మోడీ కొత్త ఐడియా... సర్వసేనాధిపతి !

మోడీ కొత్త ఐడియా... సర్వసేనాధిపతి !

ఎర్రకోట బురుజులపై నుంచి ప్రధాని మోదీ చేసిన పంద్రాగస్టు ప్రసంగంలో చేసిన కీలక ప్రకటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. భారత్‌కు ఒక ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్’ ఉండాలని మోదీ అన్నారు. ఇంతకీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవి ఏమిటి.. మన దేశంలో ఇదే తొలిసారా.. దేశభద్రతకు, ఈ పదవికి ఏమిటి సంబంధం? పాఠకుల కోసం ప్రత్యేక కథనం.

దేశ రక్షణ, భద్రత విషయంలో త్రివిధ దళాధిపతులపై ఉన్నతస్థాయిలో రాష్ట్రపతి ఉంటారు. ఇక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)ను నియమిస్తే ఆ పదవిలో ఉన్న వ్యక్తి రాష్ట్రపతి, త్రివిధ దళాల మధ్య లేయర్‌లో ఉంటారు. త్రివిధ దళాలను కోఆర్డినేట్ చేసుకోవడంతో పాటు త్రివిధ దళాధిపతులు.. రాష్ట్రపతి మధ్య వారధిగా పనిచేస్తారు.

దేశ ప్రజల్లో చాలామందికి ఈ పదవి పేరు వినడం తొలిసారి కావొచ్చేమో కానీ భద్రతా దళాల్లో ఉన్నవారు ఎప్పుడో ఒకప్పుడు విన్న పదవే ఇది. భారత్‌లోనూ సీడీఎస్ ఉండాల్సిన అవసరం ఉందని దశాబ్దాలుగా చర్చ జరుగుతోంది. కార్గిల్ యుద్ధం తరువాత కార్గిల్ రివ్యూ కమిటీ చేసిన సిఫారసుల్లోనూ ఇదొకటి ఉంది.

అసలు కార్గిల్ యుద్ధం మూణ్ణాలుగు రోజుల్లోనే ముగిసేదని.. కానీ, మూడు దళాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్ల యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగిందని రివ్యూ కమిటీ తేల్చింది. అదే సీడీఎస్ ఉంటే యుద్ధం తక్కువ రోజుల్లోనే పూర్తయ్యేదని అభిప్రాయపడింది.

దీనికి అప్పటికి ఉప ప్రధాని అద్వానీ, మరికొందరు మంత్రులు మద్దతుపలికి సీడీఎస్ పదవిని సృష్టించాలని ప్రయత్నించినప్పటికీ మిగతా నేతల మద్దతు కరవవడం... త్రివిధ దళాల్లో ఎయిర్‌ఫోర్సు అధికారులు దీనికి సుముఖంగా లేకపోవడంతో ఆ ప్రతిపాదన అక్కడితో ఆగిపోయింది.

ఆ ప్రతిపాదన అక్కడితో ఆగిపోయినా చర్చ మాత్రం కొనసాగుతూనే వచ్చింది. అయితే కార్గిల్ యుద్ధం జరిగిన 12 ఏళ్ల తరువాత నరేశ్ చంద్ర కమిటీ మరో ప్రతిపాదన చేసింది. సీడీఎస్ విషయంలో త్రివిధ దళాలన్నిటిలోనూ ఏకాభిప్రాయం లేదని.. కాబట్టి అందుకు బదులుగా చైర్మన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ అనే శాశ్వత పదవి ఉండాలని సూచించింది. ఆ ప్రతిపాదనా కొన్నాళ్లు నానిన తరువాత 2018లో మూడు దళాలు అంగీకరించడంతో కార్యరూపం దాల్చింది.

అయితే.. ఇప్పుడు మోదీ పూర్తి బలంతో ఉండడంతో రాజకీయ సంకల్పంతో సీడీఎస్ నియామకాన్ని కూడా పూర్తిచేయాలనుకుంటున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే మూడు దళాలకూ సమాచారమిచ్చి అంగీకారం తప్పదని సూచించినట్లుగా తెలుస్తోంది.

సీడీఎస్‌తో లాభమేంటి?
సీడీఎస్ వల్ల చాలా ప్రయోజనాలుంటాయనేది రక్షణ రంగ నిపుణుల మాట. ముఖ్యంగా ప్రభుత్వానికి మిలటరీ అడ్వైజర్‌గా ఏక కేంద్రక వ్యవస్థ ఉంటుంది. దానివల్ల ఎలాంటి అయోమయానికి తావుండదు.

