ఆ యువరాణి టీడీపీని పాలిస్తుందా..!

ఆ యువరాణి టీడీపీని పాలిస్తుందా..!

విజయనగరం జిల్లా పేరు చెప్పగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది రాజులు రాజ్యాలు. అయితే అప్పుడు రాజ్యాలు పక్కనబెడితే ఇప్పుడు రాజ్యాలు అన్నీ రాజకీయాలతో  ముడిపడి ఉన్నాయి. ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీకి అశోక్ గజపతిరాజు పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన కనుసన్నలోనే పార్టీ నడిచేది. ప్రస్తుతం ఆయనకు వయసు మీద పడుతుంది. పైగా సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అటు జిల్లా మొత్తం అసెంబ్లీ స్థానాలని వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.  

దీంతో ఎన్నికల తర్వాత టీడీపీ సైలెంట్ అయిపోయింది. అశోక్ గజపతి రాజు కూడా పెద్ద యాక్టివ్ గా కనపడట్లేదు. మిగిలిన నేతలు చెట్టుకోకరు, పుట్టకోకరు అన్నట్లు అయిపోయారు. దీంతో జిల్లాలో టీడీపీనీ ముందుకు నడిపించేది ఎవరని కార్యకర్తల్లో ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలోనే అశోక్ గజపతిరాజు తనయ అతిథి గజపతిరాజు తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని  జిల్లాలో టీడీపీని నడిపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అదితి కూడా మొన్న ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

అయినా ఆమె పార్టీని దగ్గర ఉండి నడిపించాలని చూస్తున్నారు. జిల్లాలో దారుణంగా ఓడిపోవడంతో నైరాశ్యంలో ఉన్న కార్యకర్తలని యాక్టివ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే తండ్రిలాగా అదితికి పార్టీని సమర్ధవంతంగా నడిపించడం వస్తుందా అనేది కార్యకర్తల్లో అనుమానం ఉంది. పైగా అదితి ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ నుంచి పలువురు నాయకులు వైసిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీన్ని ఆపాల్సిన బాధ్యత అదితిదే.

మరోవైపు జిల్లాలో వైసీపీ కేడర్ బలంగా ఉంది. దానికి ధీటుగా టీడీపీ కేడర్ ని తయారుచేయాల్సిన అవసరం ఉంది. పైగా జిల్లాలో కొంతకాలంగా టీడీపీని వర్గపోరు వెంటాడుతోంది. ఇటువంటి తరుణంలో అన్ని గ్రూపులను ఒకేతాటిపైకి అదితి గజపతి ఎలా తీసుకొస్తారో అనేది చూడాలి. అందరిని కలుపుకుని పార్టీని బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేసి తనముద్ర వేసుకుంటారో చూడాలని పార్టీ కార్యకర్తలు ఆలోచిస్తున్నారు.

మరోవైపు స్థానిక సంస్థలతోపాటు, మున్సిపల్‌ ఎన్నికలు రానుండడంతో కేడర్‌లో ఆత్మస్థైర్యాన్ని నింపి, జిల్లాలో ఆమె పార్టీని ఎలా ముందుకు నడిపించగల్గుతారోనని తెలుగు తమ్ముళ్ళు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గజపతి తనయ ఒకవైపు అధికార వైసీపీని, మరోవైపు చాపకింద నీరులా విస్తరిస్తున్న బీజేపీని అడ్డుకుని జిల్లాలో టీడీపీని ఏ మేర బలోపేతం చేస్తారో ?  చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English