపీ...ఇప్పుడు పోలవరం తీర్పుపై  వైసీపీ ప్రభుత్వాన్ని ఉతికారేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా తీసుకుని ఆ చెడ్డపేరును మోడీపైకి నెట్టే ప్రయత్నం చేయడం ఏమిటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రివర్స్ టెండరింగ్ విషయంలో కేంద్రం సూచనలను జగన్ పట్టించుకోలేదని, కోర్టు ఆదేశాలతో ప్రభుత్వ నిర్ణయాలు తప్పని తేలిపోయిందని మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి అన్నారు.

ఇప్పటికైనా ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై.. కేంద్రంతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ హితవు పలికారు. మిగతా నేతలు కూడా తమదైన శైలిలో వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. ఒకవైపు టీడీపీ, మరోవైపు బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై వైసీపీ నేతలు నోరెత్తలేకపోతున్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఏం మాట్లాడాలో తెలియని డైలమాలో ఉండిపోయారు. అటు వైసీపీ అధికార న్యూస్ ఛానల్ సాక్షి కూడా దీనిపై వార్తలు వేయడం లేదు. అన్నీ వైపులా నుంచి విమర్శలు వస్తుండటంతో వైసీపీ నేతల దగ్గర సమాధానం లేకుండా పోయింది. మొత్తానికి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు వైసీపీ చెక్ పెట్టలేకపోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English