ఏపీలో మ‌ద్యం ప్రియుల‌కు చేదువార్త‌... పెర‌గ‌నున్న ధ‌ర‌లు

ఏపీలో మ‌ద్యం ప్రియుల‌కు చేదువార్త‌... పెర‌గ‌నున్న ధ‌ర‌లు

ఏపీలో మ‌ద్యం ప్రియుల‌కు చేదువార్తే ఇది. మ‌రికొద్ది రోజుల్లోనే మ‌ద్యం ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి. సీసాపై క‌నీసం ప‌దిరూపాయ‌లు పెర‌గ‌నుంది. ఏపీ ప్ర‌భుత్వం అద‌న‌పు ఆదాయం కోసం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇందుకు ఏకైక మార్గం మ‌ధ్యం ధ‌ర‌ల‌ను పెంచ‌డ‌మేన‌ని భావిస్తోంది.

ధరలు పెంచుతున్నట్లు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు ప్ర‌భుత్వం, ఎక్సైజ్ శాఖ‌లు తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న ధ‌ర‌ల‌కు ప‌దిశాతం పెంచే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

అయితే.. ఇక్క‌డ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ప్రభుత్వం ఎంత పెంచినా సీసాపై కనీసం రూ.10 పెరుగుతుంది. ఎందుకంటే మద్యం అమ్మకాల్లో రూ.10 రౌండాఫ్‌ విధానం ఉంది. అంటే.. ప్రస్తుత ధరలు అందుకు అనుగుణంగా చివర్లో సున్నాతో ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం తక్కువ పెంచాలని భావించి ఒక్కో సీసాపై రూ.2 లేదా రూ.3 పెంచినా అది రౌండాఫ్ విధానంతో రూ.10 అవుతుందన్న‌మాట‌. గతంలో రూ.5ను రౌండాఫ్‌గా తీసుకోగా, మూడేళ్ల కిందట దాన్ని రూ.10గా మార్చారు.

గతేడాది ఎక్సైజ్‌ ఆదాయం రూ.6220 కోట్లు కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8517 కోట్లు వస్తాయని ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనా వేసింది. అంటే గతేడాది కంటే రూ.2297 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అనుకుంటోంది. అది కూడా కేవలం ఎక్సైజ్‌ ఆదాయం మాత్రమే కావ‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. ఎక్సైజ్‌ ఆదాయం అంటే ఎక్సైజ్‌ డ్యూటీ, అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ, లైసెన్సు ఫీజులు, జరిమానాలు ఉంటాయి.

అయితే అమ్మకాలపై వేసే వ్యాట్‌ రూపంలో భారీగా ఆదాయం వస్తుంది. ఈ లెక్కన రూ.2297 కోట్లు ఎక్సైజ్‌ ఆదాయం అంటే వ్యాట్‌ రూపంలో వచ్చేది కూడా కలిపితే ఈ ఏడాది రూ.5 వేల కోట్లు అదనంగా వస్తాయని ప్రభుత్వం అంచ‌నా వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో మూడు నెలల నుంచి చీప్‌ లిక్కర్‌ ధర పెరిగింది. గతంలో రూ.50కు కూడా లభించే క్వార్టర్‌ సీసా ఇప్పుడు కనీసం రూ.80 పెడితే తప్ప దొరకట్లేదు. ఇది జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఎలాంటి ప్ర‌భావాన్ని చూపుతుందో చూడాలి మ‌రి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English