దొన‌కొండ హాట్ కేక్ గురూ.. రీజ‌న్ ఇదేనా...?

దొన‌కొండ హాట్ కేక్ గురూ.. రీజ‌న్ ఇదేనా...?

రాత్రి కి రాత్రే.. దొన‌కొండ స్వ‌రూపం మారిపోయిందా?  నిన్న‌టి వర‌కు దీని మొహం కూడా చూడ‌ని కొంద‌రు రియ‌ల్ వ్యాపారులు ఇప్పుడు అక్క‌డే తిష్ట‌వేశారా?  నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎక‌రం 5 ల‌క్ష‌లు అన్నా కొనేందుకు ఎవ‌రూ ముందుకు రాని ప‌రిస్థితి నుంచి ఇప్పుడు 20 ల‌క్ష‌ల‌న్నా కూడా క‌ళ్లుమూసుకుని కొనేందుకు రెడీ అయ్యారా? అంటే.. తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్నవారు ఔన‌నే అంటున్నారు. విష‌యంలోకివెళ్తే.. అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంపై తాజాగా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌నలు చేశారు.

నిన్న వీరిద్ద‌రూ వివిధ ప్రాంతాల్లో మాట్లాడుతూ.. అమ‌రావ‌తి భూములు వృథా అని అక్క‌డ ఏదైనా నిర్మాణం చేస్తే.. ల‌క్ష‌కు రెండు ల‌క్ష‌లు ఖ‌ర్చుచేయాల్సి వ‌స్తోంద‌ని చెప్పారు. అంటే.. వీరి ఉద్దేశంలో అమ‌రావ‌తిలో రాజ‌ధాని నిర్మాణం దాదాపు అట‌కెక్కిన‌ట్టే.అదే స‌మ‌యంలో 2014లో రాజ‌ధానిపై నియ‌మించిన శివ‌రామ‌కృష్ణ క‌మిటీ చెప్పిన విష‌యాల‌ను కూడా ఉటంకించారు. కృష్ణాన‌దికి వ‌ర‌ద వ‌స్తే.. అమ‌రావ‌తి మునిగిపోతుంద‌ని, నిన్న‌టికి నిన్న ఇదే జ‌రిగింద‌ని బొత్స వెల్ల‌డించారు.

ఇక‌, విజ‌య‌సాయి మాట్లాడుతూ.. అక్క‌డ అన్నీ చ‌వుడు భూముల‌ని వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ ప్ర‌భుత్వం అమ‌రావ‌తి విష‌యంలో యూటర్న్ తీసుకుంద‌నే విష‌యం సోష‌ల్ మీడియాలో విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, పూర్తిగా కాకుండా కొన్ని నిర్మాణాలు ఇక్క‌డే  ఉంచి, అమ‌రావ‌తి ప‌రిధిని త‌గ్గించే ప్ర‌య‌త్నం మాత్రం చేయొచ్చు.

అదే స‌మ‌యంలో శివ‌రామ‌కృష్ణ క‌మిటీ సూచించిన విధంగా ప్ర‌కాశం జిల్లా దొన‌కొండ‌లో పారిశ్రామిక సంస్త‌ల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం పెద్ద‌పీట వేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. దీనిని ముందుగానే గుర్తించిన రియ‌ల్ వ‌ర్గాలు.. ఇప్ప‌డు అక్క‌డ కు క్యూ క‌ట్టాయి. ఇప్పుడు దొనకొండలోని ఎకరం భూమి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా పలుకుతోంది.

మరికొన్ని రోజుల్లో.. ఇది నాలుగు రెట్లు అయ్యే అవకాశాలు కూడా ఉన్నయ‌నే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. నిజానికి 2014 ప్రారంభంలోనే కొంద‌రు వైసీపీ నాయ‌కులు ఇక్క‌డ భూములు కొనుగోలు చేశారు. రాజ‌ధానిని ఇక్క‌డే నిర్మించాల‌ని కూడా బాబుపై ఒత్తిడి తెచ్చారు. అయితే, చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మాత్రం అమ‌రావ‌తిని ఎంచుకుంది. కానీ, ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం రావ‌డం, అమ‌రావ‌తిపై నాన్చుడు వ్య‌వ‌హారానికి తెర‌దీయడం, ఇప్పుడు బొత్స సంకేతాలు ఇచ్చిననేప‌థ్యంలో దొన‌కొండ‌లో భూముల రేట్లు అమాంతం పెరిగాయి. మ‌రి రాబోయే రోజుల్లో ఏం జ‌రుగుతుందో చూడాలి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English