అత్యంత విషమంగా అరుణ్ జైట్లీ ఆరోగ్యం.. చనిపోయారంటూ వదంతులు

అత్యంత విషమంగా అరుణ్ జైట్లీ ఆరోగ్యం.. చనిపోయారంటూ వదంతులు

మాజీ ఆర్థికమంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.  స్వాతంత్ర్య దినోత్సవమైన గురువారం రోజు రాత్రి 8 గంటల సమయంలో ఆయన చనిపోయారంటూ వదంతులు మొదలయ్యాయి. అవన్నీ తప్పుడు ప్రచారాలని.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ జీవించే ఉన్నారని బీజేపీ వర్గాలు చెప్పాయి.

గత వారం రోజులుగా ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండగా, న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స నిమిత్తం చేర్పించిన సంగతి తెలిసిందే. 9వ తేదీ నుంచి ఆయన్ను ఐసీయూలోనే ఉంచిన డాక్టర్లు చికిత్సను అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం విషమించిందన్న విషయాన్ని తెలుసుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఆయనను పరామర్శించడానికి ఎయిమ్స్ కు వెళ్తున్నారు.

కాగా జైట్లీని 9వ తేదీన ఎయిమ్స్‌లో చేర్పించగా గుజరాత్‌కు చెందిన మంత్రి ఒకరు ఆగస్టు 10న తాను పాల్గొన్న ఓ సభా వేదికగా జైట్లీకి నివాళులర్పించడమే కాకుండా ఆ సభలో పాల్గొన్నవారందరితో 2 నిమిషాలు మౌనం పాటింపజేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వార్త ఒకటి జాతీయ మీడియాలో రావడంతో కొందరు దాన్ని గురువారం రాత్రి ట్వీట్ చేశారు. దాంతో అసలు విషయం అర్థం చేసుకోని హడావుడి నెటిజన్లు కొందరు జైట్లీ చనిపోయారన్న వార్తలను వ్యాపింపజేసినట్లుగా తెలుస్తోంది. ఈ పరిస్థితులన్నిటి నేపథ్యంలో జైట్లీ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు.. ఆయన కోలుకోవాలని ఆశిస్తున్నారు.

66 ఏళ్ల అరుణ్ జైట్లీ ఎన్డీయే ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలను నిర్వర్తించారు. అనారోగ్యం కారణంగా 2019 సార్వత్రిక ఎన్నికలకు దూరంగా ఉన్నారు. వాజపేయి, మోదీ మంత్రివర్గాల్లో ఆయన ఆర్థిక, రక్షణ శాఖల వంటి కీలక బాధ్యతలు నిర్వర్తించారు. విద్యార్ధిగా ఉన్నప్పుడే ఏబీవీపీలో చురుగ్గా పనిచేసిన ఆయన ఎమర్జెన్సీ కాలంలో ఏడాదిన్నర కాలం తీహార్ జైలులో ఉన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English