డ్రీం ప్రాజెక్టు చూసిన కేసీఆర్ ఎంతలా రగిలిపోయారంటే?

డ్రీం ప్రాజెక్టు చూసిన కేసీఆర్ ఎంతలా రగిలిపోయారంటే?

ప్రతి ప్రభుత్వానికి ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి. అలానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొన్ని ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు.. మిషన్ భగీరథ.. యాదాద్రి పుణ్యక్షేత్రం లాంటివి చెప్పొచ్చు. మిగిలిన వాటి సంగతి ఎలా ఉన్నా.. యాదాద్రి పునర్నిర్మాణం.. విస్తరణ పనులు ఎంతవరకూ వచ్చాయన్న విషయాన్ని పరిశీలించేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోపం కట్టలు తెగింది.

ఈ ఏడాది చివర్లో మహా సుదర్శనయాగాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని.. రాష్ట్రపతి.. ప్రధాని మోడీదగ్గర నుంచి వివిధ రాష్ట్రాల నుంచి భారీగా ముఖ్యమంత్రులు.. పెద్ద ఎత్తున గవర్నర్లతో సహా వందలాదిగా ప్రముఖులు ఈ యాగానికి హాజరయ్యేలా ప్లాన చేస్తున్నారు కేసీఆర్. అయితే.. ఈ యాగం మొత్తం యాదాద్రి విస్తరణ పనుల మీదనే ఆధారపడి నడుస్తుంది. దీంతో.. యాదాద్రి పనులను సమీక్షించటానికి వచ్చిన కేసీఆర్.. అక్కడి గ్రౌండ్ పనుల్ని చూశాక నోట మాట రాలేదట.

ఆర్నెల్ల క్రితం తాను వచ్చినప్పుడు ఏ పనులు ఉన్నాయో.. ఇప్పుడూ అదే పనులు నడుస్తున్నాయని.. ఇలా అయితే ఐదేళ్లకైనా పనులు పూర్తి అయ్యే అవకాశం ఉందా? అని అగ్రహంగా అడగటమే కాదు.. అధికారులపై నిప్పులు చెరిగారు. ఫిబ్రవరిలో మహా సుదర్శనయాగం చేయాల్సి ఉందని.. ఇలాంటి వేళ పనులు జరగకుండా ఉంటే ఎలా? అన్న ప్రశ్నతో పాటు.. తమాషాగా ఉందా?  ఇప్పుడు చేస్తున్నట్లు చేస్తే ఐదేళ్ల తర్వాత అయినా పూర్తి అవుతాయా? అని ఆగ్రహంతో ప్రశ్నించారు.

ఆలయ పరిసరాల్లో పనుల్ని మూడు నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టిన కేసీఆర్ మాటతో అధికారుల గొంతులో తడారిపోయింది. పనులకు తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కొంటున్న విషయాన్ని చెప్పలేక చెప్పిన వైనంతో అప్పటికప్పుడు రూ.54 కోట్లు విడుదల చేస్తున్నట్లుగా చెప్పేశారు.

ఆలయంలోని ప్రతి భాగాన్ని పరిశీలించిన కేసీఆర్.. ఎంత డిటైల్డ్ గా ఉన్నారంటే.. కేవలం ఆలయం చుట్టూ తిరగటానికే ఆయనకు రెండు గంటల సమయం పట్టటం గమనార్హం. ఇటీవల కాలంలో సీఎం కేసీఆర్ లో ఇంతటి ఆగ్రహాన్ని తామిప్పటివరకూ చూడలేదంటున్నారు. ఇదే రీతిలో కేసీఆర్ వరుస పెట్టి తనిఖీలు నిర్వహించి.. రివ్యూలు చేస్తే తప్పించి పనులు పరుగులు పెట్టవంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English