ఆగస్టు 15న ఉత్తమ పోలీస్ అవార్డు తీసుకున్నాడు.. 16న లంచం తీసుకున్నాడు

ఆగస్టు 15న ఉత్తమ పోలీస్ అవార్డు తీసుకున్నాడు.. 16న లంచం తీసుకున్నాడు

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు ఇచ్చే ఉత్తమ సేవల అవార్డులు నవ్వులపాలవుతున్నాయి. ఈ అవార్డులకు పాటించే ఎంపిక ప్రక్రియ బూటకమని మరోసారి తేలిపోయింది. పంద్రాగస్టు నాడు ప్రదానం చేసే ఈ ఉత్తమ ఉద్యోగుల అవార్డులు తీసుకునేవారిలో నిజంగానే ఉత్తమ ఉద్యోగులు కొందరు ఉంటారు.. కానీ, ఒకరిద్దరు అవినీతిపరులూ ఇందులో ఉండడంతో మొత్తంగా ఈ అవార్డుల పరువు పోతోంది.

 రెండేళ్ల కిందట ఉత్తమ తహసీల్దార్ అవార్డు అందుకున్న రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన లావణ్య అనే తహసీల్దారు ఆ తరువాత రూ.93 లక్షల నగదుతో ఏసీబీకి పట్టుబడడం తెలిసిందే. ఇప్పుడు అంతకంటే స్పీడుగా అవార్డు అందుకున్న మరునాడే ఏసీబీకి చిక్కాడు ఇంకో ఉత్తమ ఉద్యోగి. మహబూబ్ నగర్ వన్‌టౌన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తిరుపతి రెడ్డి ఆగస్టు 15న ఉత్తమ పోలీసుగా అవార్డు అందుకున్నారు.. 16న ఏసీబీ అధికారులకు దొరికిపోయారు.

మహబూబ్‌నగర్‌ ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్‌ కథనం మేరకు.. మహబూబ్‌నగర్‌ వన్‌టౌన్‌ పోలీసుస్టేషనులో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ తిరుపతిరెడ్డి ఇసుక వ్యాపారుల వద్ద తరచూ డబ్బులు వసూలు చేసేవాడు. వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన ముడావత్‌ రమేశ్‌ నిబంధనలకు అనుగుణంగానే ఇసుక తరలిస్తున్నప్పటికీ శుక్రవారం తిరుపతిరెడ్డి అతడిని అడ్డుకున్నాడు. రూ. 17,000 ఇస్తేనే ట్రాక్టరును విడిచిపెడతానని చెప్పాడు.

తిరుపతిరెడ్డి వైఖరితో విసిగిపోయిన రమేశ్‌ ఏసీబీ అధికారులను సంప్రదించడంతో వారు వలపన్నారు. శుక్రవారం సాయంత్రం సాక్షాత్తు పోలీసుస్టేషను ఆవరణలోనే రమేష్‌ వద్ద తిరుపతిరెడ్డి డబ్బు వసూలు చేశాడు. ఆ సొమ్ము తీసుకుని స్టేషనులోకి కానిస్టేబుల్‌ అడుగుపెట్టగానే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఇసుక వ్యాపారుల నుంచి తిరుపతిరెడ్డి చాన్నాళ్లుగా మామూళ్ల దందా సాగిస్తున్నాడని ఏసీబీకి ఫిర్యాదు చేసిన ఇసుక వ్యాపారి రమేశ్‌ తెలిపారు. రెండేళ్లుగా విధిలేక తానే ఎన్నోసార్లు అతడికి డబ్బులు ఇచ్చానని చెప్పారు. నిబంధనలకు అనుగుణంగానే ఇసుక సరఫరా చేస్తున్నప్పటికీ లంచాల పేరుతో వేధించడంతో విసిగి ఏసీబీ అధికారులను ఆశ్రయించానని తెలిపారు. మరి ఇలాంటి మామూళ్ల కానిస్టేబుల్‌ని ‘ఉత్తమ’ అవార్డుకు ఎలా ఎంపిక చేశారో ఎంపిక చేసినవారికే తెలియాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English