జగన్ ప్రభుత్వంపై కార్పొరేట్ ఫైర్.. కారణమేంటి?

జగన్ ప్రభుత్వంపై కార్పొరేట్ ఫైర్.. కారణమేంటి?

చంద్రబాబు ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, ఒప్పందాలు, పథకాలు అన్నిటినీ సమీక్షిస్తున్న జగన్ ప్రభుత్వం తీరును కార్పొరేట్ దిగ్గజాలు కూడా తప్పు పడుతున్నారు. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్, ఏఐఐబీ వంటివి అమరావతి ప్రాజెక్టు నుంచి వెనక్కు వెళ్లడం... ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి దారుణ విధానాలు చూడలేదంటూ జగన్ పాలనపై ఎల్ అండ్ టీ ఎండీ గత నెలలో సీరియస్ కామెంట్లు చేయడం తెలిసిందే.

తాజాగా మరో పారిశ్రామికవేత్త కూడా జగన్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విటర్ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఏపీలో ప్రభుత్వ టెర్రరిజం కొనసాగుతోందంటూ  ఆర్యన్ క్యాపిటల్ అధినేత, కర్ణాటక పారిశ్రామిక వేత్త, అక్షయ పాత్ర సహా వ్యవస్థాపకుడు మోహన్ దాస్ పాయ్ ఆగస్టు 15న చేసిన ట్వీట్ బిజినెస్ సర్కిళ్లలో పెద్ద చర్చకే దారి తీసిందని తెలుస్తోంది. దేశంలోని కార్పొరేట్ సర్కిళ్లు, బిజినెస్ మీటింగుల్లో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమాదకరమా అన్న చర్చ నడుస్తున్నట్లు తెలుస్తోంది.

పీపీఏలపై సమీక్షలు రాష్ట్రానికి తీరని నష్టాన్ని తెచ్చిపెడుతుందని మే నెలలోనే సీఎం జగన్ కు లేఖ రాసిన మోహన్ దాస్ తాజాగా మరోసారి సీఎం జగన్ ను ట్యాగ్ చేస్తూ ఘాటుగా ట్వీట్ చేశారు. జపాన్ కంపెనీలు లేఖ రాసిన తర్వాత అయినా కళ్లు తెరుచుకోవద్దా? అని ప్రశ్నించిన అయన ఇలా చేస్తే ఏపీకి పరిశ్రమలు ఎలా వస్తాయని, ఇండస్ట్రీని దెబ్బతీసి రాష్ట్రాన్ని కుప్పకూల్చేలా చేస్తారా? అని ప్రశ్నించారు. ఏపీ భవిష్యత్‌ను జగన్‌ నాశనం చేస్తున్నారన్నారని అయన ఘాటుగా మండిపడ్డారు.

కాగా మూడు వారాల కిందట ఎల్ అండ్ టీ సంస్థ ఎండీ కూడా ఏపీలో పరిస్థితులపై ఘాటుగా స్పందించారు. ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని జగన్ పాలనపై ఆయన విమర్శలు కురిపించారు.  ఆంధ్రప్రదేశ్‌లో ఎల్ అండ్ టీ వంతెనలు, రహదారులు, సోలార్ ప్రాజెక్టులు, సిమెంట్ ప్లాంట్లు నిర్మిస్తోంది.

ఆ ప్రాజెక్టుల టెండర్లు సమీక్షించి రివర్స్ టెండరింగ్ చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించడంతో  ఎల్ అండ్ టీ  ఎండీ, సీఈవో అయిన ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ జులైలో జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. గత ప్రభుత్వాల కాలంలో జరిగిన పనులు, చేపట్టిన ప్రాజెక్టులను సమీక్షించుకుంటూ పోతే ప్రగతి మందగిస్తుందన్నారు.

రూ.3 లక్షల కోట్ల విలువైన తమ ప్రాజెక్టుల్లో 3 శాతం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి అని ఆయన చెప్పారు. అంటే.. రూ.9 వేల కోట్ల మేర ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్లు లెక్క. అవన్నీ సమీక్షలోకి వస్తున్నాయని.. ఇంతవరకు తాము ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరస్థితులు చూడలేదని.. ఒక ప్రభుత్వం కాలంలో చేసిన పనులు తరువాత ప్రభుత్వం రివ్యూ చేయడం.. ఆపేయడం చూడలేదని ఆయన అన్నారు. ఇలా అయితే ప్రాజెక్టులు ముందుకు నడవవని అన్నారు.

ఏపీలో ప్రభుత్వ టెర్రరిజం ఉందంటూ ట్వీట్ చేసిన మోహన్ దాస్ పాయ్ సంస్థ అయిన అక్షయపాత్ర గత ప్రభుత్వంలో రూ.5కే భోజనం పెట్టే అన్న క్యాంటీన్లను నిర్వహించేది. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వాటికి నిధులు ఆపేయడంతో పాటు రంగులు మార్చే పని పెట్టుకుంది. వాటిని కొనసాగిస్తామని చెబుతున్నప్పటికీ నెల రోజులుగా చాలా చోట్ల ఆగిపోయాయి. ఈ పరిణామలన్నీ గమనించే మోహన్ దాస్ పాయ్ అంత తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది.

ఇలా కార్పొరేట్ ప్రముఖులు, బడా సంస్థల అధిపతులు జగన్ ప్రభుత్వం తీరును తప్పు పట్టడాన్ని ఇంటాబయటా ఉన్న మిగతా కార్పొరేట్ , వ్యాపార, పారిశ్రామిక సమాజం చూస్తోంది. వీరి అనుభవాల నేపథ్యంలో ఏపీ వైపు రావడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English