బాబులో ఎంత ఛేంజ్.. మసాలా దట్టిస్తున్నారుగా?

బాబులో ఎంత ఛేంజ్.. మసాలా దట్టిస్తున్నారుగా?

కాలంతో పాటు మారాల్సిందే. లేదంటే.. మార్పులో కొట్టుకుపోవటం ఖాయం. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు బాగానే గుర్తించినట్లున్నారు. ప్రత్యర్థిపై పంచ్ లు సైతం నిస్సారంగా వేస్తారన్న పేరున్న బాబు తనను తాను మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారా? అంటే అవుననే చెప్పాలి. నేటి డిజిటల్ తరానికి సూట్ అయ్యేలా మసాలా తన మాటల్లో తెచ్చుకునే ప్రయత్నంలో తాను ఉన్న విషయాన్ని ఇటీవల కాలంలో ఆయన చేస్తున్న ట్వీట్లను చూస్తే ఇట్టే అర్థం కాక మానదు.

తన రాజకీయ ప్రత్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తనను ఉద్దేశించి ఏ భాష అయితే వాడుతున్నారో.. అదే భాషలో తాను రివర్స్ పంచ్ లు వేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి తరచూ వాడే పదాల్ని.. ఆయన మాదిరే ఎటకారంగా.. పంచ్ పడేలా మాటల్ని ట్వీట్ల రూపంలో రువ్వటం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. తన కలల రాజధాని అమరావతిని భ్రమరావతిగా ఎద్దేవా చేసిన జగన్ అండ్ కోకు నోట మాట రాని రీతిలో తాజాగా బాబు భలేగా పంచ్ వేశారు.

పెద్ద మనిషి తరహాను వదిలేసి.. జగన్ కు ఆయన స్థాయిలోనే సమాధానం చెప్పేలా రియాక్ట్ అయ్యారు. తనను తప్పు పట్టే క్రమంలో దేవుడు భలే స్క్రిప్ట్ రాశారంటూ జగన్ తరచూ వాడే పదాల్నే తాజాగా వాడిన బాబు ఏమన్నారంటే.. దేవుడు స్క్రిప్ట్ భలే రాశాడు... ఎవరైతే అమరావతిని గ్రాఫిక్స్, భ్రమరావతి అని అబద్ధాలు చెప్పారో, వాళ్ళ చేతనే ఇప్పుడు అక్కడ లైటింగ్ పెట్టించి దాన్ని మరింత అందంగా చూపించేలా చేశాడంటూ పంచ్ ట్వీట్ వేశారు.

పంద్రాగస్టును పురస్కరించుకొని ఏపీ ప్రభుత్వం సచివాలయానికి అమర్చిన విద్యుద్దీపాల అలంకరణ ఫోటోల్ని బాబు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయటం గమనార్హం.టైం చూసి మరీ ట్వీట్ పంచ్ వేయటం ఒక ఎత్తు అయితే.. జగన్ భాషలోనే ఆయన కౌంటర్ సాగటం విశేషం. మొత్తానికి తన మాటల్లో మసాలా మోతాదును బాబు అంతకంతకూ పెంచేస్తున్నారని చెప్పక తప్పదు. సోషల్ మీడియాలో కనిపిస్తున్న పంచ్ మెరుపులు.. బాబు మాట్లాడే వేళలో మాత్రం లేకపోవటాన్ని మర్చిపోకూడదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English