దేశ రెండో రాజధానిగా హైదరాబాద్.. కేజ్రీవాల్‌లా కేసీఆర్‌కూ ఇక చుక్కలు

దేశ రెండో రాజధానిగా హైదరాబాద్.. కేజ్రీవాల్‌లా కేసీఆర్‌కూ ఇక చుక్కలు

ఏ స్టూడెంట్‌కు ఎలాంటి పాఠం చెప్పాలన్నది మోదీ మాస్టారికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజనతో ఈ విషయం మరింత బాగా అర్థమైపోయింది దేశంలోని రాజకీయ నాయకులకు. ఆ కారణంగానే మోదీ పేరెత్తితే ఒంటి కాలిపై లేచే నాయకులు కూడా మద్దతిచ్చారు.. మద్దతివ్వనివారు కూడా మౌనం దాల్చారు.

చివరకు మమత, అసదుద్దీన్ కూడా ఈ విషయంలో సైలెంటుగానే ఉన్నారు. ఇదంతా కాసేపు పక్కన పెడితే మోదీ మాస్టారు ఇప్పుడు తెలంగాణలో టీఆరెస్ అధినేత కేసీఆర్‌కు గట్టి పాఠమే చెప్పడానికి సిద్ధమవుతున్నారని టాక్. దక్షిణ భారతదేశం తమకు రాజకీయంగా కొరుకుడుపడకపోవడంతో అందుకోసం కొత్త ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దక్షిణభారతదేశంలో కర్ణాటకలో ఇప్పటికే బలంగా ఉండడంతో పొరుగునే ఉన్న తెలంగాణలో పాగా వేయడంతో పాటు దక్షిణాది మొత్తాన్నీ బుజ్జగించే, ఊరించేందుకు హైదరాబాద్‌ను దేశ రెండో రాజధాని చేయాలని తలపోస్తున్నట్లు సమాచారం.

ఇదే జరిగితే తెలంగాణ సీఎం కేసీఆర్ దిల్లీ సీఎం కేజ్రీవాల్‌లా అధికారాలు చేతిలో లేక గిలగిలలాడాల్సిన పరిస్థితి వస్తుంది. హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిని చేసే క్రమంలో... ఇప్పుడు హైదరాబాద్‌కు చుట్టుపక్కల 100 కిలోమీటర్ల వ్యాసం వరకు ఉన్న ప్రాంతాలను కలుపుతూ కేంద్ర పాలిత ప్రాంతం చేసే ఆలోచనలో మోదీ ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే సగం తెలంగాణను హైదరాబాద్‌లో కలిపేసి మిగతా ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రంగా ఉంచుతారు. అప్పుడు కేసీఆర్ పరిధి చాలావరకు తగ్గిపోతుంది. ఆర్థికంగా తెలంగాణకు వెన్నుదన్నులా ఉండే హైదరాబాద్ కేంద్రం చేతికి వెళ్లిపోతే మిగతా తెలంగాణ రాష్ట్రంతో కేసీఆర్ హవా చెలాయించలేని పరిస్థితి ఏర్పడుతుంది.

ఎప్పటి నుంచో హైదరాబాద్ ని రెండో రాజధాని చేసి సుప్రీం కోర్టు బెంచ్ ని ఏర్పాటు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ డిమాండ్లను నెరవేర్చినట్లూ అవుతుంది.. రాజకీయంగానై  మైలేజి వస్తుంది కాబట్టి ఆ పనిచేయాలని బీజేపీ అనుకుంటోందట.

2024 వరకు ఏపీ ..తెలంగాణ ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయటం ద్వారా అటు తాము హైదరాబాద్ కోల్పోయామనే భావనలో ఉన్న ఏపీ ప్రజల్లోనూ సానుకూలత వస్తుందని అంచనా వేస్తున్నారు.

అంతేకాకుండా హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసినా చేయకపోయినా దేశ రాజధానిని చేస్తే చాలు కేంద్రం పెత్తనం పెరుగుతుంది కాబట్టి మజ్లిస్ పార్టీని కూడా కంట్రోల్ చేయొచ్చని బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. మొత్తానికైతే కేంద్రం ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English