అన్న మంత్రి తో అలిగిన సీనియర్‌కు జగన్ మరో షాక్

 అన్న మంత్రి తో అలిగిన సీనియర్‌కు జగన్ మరో షాక్

మొన్నటి ఎన్నికల్లో దుమ్మురేపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత ఆ పార్టీ తొలి ప్రభుత్వంలో మంత్రి పదవులను ఆశించిన సీనియర్లలో కొందరికి భంగపాటు తప్పలేదు.

అందులో ధర్మాన ప్రసాదరావుది మొట్టమొదటి పేరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుడి భుజాల్లో ఒకరిగా వ్యవహరించిన ధర్మాన ఆయన మరణం తరువాత కొంత గ్యాప్ తీసుకుని జగన్ పార్టీలో చేరారు.

అయితే.. పార్టీ తనకు ఉపయోగపడాలి అనుకున్నారే కానీ తాను పార్టీకి ఉపయోగపడే పనులేవీ చేయలేదని వైసీపీ నేతలే అంటుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించినా జగన్ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు.

ఆయనకు బదులుగా మొదటి నుంచి తన వెన్నంటి వచ్చిన ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్‌కు మంత్రి పదవి ఇచ్చారు. ఈ పరిణామం ధర్మాన ప్రసాద్‌ను అసంతృప్తితో రగిలిపోయేలా చేసిందట. అధికారం లేకపోతే ఏమవుతందన్నది మెల్లమెల్లగా ఆయనకు అర్థమవుతోంది కూడా అని చెబుతున్నారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాద్‌కు బదులు కృష్ణదాస్ సెంటర్ పాయింట్‌గా మారారు.

ఇలాంటి తరుణంలో ప్రసాద్‌ను మరింత ఇబ్బంది పెట్టేలా కృష్ణదాస్‌కు ప్రాధాన్యమిస్తూ జగన్ కీలక అడుగు వేస్తున్నారు. జగన్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ఆయన శ్రీకాకుళం నుంచే శ్రీకారం చుడుతున్నారు. అది కూడా మంత్రి ధర్మాన కృష్ణదాస్ నియోజకవర్గమైన నరసన్నపేట నుంచి మొదలుపెడుతున్నారని తెలుస్తోంది.

సెప్టెంబరు 1న నరసన్నపేట లేదా పోలాకి మండలం ఈదులవలసలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారని చెబుతున్నారు. కృష్ణదాస్‌కు మంత్రి పదవి వచ్చిందన్న కారణంతో తమ్ముడు ధర్మాన ప్రసాద్ లోపల్లోపల రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో పట్టు సాధించడానికి.. జిల్లాలో తానే కీలకం అన్న మెసేజ్ పూర్తిస్థాయిలో పంపించడానికి కృష్ణదాసే జగన్‌ను రమ్మని కోరినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. ధర్మాన్ ప్రసాద్ రాజకీయాల విషయమూ జగన్ వరకు వెళ్లిందని.. అందుకే కృష్ణదాస్‌ను ప్రొజెక్ట్ చేయడానికి ఆయనే వస్తున్నారని తెలుస్తోంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English