పవన్ రాజకీయాలపై చిరు కామెంట్

పవన్ రాజకీయాలపై చిరు కామెంట్

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో చేదు అనుభవమే ఎదుర్కొన్నారు. మామూలుగా చూస్తే పార్టీ పెట్టిన 9 నెలల్లో ఎన్నికలకు వెళ్లి 18 సీట్లు సాధించడం మంచి విషయమే. కానీ చిరు లక్ష్యం సీఎం కావడం, పార్టీని అధికారంలోకి తేవడం కావడంతో.. 18 సీట్లను వైఫల్యంగానే భావించాడు. రెండేళ్లు తిరక్కుండానే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాడు. మూడేళ్లు మంత్రిగా, ఆరేళ్లు ఎంపీగా ఉండి ఆపై రాజకీయాలకు స్వస్తి చెప్పేశాడు చిరు.

ఐతే చిరు నిష్క్రమించడానికి ముందే ఆయన తమ్ముడు రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. పార్టీ పెట్టాడు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ఐతే చిరు ఎప్పుడూ కూడా పవన్ రాజకీయాల గురించి పెద్దగా స్పందించింది లేదు. ఈ టాపిక్ మీద మాట్లాడటం ఆయనకు ఇబ్బందికరమే. అందుకే ఈ వ్యవహారంపై సమాధానం దాటవేస్తుంటాడు చిరు.

ఐతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పవన్ రాజకీయాలపై చిరు మాట్లాడటం విశేషం. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా పవన్ ఓడిపోవడం మీదా చిరు స్పందించాడు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా పవన్ ధైర్యంగా జనాల ముందుకు వెళ్తుండటం గురించి ప్రశ్నిస్తే.. ‘‘ఇది జీవిత కాల పోరాటం. చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులకు వెరవకూడదు. పవన్ ఒక ఫైటర్. పోరాడుతూనే ఉంటాడు. నిరంతరం పోరాడేవాడిని ఏదో ఒక రోజు విజయం వరించి తీరుతుంది. ఆ విజయాన్ని అందుకోవడానికి పవన్ అన్ని విధాలా అర్హుడు’’ అని చిరు పేర్కొన్నాడు.

రాజకీయాలపై మీరు మళ్లీ దృష్టిపెడతారట కదా.. ఓ పెద్ద పార్టీ నుంచి మీకు ఆహ్వానం వచ్చిందని ప్రచారం జరుగుతోందే అని చిరును ప్రశ్నిస్తే.. ‘‘అది వాళ్ల ఆశ. ఆలోచన. దానిపై నేనెలా స్పందిస్తాను. ప్రస్తుతానికి నా దృష్టంతా సినిమాలపైనే’’ అని తేల్చి చెప్పేశాడు మెగాస్టార్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English