కేటీఆర్ సెల్ఫ్‌గోల్‌...బీజేపీ దాడి మామూలుగా లేదే

కేటీఆర్ సెల్ఫ్‌గోల్‌...బీజేపీ దాడి మామూలుగా లేదే

టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ సోష‌ల్ మీడియాలో ఎంత చురుకుగా ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. స‌మాచారం, స‌హాయం, నెటిజ‌న్ల‌తో స‌ర‌దా సంభాష‌ణ‌లు..ఇలా అన్నింటినీ కేటీఆర్ సోష‌ల్ మీడియా వేదిక‌గానే కానిచ్చేస్తారు.

అయితే, అదే సోష‌ల్ మీడియా వేదిక‌గా కేటీఆర్‌కు ఘాటు కౌంట‌ర్ వ‌చ్చింది. ఫ్లోలో కేటీఆర్ మాట్లాడిన మాట‌ల‌ను అదే రీతిలో స్పందించారు. బీజేపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ న‌డ్డా తెలంగాణ రాష్ట్రంలో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా కేటీఆర్ స్పందిస్తూ జేపీ నడ్డా పేరు ఇదివరకు తాను వినలేదని అన్నారు.

అయితే, కేటీఆర్ వ్యాఖ్యలకు ఊహించ‌ని స్పంద‌న వ‌చ్చింది. బీజేపీ నేత‌లు అదే రీతిలో స్పందించారు. టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి ఇటీవ‌లే బీజేపీలో చేరిన మాజీ ఎంపీ జి.వివేక్ స్పందించారు. నడ్డాతో కేటీఆర్ భేటీ అయినప్పటి ఫొటోను, న్యూస్పేపర్లలో వచ్చిన వార్తను, నడ్డాతో సమావేశమైనట్లు అప్పట్లో కేటీఆర్ చేసిన ట్వీట్ను వివేక్ పోస్టు చేశారు. "కేటీఆర్.. మీరు నడ్డాను కలిసిన విషయం మరిచిపోయారా?" అంటూ కేటీఆర్‌ను కెలికారు. నడ్డా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్ప‌టి సంద‌ర్భాన్ని ప్ర‌స్తావిస్తూ...ఈ ట్వీట్ చేశారు.

"ఫార్మాసిటీ కోసం రూ. 1500 కోట్లు కావాలని కేంద్ర ఆరోగ్య‌శాఖ‌మంత్రిగా ఉన్న జేపీ న‌డ్డాను 2016లో  మీరు కలిశారు కదా! విభజన చట్టంలో లేకపోయినా బీబీనగర్లో ఎయిమ్స్ను ఆయన మంజూరు చేశారు కదా!" అని ట్వీట్ చేశారు.  "ప్రేమ, కృతజ్ఞతతో ఉండటం మన తెలంగాణ సంస్కృతి. తెలంగాణ ఉద్యమ సమయంలో మీకు, మీ పార్టీకి అండగా నిలిచినవాళ్లను మీరు, మీ పార్టీ సులభంగా మరిచిపోయి ఉండొచ్చు. కానీ.. తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు" అని కేటీఆర్కు చురకలంటించారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English