'ఒకే దేశం...ఒకే ఎన్నిక '... స‌వాల‌క్ష సందేహాలు

'ఒకే దేశం...ఒకే ఎన్నిక '... స‌వాల‌క్ష సందేహాలు

రెండోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ సరికొత్త విధానాలు దిశగా ముందుకెళుతుంది. ఇప్పటికే ఒకే దేశం-ఒకే పన్ను విధానంతో జిఎస్‌టిని దేశ ప్రజలకి పరిచయం చేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం..ఒకే దేశం-ఒకే ఎన్నిక పేరుతో జమిలి ఎన్నికలకు సన్నాహాలు చేస్తుంది.

2023లో లోక్‌సభకు, అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే దేశంలో కాంగ్రెస్ మూలాలని సమూలంగా తీసేసి..తమ ముద్ర వేయాలని మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

అందులో భాగంగానే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే దేశం- ఒకే చట్టం- ఒకే ఎన్నికలు- ఒకే గుర్తింపుకార్డు, ఒకే విధమైన రిజర్వేషన్ విధానం- పౌరులందరికీ సమన్యాయం- ఉమ్మడి పౌర స్మృతి- ఒకే పన్ను విధానం.. అంటూ మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో ముఖ్యంగా దేశం మొత్తం పాగా వేయడానికి బీజేపీ వ్యూహాత్మకంగా ఒకే దేశం-ఒకే ఎన్నికల నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దీని ద్వారా దేశం మొత్తం ఒకేసారి లోక్ సభ, రాష్ట్ర శాసన సభ ఎన్నికలు జరపడానికి ప్రయత్నాలు చేస్తోంది.

ఇక భారతదేశం 75 సంవత్సరాల స్వాంతంత్ర వేడుకలని పూర్తి చేసుకునే 2022 ఆగష్టు 15 తర్వాత జమిలి ఎన్నికల విధానానికి తెరలేవనుందని తెలుస్తోంది. దీని ప్రకారం 2022 చివరిలో గానీ, 2023 లో మొదట్లో గానీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

వీటి తర్వాత ఆరు నెలల్లో దేశమంతా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇక ఎన్నికల నిర్వహణకు అవసరమైన రాజ్యాంగ సవరణలను పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ప్రతిపాదించి ఆమోదింపజేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది.

అయితే ఈ జమిలి ఎన్నికల నిర్వహణ వల్ల, సమయం ఆదా, అదనపు ఖర్చు తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది. మొన్న 2018లో ఐదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. మళ్లీ 2019లో లోక్‌సభ ఎన్నికలతోపాటు ఏపీ, ఒడిశా సహా మరో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి.

వచ్చే మూడేళ్లలో 18 రాష్ట్రాల శాసనసభలకు.. 2023-24ల్లో మరో తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. పైగా మధ్యమధ్యలో స్థానిక సంస్థల, మున్సిపాలిటీ ఎన్నికలు అంటూ ఏవోకటి జరుగుతూనే ఉంటాయి.

దీని వల్ల ఎన్నికల కోడ్, ఈ  కోడ్‌తో అభివృద్ధి కుంటుపడుతుంది. అలా కాకుండా జమిలి ఎన్నికలు జరిపితే లాభం ఉంటుందని కేంద్రం ఆలోచన. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ జమిలి ఎన్నికల విధానంతో దేశంమంతా తమ సత్తా చాటోచ్చని బీజేపీ ప్లాన్.

కాగా, 2020లో బిహార్‌, ఢిల్లీ, పాండిచ్చేరి రాష్ట్రాలకు, 2021లో అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు జరగాల్సి ఉంది. మరి వీటిని అప్పుడే జరిపిస్తారా..లేక కేంద్రం జమిలి ఎన్నికలకు వెళుతుందా అనేది చూడాలి.  ఒక‌వేళ ఎన్నిక‌లు జ‌రిగాక ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాక‌పోతే ఏం చేయాల‌నే సందేహాలు కూడా చాలానే ఉన్నాయి. అసలు ఈ ఒకే దేశం-ఒకే ఎన్నిక నినాదం సక్సెస్ అవుతుందో లేదో ?  గాని దీనిపై అప్పుడే స‌వాల‌క్ష సందేహాలు ముసురుకున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English