ప్రస్తుతం త్రివిధ దళాల్లోని అందరికంటే సీనియర్ అయిన వ్యక్తిని చైర్మన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీస్‌గా నియమిస్తున్నారు. అయితే.. వివిధ దళాలు కలిసికట్టుగా పనిచేసే ప్రయత్నాలు జరుగుతున్నా పూర్తిస్థాయిలో అలాంటి వాతావరణం ఏర్పడలేదు. సీడీఎస్ కనుక ఉంటే అదే పనిలో ఉంటూ సంయుక్త కార్యాచరణ దిశగా దళాలను సిద్ధం చేస్తారు.

అంతేకాదు సీడీఎస్‌కు త్రివిధ దళాలపైనా వ్యూహాత్మక నియంత్రణ ఉండేలా వ్యవస్థను ఏర్పాటుచేస్తారు. దీనివల్ల యుద్ధం వచ్చినప్పుడు తక్కువ సమయంలో అన్ని రకాల దళాలు రంగంలోకి దిగే వీలుంటుంది. అంతేకాదు.. వేర్వేరు దళాల మధ్య ఉండే అంత:కలహాలను అధిగమిస్తూ సంయుక్త కార్యాచరణకు వీలు కల్పించేలా సీడీఎస్ చొరవచూపుతారు.

అంతేకాదు.. సుమారు 10 వేల మంది వరకు సేనలను సమీకరించుకునే అధికారం కూడా సీడీఎస్‌కు ఉంటుంది.

ఇక వివిధ సందర్భాల్లో చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నా.. విరుద్ధ అభిప్రాయాలను వ్యక్తం చేసినా వారిని సమన్వయం చేసే వీలుంటుంది. ముఖ్యంగా యుద్ద సమయంలో మోహరింపు విషయంలో కానీ.. తమతమ విభాగాలకు చెందిన వనరులను ఎలా ఉపయోగించాలా అన్న విషయంలో సైన్యం, నావికాదళం, వైమానిక దళం మధ్య ఏకాభిప్రాయం అన్ని సార్లూ ఉండదు. ఒక్కొక్కరు ఒక్కో వ్యూహంతో ఉండొచ్చు.. కానీ.. సమష్టి వ్యూహం అమలు చేయకపోతే నష్టపోతాం కాబట్టి వారిని సమన్వయం చేస్తూ సమష్టి వ్యూహాల అమలు దిశగా నడిపించేంది సీడీఎస్సే.

అంతేకాదు.. దేశాన్ని నడిపించే రాజకీయ శక్తులు.. భారతదేశ అణ్వస్త్రాలపై నియంత్రణాధికారం ఉన్న స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్‌కు మధ్య వారధిగానూ సీడీఎస్సే వ్యవహరిస్తారు. డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ వంటివీ సీడీఎస్ పరధిలోకే తెస్తారు.

వైమానిక దళం ఎందుకు వద్దంటోంది?

సీడీఎస్ కనుక ఉంటే సైన్యం ఆధిపత్యం ఎక్కువవుతుందని.. ఎయిర్‌ఫోర్స్ ప్రాధాన్యం తగ్గుతుందన్నది ఆ దళం భావిస్తున్నట్లు చెబుతారు. మరోవైపు సీడీఎస్ ఏర్పాటు తరువాత జాయింట్ థియేటర్ కమాండ్స్ ఏర్పాటును ఎయిర్‌ఫోర్స్‌త్ పాటు నేవీ కూడా వ్యతిరేకిస్తోంది. థియేటరైజేషన్ అంటే సైన్యం నేతృత్వంలో కొన్ని వ్యూహాత్మక కేంద్రాల్లో నేవీ, ఎయిర్‌ఫోర్స్ కమాండ్‌లను ఏర్పాటుచేయడం. ఇదే జరిగితే సైన్యం ఆధిపత్యం పెరుగుతుంది. ఇలాంటి ఆధిపత్యాన్ని ఎయిర్‌ఫోర్స్, నేవీ కోరుకోవడం లేదు. కానీ.. మోదీ మాత్రం సీడీఎస్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు.

ఇతర దేశాల్లో ఎలా ఉంది?

అణ్వస్త్రాలు ఉన్న సుమారు అన్ని ఇతర దేశాలూ సీడీఎస్ వ్యవస్థను కలిగి ఉన్నాయి. భారత దేశ రక్షణ వ్యవస్థకు మూలాధారమైన బ్రిటన్‌లోనూ సీడీఎస్ వ్యవస్థ ఉంది. అమెరికా, పలు ఇతర దేశాల్లోనూ సీడీఎస్ ఉంటారు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English