సాధినేనికి తోడుగా దివ్యవాణి... టీడీపీకి డబుల్ షాకేనా?

సాధినేనికి తోడుగా దివ్యవాణి... టీడీపీకి డబుల్ షాకేనా?

తాజాగా ముగిసిన ఎన్నికల్లో టీడీపీకి దక్కిన ఘోర పరాభవం ఆ పార్టీని భారీ కుదుపులకు గురి చేసిందని చెప్పాలి. దాదాపుగా నాలుగు పదుల ప్రస్థానం కలిగిన టీడీపీకి ఈ దఫా దక్కినంత పరాజయం గతంలో ఎన్నడూ దక్కలేదనే చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో పార్టీకి అండగా నిలబడాల్సిన కీలక నేతలంతా అందుకు విరుద్ధంగా కదులుతున్నారు.

ఈ క్రమంలోనే సుజనా, సీఎం రమేశ్ వంటి కీలక నేతలు పార్టీని వీడగా... పార్టీ తురుపు ముక్కలుగా పేరు తెచ్చుకున్న సాధినేని యామినీ శర్మ, సినీ నటి దివ్యవాణిలు కూడా ఇప్పుడు పార్టీకి షాకిచ్చేందుకు రెడీ అయ్యారట. టీడీపీకి గుడ్ బై చెప్పనున్న సాధినేని, బీజేపీలో చేరతారని గడచిన రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సాధినేనితో పాటు ఎన్నికలకు ముందు టీడీపీలో ఓ వెలుగు వెలిగిన దివ్యవాణి కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి.

సాధినేని మాదిరే దివ్యవాణి కూడా సరిగ్గా ఎన్నికలకు కాస్తంత ముందుగా టీడీపీలో చేరారు. పార్టీలో చేరిందే తడవు టీడీపీ ప్రత్యర్థులు... ప్రత్యేకించి వైసీపీ నేతలు, అందులోనే ప్రత్యేకించి నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై తనదైన శైలిలో విరుచుకుపడిన దివ్యవాణి నిత్యం వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో నగరి టికెట్ ఇస్తే రోజాను ఓడించి తీరతానని శపథం కూడా చేశారు.

అయితే ఎన్నికల వేళ చిత్తూరు జిల్లా సమీకరణాల్లో భాగంగా దివ్యవాణికి టికెట్ దక్కలేదు. అయినా కూడా ఏమాత్రం వెనక్కు తగ్గని దివ్యవాణి వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ తనదైన శైలిలో రెచ్చిపోయారనే చెప్పాలి. ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యమని, టీడీపీ విజయాన్ని ఏ ఒక్కరూ ఆపలేరని దివ్యవాణి చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయనే చెప్పాలి.

అయితే అటు సాధినేనితో పాటు ఇటు దివ్యవాణి అంచనాలన్నీ తలకిందులు కాగా... టీడీపీకి ఘోర పరాభవం దక్కగా, తాము ఏకిపారేసిన వైసీపీ బంపర్ విక్టరీ కొట్టేసింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణమే సాధినేని సైలెంట్ కాగా... దివ్యవాణి మాత్ర ఒకటి రెండు సార్లు మీడియాతో మాట్లాడారు. అయితే ఆ తర్వాత ఏమనుకున్నారో, ఏమో తెలియదు గానీ... సాధినేని మాదిరే దివ్యవాణి కూడా సైలెంట్ అయిపోయారు.

తాజాగా ఇప్పుడు సాధినేని టీడీపీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు వినిపిస్తున్న తరుణంలో దివ్యవాణి కూడా సాధినేని బాటలోనే నడిచేందుకు సిద్ధమయ్యారట. వీరిద్దరూ పార్టీని వీడి బీజేపీలో చేరితే... టీడీపీకి మాత్రం డబుల్ షాక్ తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి వలసలు మొదలైన సంగతి తెలిసిందే. ఏపీలో బంపర్ మెజారిటీతో గెలిచిన వైసీపీ ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించకపోవడంతో అసంతృప్త నేతలంతా బీజేపీ వైపు చూస్తున్నారు. ఏపీలో బలమైన పక్షంగా ఎదగాలని వ్యూహరచన చేస్తున్న కమలనాథులు కూడా వలసదారులను శక్తిమేర ప్రోత్సహిస్తున్నారు. అయితే, టీడీపీలో ఫైర్ బ్రాండ్లుగా పేరుపొందిన సాధినేని యామిని, దివ్యవాణి కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల కాలంలో వీరిద్దరు తెరపైకి వచ్చిందే లేదు. దాంతో వారు పార్టీ మారుతున్నారంటూ సాగుతున్న ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్టయింది. కొన్నిరోజుల క్రితం యామిని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణను కలవడంతో ఆమె కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమంటూ కథనాలు వెల్లువెత్తాయి. దీనిపై యామిని నుంచి మౌనమే సమాధానం అయింది.

మామూలు కార్యకర్తగా పార్టీలోకి వచ్చిన ఆమె వైసీపీ అధినేత జగన్ పైనా, ఆ పార్టీ నేతలపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేసి టీడీపీ అధిష్ఠానం దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే ఆమెకు అధికార ప్రతినిధిగా హోదా ఇచ్చారు. దాంతో మరింత విజృంభించిన యామిని జనసేనాని పవన్ కల్యాణ్ పై భారీ స్థాయిలో విరుచుకుపడింది. పవన్-మల్లెపూలు ఎపిసోడ్ తో ఆమెకు ఎక్కడలేని పాప్యులారిటీ ఇచ్చింది. ఓ దశలో ఆమె పార్టీ టికెట్ ఆశించినట్టు వార్తలు వినిపించాయి. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ పరంగా ఆమె నుంచి ఎలాంటి స్పందనలేదు.

మరోవైపు, దివ్యవాణి కూడా చాలాకాలంగా మీడియా ముందుకు రావడంలేదు. ఎన్నికల ముందు వైసీపీ నేతలను కడిగిపారేసిన దివ్యవాణి, ఎన్నికల ఫలితాల తర్వాత ఓ రెండుమూడు సార్లు హడావుడి చేసింది తప్ప ఆపై తాను కూడా తెరమరుగైంది. ఆమె కూడా బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English