యడ్డీ కేబినెట్ లో శ్రీరాములు... ‘గాలి’ చక్రం తిరిగేనా?

యడ్డీ కేబినెట్ లో శ్రీరాములు... ‘గాలి’ చక్రం తిరిగేనా?

కన్నడ నాట కొత్త కేబినెట్ కొలువుదీరింది. గత నెలలో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల మధ్య అప్పటి సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి పదవి నుంచి దిగిపోగా... 26న కొత్తగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడగా, ఆ పార్టీ కర్ణాటక అధ్యక్షుడు బీఎస్ యడియూరప్ప సీఎంగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. దాదాపుగా నెల రోజుల పాటు కేబినెట్ లేకుండానే నెట్టుకొచ్చిన యడ్డీ... ఎట్టకేలకు మంగళవారం 17 మంది మంత్రులతో తన కేబినెట్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కేబినెట్ లో మాజీ మంత్రి, గనుల కుంభకోణం సూత్రధారి గాలి జనార్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు బి. శ్రీరాములుకు చోటు దక్కింది. వాల్మీకీ సామాజిక వర్గం కోటాలో శ్రీరాములును యడ్డీ తన కేబినెట్ లో చేర్చుకున్నారు.

ఇక్కడిదాకా బాగానే ఉన్నా... గతంలో యడ్డీ సర్కారు పాలనలో నాడు మంత్రిగా ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి ఓ రేంజిలో చక్రం తిప్పారు. సీఎం కాకున్నా కూడా ప్రతి నిర్ణయంలోనూ తన పాత్ర ఉండేలా ఆయన చక్రం తిప్పారు. అయితే గనుల కుంభకోణం వెలుగులోకి రావడం, గాలి జైలుకెళ్లడం చకచకా జరిగిపోగా... అసలు ఎన్నికల్లో నిలిచేందుకే గాలి అర్హత కోల్పోయారు. గాలి లేకుంటేనేం... ఆయన ప్రధాన అనుచరుడిగా ముద్ర పడిన శ్రీరాములు కన్నడనాట తనదైన శైలిలో రాణిస్తున్నారు. తాజాగా ఏర్పడ్డ బీజేపీ ప్రభుత్వంలో గాలి కోటాలో శ్రీరాములుకు ఏకంగా డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందన్న వార్తలు వినిపించాయి. అయితే డిప్యూటీ దక్కకపోయినా యడ్డీ కేబినెట్ లో శ్రీరాములుకు స్థానం అయితే దక్కింది. ఇంకా శాఖలు కేటాయించకున్నా... శ్రీరాములుకు కీలక శాఖ బాధ్యతలు దక్కడం ఖాయంగానే కనిపిస్తోంది.

కన్నడ నాట బళ్లారి ప్రాంతంలో తనదైన శైలి ఫాలోయింగ్ కలిగిన శ్రీరాములు... గతంలో గాలి జనార్ధన్ రెడ్డి మాదిరి చక్రం తిప్పడం కూడా ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది. ఎన్ని కష్టాలు ఎదురైనా బీజేపీని వీడకుండా కొనసాగుతున్న గాలి బ్యాచ్ లో గాలి సోదరులున్నా కూడా శ్రీరాములుకే అత్యధిక ప్రాధాన్యం దక్కుతోంది. ఈ క్రమంలో గాలి కోటాలోనే మంత్రి పదవిని దక్కించేసుకున్న శ్రీరాములు తన బాస్ గాలి జనార్ధన్ రెడ్డి తరహాలో చక్రం తిప్పడం అయితే ఖాయమేనన్న విశ్లేషణలు లేకపోలేదు. చూద్దాం... గాలి లేని కేబినెట్ లో గాలి అనుంగుడు ‘గాలి’ చక్రాన్ని తిప్పుతారో? లేదో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English