ఏపీ అసెంబ్లీ సామగ్రి కోడెల ఇంట్లో!

ఏపీ అసెంబ్లీ సామగ్రి కోడెల ఇంట్లో!

వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం లేకుండా వెనుకాల కేసులు, ఆరోపణలు తరుముతూనే ఉన్నాయి. పోలింగ్ రోజున ఆయన్ను తరిమితరిమి కొట్టినప్పటి నుంచి మొదలైన ఈ తరుములా ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది.

కోడెల తో పాటు ఆయన కుమారుడు, కుమార్తెకూ ఈ పరిస్థితి తప్పలేదు. కొద్దిరోజులుగా కాస్త గ్యాప్ దొరికినట్లు అనిపించిన ఆయనకు మరోసారి భారీ షాక్ తగిలింది. ఇప్పటివరకు తగిలిన వరుస షాక్‌ల అనుభవమో ఏమో కానీ ఈసారి వెంటనే ఆయన సరెండర్ అయిపోయినట్లుగా కనిపిస్తోంది. ఇంతవరకు దందాలు, వసూళ్ల ఆరోపణలు రాగా ఇప్పుడు అసెంబ్లీ నుంచి ఫర్నీచర్, ఏసీలు ఎత్తుకెళ్లారంటూ ఫిర్యాదులు రావడంతో ఆయన.. అవన్నీ తన ఇంట్లోనే ఉణ్నాయని.. వచ్చి పట్టుకెళ్లాలని, లేదంటే వాటికి ఎంత డబ్బులు అవుతుందో అంతా ఇచ్చేస్తానని చెబుతున్నారు.

టీడీపీ నేత కోడెల శివప్రసాద్ హయాంలో ఏపీ అసెంబ్లీ ఫర్నీచర్, ఏసీలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే అధికారులు ఇంతవరకూ ఈ వ్యవహారంపై కేసు నమోదుచేయలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత కోడెల శివప్రసాద్ ఈ వివాదంపై స్పందించారు.

హైదరాబాద్ నుంచి ఏపీ అసెంబ్లీకి సామగ్రిని తరలించేటప్పుడు కొంత ఫర్నీచర్ ను తాను వినియోగించుకున్నానని కోడెల తెలిపారు. తన దగ్గరున్న ఫర్నీచర్ ను తీసుకెళ్లాల్సిందిగా అసెంబ్లీ అధికారులకు లేఖ కూడా రాశానని ఆయన వెల్లడించారు. కానీ అసెంబ్లీ అధికారులు తన లేఖపై ఇంతవరకూ స్పందించలేదని వాపోయారు. అధికారులు వస్తే ఫర్నీచర్ అప్పగిస్తానని కోడెల చెప్పారు. లేదంటే ఈ ఫర్నీచర్ కోసం ఎంత ఖర్చయిందో చెబితే తాను చెల్లించేందుకు సిద్ధమేనని కోడెల చెప్పారు.

2017, మార్చి నెలలో ఏపీ అసెంబ్లీకి తరలిస్తున్న కొంత ఫర్నీచర్, కొన్ని ఏసీలు మాయం కావడంపై అసెంబ్లీ కార్యదర్శి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసెంబ్లీకి చేరుకున్న పోలీసులు, సామగ్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఫిర్యాదులు, విచారణ అన్నిటి టార్గెట్ తానేనని కోడెలకు అర్థమైనట్లుంది. వెంటనే ఆయన అన్నీ తన దగ్గరే ఉన్నాయని, వచ్చి పట్టుకెళ్లాలని చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English