ఎట్ హోం లో గవర్నర్ - రేవంత్‌రెడ్డి జోకులు

ఎట్ హోం లో గవర్నర్ - రేవంత్‌రెడ్డి జోకులు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అస్స‌లేమాత్రం ఊహించ‌ని రీతిలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ స్పందించార‌ని అంటున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఎట్ హోంలో కేసీఆర్ అంటే ఏ మాత్రం ప‌డ‌ని వ్య‌క్తితో గ‌వ‌ర్న‌ర్ సెటైర్లు పంచుకోవ‌డం ఇందుకు కార‌ణం. కేసీఆర్‌కు న‌చ్చ‌ని ఆ వ్య‌క్తి రేవంత్ రెడ్డి. వారిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ గురించి ఈ చర్చ‌.

ఎట్ హోం పేరుతో రాజ్‌భవన్‌లో ఇచ్చిన తేనీటి విందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. జాతీయ గీతాలాపన అనంతరం గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ రాజ్‌భవన్ లాన్స్ ప్రాంగణమంతా కలియ తిరిగారు. అందరి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలుకరించారు.

ఈ సంద‌ర్భంగా కార్యక్రమానికి వచ్చిన అతిధి నేతలందరికీ గవర్నర్ కరచాలనం చేస్తుండగా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత‌, ఎంపీ రేవంత్‌రెడ్డిని చూసి ‘వచ్చావా? రాలేదేమోనని నీ కోసమే ఎదురుచూస్తున్నా’ అనడంతో రేవంత్ బదులిస్తూ ‘మీరు ఆహ్వానించాక రాకుండా ఉంటానా?’ అన్నారు. గవర్నర్ ‘మరి నన్ను కలవడానికి వస్తానన్నారుగా.. ఎందుకు రాలేదు’ అని ప్రశ్నించగా ‘కొడతారేమోనని రాలేదని రేవంత్ బదులిచ్చారు. అప్పుడు గవర్నర్ గతంలో అసెంబ్లీలో జరిగిన ఘటనను గుర్తుచేస్తూ ‘నేను కొట్టానా? మీరు నన్ను కొట్టారా?’ అని ప్రశ్నించగా రేవంత్ అదే స్థాయిలో ‘అది మనసులో పెట్టుకుని ఎక్కడ కొడతారోననే రాలేదు’ అనడంతో అందరూ ఒక్కసారిగా నవ్వేశారు.

కాగా, ఈ రేంజ్‌లో రేవంత్‌తో ముచ్చ‌ట్ల‌ను ఖ‌చ్చితంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేనిదే అని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. మ‌రోవైపు ఈ భేటీలో కేసీఆర్ గ‌వ‌ర్న‌ర్‌కు ప‌లు అంశాల‌పై వివ‌ర‌ణ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. త‌న స‌ర్కారుకు ముచ్చెమట‌లు పోయిస్తున్న ఇంట‌ర్ వివాదంపై ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చారు.  రాష్ట్రపతికి పూర్తి వాస్తవాలను వివరిస్తూ నివేదిక అందిస్తామని తెలిపారు.

సున్నితమైన ఇంటర్‌ పరీక్షల అంశాన్ని రాద్ధాంతం చేయడం, విద్యార్థుల మనోభావాలను దెబ్బతీయడానికి పూనుకోవడం దారుణమని కేసీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  వివాదం తలెత్తగానే ప్రభుత్వం స్పందించి నివారణ చర్యలు తీసుకుందని, తమ లక్ష్యం నెరవేరలేదనే కారణంతో కొన్ని పార్టీలు ఇంకా ఈ అంశాన్ని వదలడం లేదని సీఎం వివరించినట్లు తెలిసింది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English