వైసీపీలో విధి వంచితుడు

వైసీపీలో విధి వంచితుడు

ఏపీలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేశారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి. ఈ ఎంపిక ఆ పార్టీలో పెద్ద చర్చకే దారితీసింది. పార్టీకి విధేయుడిగా ఉంటున్న ఓ నేతకు మళ్లీ అన్యాయం జరిగిందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే త్యాగాలు చేసిన ఆ నేత కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని చెబుతున్నారు.

మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి, మోపిదేవి వెంకటరమణలకు టికెట్లు కేటాయించారు. ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశించి గుంటూరు జిల్లా చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది.

చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే సోమేపల్లి సాంబయ్య అల్లుడైన మర్రికి ఆ ప్రాంతంలో మంచిపేరుంది. 2004లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రత్తిపాటి పుల్లారావుపై గెలిచిన ఆయయన ఆ తరువాత 2009, 2014లో పుల్లారావు చేతిలో ఓటమి పాలయ్యారు. జగన్ వైఎస్సార్సీపీ పార్టీ పెట్టిన తరువాత అందులో చేరిన మర్రి 2014లో వైఎస్సార్సీపీ నుంచే పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఆ తరువాత మరింతగా పనిచేసి 2019 ఎన్నికలకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న దశలో అక్కడి టికెట్‌ను విడుదల రజినికి కేటాయించారు జగన్. దీంతో మర్రి తీవ్ర అసంతృప్తికి లోనవగా ఆయనకు మంత్రి పదవి ఇస్తానని జగన్ మాట ఇచ్చారు. ఎన్నికల ప్రచారం సమయంలో జగన్ లక్షలాది సాక్షిగానే ఈ హామీ ఇచ్చారు.

అయితే.. మంత్రి పదవులు కేటాయించిన సమయంలోనూ మర్రి పేరు వినిపించినా జాబితాలో మాత్రం ఆయన పేరు లేదు. అదే జిల్లాకు చెందిన మోపిదేవి వెంకటరమణకు అవకాశం ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యే కానప్పటికీ మంత్రి పదవి ఇచ్చి ఇప్పుడు ఎమ్మెల్సీ సీటిచ్చారు. దీంతో మర్రికి మరోసారి అన్యాయం జరిగిందని ఆయన అనుచరులు అంటున్నారు.

అయితే.. ప్రస్తుత మంత్రులను రెండున్నరేళ్ల తరువాత మారుస్తారని.. అప్పుడు మర్రికి చాన్సు దొరకొచ్చని చెబుతున్నారు. మరి.. మర్రి ఈ పరిణామాలను ఎలా చూస్తున్నారు.. అప్పటివరకు ఓపిక పడతారో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English