విజయసాయిరెడ్డిపై విరుచుకుపడిన చిన్నమ్మ

విజయసాయిరెడ్డిపై విరుచుకుపడిన చిన్నమ్మ

వైసీపీ కీలక నేతల తీరు ఏపీ బీజేపీ నేతలకు ఆగ్రహం కలిగిస్తోంది. తాము పేరుకు బీజేపీ నేతలమైనా వైసీపీ కీలక నేతలు తరచూ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలను కలుస్తూ హడావుడి చేస్తుండడంపై రగిలిపోతున్నారు.

తాజాగా వైసీపీ నేత విజయసాయిరెడ్డి మరో అడుగు ముందుకేసి.. ఏకంగా తమకు మోదీ-షాల దన్ను ఉందని.. వారి ఆశీస్సులతోనే అన్ని పనులూ చేస్తున్నామని ప్రకటించడంతో ఏపీ బీజేపీ నేతలకు మరింత ఆగ్రహం తెప్పిస్తోంది.

చాలామంది లోలోన రగిలిపోయినా చిన్నమ్మ పురంధేశ్వరి మాత్రం బాహాటంగానే తన ఆగ్రహాన్ని వెల్లగక్కారు. అంతేకాదు.. విజయసాయిరెడ్డి మాటలు వారు చేసే తప్పులన్నిటికీ మోదీ-షాల ఆమోదం ఉందని చెప్పినట్లుగా ఉందంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు.

ఏపీ ప్రభుత్వానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. వీరిద్దరినీ సంప్రదించాకే జగన్ ఏ నిర్ణయమైనా తీసుకుంటున్నారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.  పురంధేశ్వరి ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్నారు. విద్యుత్ పీపీఏలను సమీక్షిస్తామనడం, పోలవరం టెండర్ల రద్దు, రివర్స్ టెండరింగ్ వంటి అన్ని తప్పులనూ బీజేపీ నెత్తిన రుద్దేలా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఆ నెపాలన్నీ విజయసాయిరెడ్డి తమపై నెట్టేయడం ఆశ్చర్యంగా ఉందన్నారామె.

వైసీపీ ప్రభుత్వం కూడా గత  తెలుగుదేశం ప్రభుత్వం తరహాలోనే వారి వైఫల్యాలను బీజేపీపైకి నెట్టివేసి చేతులు దులుపుకోవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం, విద్యుత్ పీపీఏలపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రాసిన లేఖను మర్చిపోవద్దని పురంధేశ్వరి సూచించారు. బీజేపీ కూడా ఈ అంశాలపై ఆందోళన వ్యక్తం చేసిందని చెప్పారు.

ఇంత జరిగితే మోదీజీ, అమిత్ షా జీలు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయవద్దని అన్నారు. మరి... ఇదే విషయాన్ని పురంధేశ్వరి కానీ ఇతర బీజేపీ నేతలు కానీ కేంద్రంలోని ఆ పార్టీ పెద్దల వరకు తీసుకెళ్లి.. వైసీపీ తప్పులను విజయసాయిరెడ్డి బీజేపీపై ఎలా నెట్టేస్తున్నారో వివరిస్తారో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English