‘నాయట్టు’ రీమేక్.. ఆగిపోవడానికి కారణమిదే!

మలయాళంలో వచ్చిన ‘నాయట్టు’ అనే సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ముగ్గురు పోలీసుల చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకుంది గీతాఆర్ట్స్ సంస్థ. దీంతో వెంటనే రీమేక్ రైట్స్ కొనేసి.. దర్శకుడిగా కరుణ కుమార్ ను రంగంలోకి దించారు. ఆయన డైరెక్ట్ చేసిన ‘పలాస’ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

ఈ రీమేక్ ను కూడా నేటివ్ టచ్ తో డీల్ చేస్తారని దర్శకత్వ బాధత్యలు అప్పగించారు. సినిమా పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇక షూటింగ్ మొదలవ్వడమే ఆలస్యమనుకుంటున్న సమయంలో ఈ సినిమాకి బ్రేకులు పడ్డాయి. దానికి కారణం ఏంటనేది మాత్రం బయటకు రాలేదు. కరుణ కుమార్ వేరే బ్యానర్ లో మరో సినిమా చేయాలని చూస్తున్నారు.

సడెన్ గా ఈ రీమేక్ నుంచి తప్పుకోవడానికి గల కారణాలు ఏంటని ఆరా తీయగా.. సినిమా బడ్జెట్ సమస్యలే కారణమని తెలుస్తోంది. ఈ సినిమాను రూ.4 కోట్లలో తీయాలని దర్శకుడు కరుణకుమార్ కు చెప్పారు. కానీ బడ్జెట్ లెక్కలు వేసుకున్నప్పుడు రూ.8 కోట్లు వచ్చిందట. దర్శకుడు రూ.1.25 కోట్ల ప్యాకేజీ అడిగారని సమాచారం. నటుడు రావు రమేష్ కి రూ.కోటి రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వచ్చిందట.

రూ.8 కోట్లలో సినిమా తీస్తే వర్కవుట్ అవుతుందా..? లేదా..? అనే సందేహాలు నిర్మాతల్లో కలిగాయి. అందుకే సినిమాను  ఆరంభంలోనే ఆపేశారు. ఇప్పుడు ‘నాయట్టు’ డబ్బింగ్ రైట్స్ కూడా గీతాఆర్ట్స్ దగ్గరే ఉండడంతో.. ఇప్పుడు సినిమాను తెలుగులో డబ్ చేసి ‘ఆహా’లో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారట. దర్శకుడు కరుణకుమార్ కి ఆల్రెడీ అడ్వాన్స్ ఇవ్వడంతో.. ఆయనతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు తెలియనున్నాయి!