చంద్ర‌బాబును ఏపీ ప్ర‌భుత్వం కాపాడుతుంది: వైసీపీ ఎమ్మెల్యే

చంద్ర‌బాబును ఏపీ ప్ర‌భుత్వం కాపాడుతుంది:  వైసీపీ ఎమ్మెల్యే

విజయవాడలో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. పులిచింతల ప్రాజెక్ట్ నుంచి భారీగా వరద నీరు రావడంతో కరకట్ట దగ్గర ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నివాసంలోకి భారీగా వ‌ర‌ద‌నీరు వ‌చ్చి చేరింది. బాబు నివ‌సిస్తోన్న లింగమనేని గెస్ట్‌హౌస్‌ మెట్లపైకి నీళ్లు రావడంతో ఆందోళన మొదలైంది. దీంతో అక్క‌డున్న వారు వెంట‌నే అలెర్ట్ అయ్యి ఫ‌ర్నీచ‌ర్‌ను పై ఫ్లోర్‌లోకి త‌ర‌లించేశారు. చంద్ర‌బాబు కాన్వాయ్‌ను కూడా త‌ర‌లించారు.

మరోవైపు కరకట్టపై ఉన్న నిర్మాణాల్లో చాలావరకు ముంపున‌కు గురయ్యాయి. చాలా నిర్మాణాల్లోకి వరద నీరు వచ్చి చేర‌డంతో ప‌లు నిర్మాణాల ప‌రిస్థితి ఆందోళ‌న క‌రంగా మారింది. నానుతున్న నీటిలో అవి ఎలా ?  ఉంటాయో ? అన్న ఆందోళ‌న నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే ముంపున‌కు గురైన చంద్ర‌బాబు నివాసాన్ని మంగ‌ళ‌గిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి పరిశీలించారు. ప్రస్తుతం చంద్రబాబు కుటుంబం హైదరాబాదులో ఉంది.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న చంద్ర‌బాబును కాపాడుకోవాల్సిన బాధ్య‌త రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఉంద‌ని ఎమ్మెల్యే ఆళ్ల వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలోనే త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కూడా ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే బాబు ఇంటిలోకి వ‌ర‌ద నీరు చేరినందున అక్క‌డ‌కు లారీల‌తో ఇసుక‌ను త‌ర‌లిస్తున్నామ‌ని ఆర్కే చెప్పారు. చంద్ర‌బాబు నివాసాన్ని ప‌రిశీలించి ప్ర‌భుత్వం త‌ర‌పున ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్ట చెప్పిన ఎమ్మెల్యే ఆర్కే బాబుపై చేసిన అనుచిత వ్యాఖ్య‌లే కాస్త ఎబ్బెట్టుగా ఉన్న‌ట్టు అనిపించాయి.

తాను ఉన్న గెస్ట్ హౌస్ మునిగిపోతుంద‌న్న భ‌యంతో చంద్ర‌బాబు హైద‌రాబాద్‌కు పారిపోయార‌ని... కృష్ణా వ‌ర‌ద ముందే ఊహించి ఆయ‌న త‌న కుటుంబ స‌భ్యుల వాహ‌నాల‌ను హ్యాపీ రిసార్ట్స్‌కు త‌ర‌లించేశార‌ని ఆర్కే ఎద్దేవా చేశారు. ఇక టీడీపీ పాల‌న‌లో వ‌ర్షాలు లేవు కాబట్టి బాబు తన నివాసం వరద ప్రాంతంలో ఉన్న విషయం గుర్తించలేదని... ఇకపై అర్థమవుతుందన్నారు. చంద్ర‌బాబు త‌న నివాసాన్ని ఖాళీ చేయక తప్పదని ఆర్కే స్పష్టం చేశారు. మొత్తానికి ప్ర‌తిప‌క్ష నేత‌గా బాబును కాపాడుకోవ‌డం త‌మ బాధ్య‌త అని ఒక వైపు బాధ్యత చూపుతూనే... వరదొచ్చిందని పారపోయారని వ్యాఖ్యానించడం కాస్త ఎబ్బెట్టుగా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English