జ‌గ‌న్ ప్రత్యేక హోదా పక్కకు వెళ్లిపోయిందా...!

జ‌గ‌న్ ప్రత్యేక హోదా పక్కకు వెళ్లిపోయిందా...!

ప్రత్యేకహోదా....రాష్ట్రం విడిపోయాక ఈ పేరు ఎంత మారు మ్రోగిందో అందరికీ తెలుసు. ఒకానొక దశలో దీని మీదే ఏపీ రాజకీయాలు నడిచాయి కూడా. గత టీడీపీ ప్రభుత్వం , కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దీన్ని తుంగలో తోక్కేసిన జగన్ నేతృత్వంలోని వైసీపీ దీనికోసం పోరాడుతూనే వచ్చింది. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసింది. అటు జనసేన, కాంగ్రెస్ పార్టీలు కూడా ప్రత్యేకహోదా కోసం మాట్లాడాయి. చివరికి తెలుగుదేశం కూడా బీజేపీతో తెగదెంపులు చేసుకుని వైసీపీ లైన్ లోకి వచ్చి ప్రత్యేకహోదా కావాల్సిందే అని డిమాండ్ చేసింది. దానికోసం ధర్మపోరాట దీక్షలు కూడా చేసింది.

ఈలోపు ఎన్నికలు వచ్చాయి. టీడీపీ, వైసీపీలు 25కి 25 ఎంపీలు కట్టబెడితే కేంద్రం మెడలు వచ్చి ప్రత్యేక హోదా సాధించవచ్చని ప్రచారాల్లో ఊదరగొట్టేశాయి. చివరికి జనం వైసీపీకి పట్టం కట్టారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలని గెలిపించారు. అటు కేంద్రంలో బీజేపీ భారీ మెజారిటీతో మరోమారు అధికారంలోకి వచ్చింది. దీంతో జగన్ ప్రత్యేక హోదా విషయంలో ఢీలా పడిపోయారు. కేంద్రం ఇవ్వకపోయిన సఖ్యతతో ఉండి సహనంతో ప్రత్యేక హోదా  సాధించాలని ప్రకటించారు.

అయితే బీజేపీ మాత్రం ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయనం అని దాని బదులు ఇంకా వేరేది ఏమన్నా అడగమని చాలా సార్లు ప్రకటన చేసింది. కానీ జగన్ ప్రత్యేక హోదాపై ప్రమాణస్వీకారం రోజు, తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ స్పీచ్ లో ప్రస్తావించారు. అలాగే అసెంబ్లీలో దీనిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అయితే ఆ తర్వాత నుంచి ప్రత్యేక హోదా వాదం పక్కకు వెళ్ళిపోయినట్లు కనిపిస్తోంది. జగన్ గానీ, ఆ పార్టీ నేతలు గానీ ప్రత్యేక హోదా గురించి పెద్దగా మాట్లాడటం లేదు.

ఇటీవల స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో అన్నీ పరిస్థితులు గురించి మాట్లాడినా జగన్, హోదా గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఇదంతా చూస్తుంటే జగన్ ప్రత్యేక హోదా విషయాన్ని మరిచిపోయినట్లు కనిపిస్తోంది. పైగా బీజేపీ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తూనే ఉంది. అలాగే హోదా ఊసే ఎత్తవద్దని చెబుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ హోదా గురించి మాట్లాడటం లేదని పోలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అటు టీడీపీ అయితే హోదాతో మాకు సంబంధం లేనట్లు ఉంది. జగన్ కి 22 ఎంపీ సీట్లు ఇచ్చారు కాబట్టి హోదా తెచ్చే బాధ్యత ఆయనదే అని టీడీపీ నేత‌లు చెపుతున్నారు. ఇక జనసేనాని అయితే హోదాని ఎప్పుడో పక్కకి పెట్టేశారు. ఆయన హోదా గురించి మాట్లాడి రెండు సంవత్సరాలు అవుతుంది. మొత్తం మీద ప్రత్యేక హోదాని అన్నీ పార్టీలు పక్కన పెట్టేశాయని అర్ధమవుతుంది. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English