చిదంబరాన్ని లోపలేయించిన కేసు కంప్లీట్ స్టోరీ

చిదంబరాన్ని లోపలేయించిన కేసు కంప్లీట్ స్టోరీ

కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని బుధవారం రాత్రి సీబీఐ అరెస్ట్ చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న చిదంబరం అరెస్టును తప్పించుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేసినా ఏ ఒక్కటీ ఫలించలేదు. చివరకు ఆయన అరెస్టు తప్పలేదు.

ఇంతకీ... ఒకప్పుడు హోం, ఫైనాన్స్ వంటి కీలక శాఖలు నిర్వహించిన చిదంబరం అరెస్టుకు కారణమైన ఈ ఐఎన్ఎక్స్ కేసు పూర్వాపరాలేమిటి?

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం నిందితుడు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఆయన పై మనీ ల్యాండరింగ్ కేసు కూడా ఉంది. దీన్ని ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ఆయన దిల్లీ హైకోర్టులో అపీల్ చేశారు. అయితే, ఆయన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో చిదంబరం తరఫున ఆయన లాయర్లు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌రద్దు చేస్తూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరారు.
అయితే, ఈ పిటిషన్‌పై తక్షణం విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. అనంతరం చిదంబరం ప్రెస్ మీట్ పెట్టి తనపై ఈ కేసులో ఎలాంటి అభియోగాలూ లేవని చెప్పుకొచ్చారు.. ఆయన అలా ప్రెస్ మీట్ ముగించి ఇంటికి వచ్చారో లేదో సీబీఐ, ఈడీ అధికారులు వెళ్లి ఆయన్ను అరెస్టు చేశారు.

ఐఎన్ఎక్స్ మీడియా సంస్థ పై 2017 మే 15న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా, ఐఎన్ఎక్స్ ప్రెస్,  చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం, ఆయన ఆధ్వర్యంలో పనిచేసే చెస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు, మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులను ఇందులో నిందితులుగా సీబీఐ పేర్కొంది.

అయితే, ఈ ఎఫ్ఐఆర్‌లో చిదంబరం పేరు లేదు.  సీబీఐ ఎఫ్ఐఆర్‌ ప్రకారం చూస్తే ఐఎన్ఎక్స్ మీడియా సంస్థ తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు విదేశీ పెట్టుబడులు తీసుకోవాలని భావించింది. ఇందుకోసం ఫారెన్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎఫ్ఐపీబీ) అనుమతి కోరింది. ఒక్కో షేర్‌ను 10 రూపాయల ముఖ విలువతో జారీ చేస్తామని పేర్కొంది.

దీంతో ఐఎన్ఎక్స్ మీడియాలోకి 4 కోట్ల 62 లక్షల విదేశీ పెట్టుబడులకు ఎఫ్ఐపీబీ అనుమతి ఇచ్చింది. అదే సమయంలో ఐఎన్ఎక్స్ న్యూస్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థలోకి డౌన్‌స్ట్రీమ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి విడిగా అనుమతి తీసుకోవాలని ఎఫ్ఐపీబీ స్పష్టంగా చెప్పింది. ఎఫ్ఐపీబీ సిఫార్సుతో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థ దరఖాస్తుకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది.

అయితే, ఐఎన్ఎక్స్ మీడియా ఉద్దేశపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘించి, ఐఎన్ఎక్స్ న్యూస్‌ సంస్థలో 26శాతం డౌన్‌స్ట్రీమ్ ఇన్వెస్ట్‌మెంట్‌ చేసిందని సీబీఐ తన ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. డౌన్‌స్ట్రీమ్ ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం ఎఫ్ఐపీబీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉన్నా.. ఐఎన్ఎక్స్ మీడియా ఆ పని చేయలేదు.

4 కోట్ల 62 లక్షల రూపాయల విదేశీ పెట్టుబడులకు ఎఫ్ఐపీబీ అనుమతివ్వగా.. 305 కోట్లకుపైగా ఎఫ్‌బీఐలను సేకరించింది. విదేశీ పెట్టుబడిదారులకు ఒక్కో షేర్‌ను 10 రూపాయలకు కేటాయించాల్సి ఉండగా.. 800 రూపాయలకు ఒక షేర్ జారీ చేసింది. ఈ వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో 2008 ఫిబ్రవరిలో దీనిపై వివరణ ఇవ్వాలని ఇన్‌కం ట్యాక్స్ అధికారులు ఎఫ్ఐపీబీని కోరారు.

దీంతో తాము కూడా ఈ వ్యవహారంపై సమాంతరంగా దర్యాప్తు చేస్తామని ఐటీ శాఖకు ఎఫ్ఐపీబీ సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు లేఖ రాసింది. ఎఫ్ఐపీబీ నుంచి లేఖ అందుకున్న ఐఎన్ఎక్స్ మీడియా దీన్నుంచి తప్పించుకునేందుకు కార్తీ చిదంబరంతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడిందని F.I.R లో సీబీఐ పేర్కొంది.

కార్తీ చిదంబరం అప్పుడు ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరం కుమారుడు. చెస్ మెనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రమోటర్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. కార్తీ చిదంబరం తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆర్థికశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తే పని సాఫీగా సాగుతుందని ఆ సంస్థ భావించిందని సీబీఐ ఆరోపించింది.

ఆ తర్వాత చెస్‌ మెనేజ్‌మెంట్ సర్వీసెస్ సూచించినట్లుగా ఐఎన్ఎక్స్ మీడియా ఎఫ్ఐపీబీకి లేఖ రాసింది. అన్ని వ్యవహారాలు సక్రమంగానే జరిగాయంటూ వివరణ ఇచ్చింది. కార్తీ చిదంబరం ఒత్తిడితో ఈ కేసును ఎఫ్ఐపీబీ అధికారులు చూసీ చూడనట్లు వదిలేశారు. నిబంధనలు అతిక్రమించినందుకు చర్యలు తీసుకోకపోగా.. ఆ సంస్థకు మేలు చేసేందుకు ఆర్థిక శాఖ అధికారులు ప్రయత్నించారు.

ఐఎన్ఎక్స్ న్యూస్‌ సంస్థలోకి ఇది వరకే వచ్చిన డౌన్‌స్ట్రీమ్ ఇన్వెస్ట్‌మెంట్‌ అనుమతి కోసం కొత్తగా ఎఫ్ఐపీబీకి దరఖాస్తు చేయాలని సూచించారు. అధికారులు చెప్పినట్లు ఐఎన్ఎక్స్ మీడియా అప్లికేషన్ పెట్టడం, ఎఫ్ఐపీబీ ఆమోదించడం జరిగిపోయాయి. ఈ వివాదం నుంచి బయటపడేసినందుకు కార్తీ చిదంబరం ఆధ్వర్యంలో నడుస్తున్న చెస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌కి ఐఎన్ఎక్స్ మీడియా డబ్బులు చెల్లించినట్లు సీబీఐ తన ఎఫ్ఐఆర్‌లో ఆరోపించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English