బీజేపీలోకి మోత్కుప‌ల్లి ఎంట్రీ ఖాయ‌మైందిగా...

బీజేపీలోకి మోత్కుప‌ల్లి ఎంట్రీ ఖాయ‌మైందిగా...

తెలంగాణ‌కు చెందిన సీనియ‌ర్ పొలిటిషీయ‌న్‌, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరనున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం మోత్కుపల్లి నర్సింహులుతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలోనే వారు మోత్కుప‌ల్లిని బీజేపీలో చేరాల‌ని కోర‌గా... ఆయ‌న అందుకు సానుకూలంగా స్పందించిన‌ట్టు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం వ‌ర‌కు టీడీపీలోనే ఉన్న మోత్కుప‌ల్లి చంద్ర‌బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసి... ఆ పార్టీకి దూర‌మ‌య్యారు.

ఇటీవ‌ల ఏపీలో టీడీపీ ఓడిపోయిన‌ప్పుడు కూడా ఆయ‌న ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద నివాళులు అర్పించి... ఇప్పుడు ఎన్టీఆర్ ఆత్మ శాంతిచింద‌న్న వ్యాఖ్య‌లు చేసి రాజ‌కీయంగా ప్ర‌కంప‌న‌లు రేపారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి రావాల‌ని తిరుప‌తి వెంక‌న్నకు మెక్కిన మోత్కుప‌ల్లి వైసీపీ గెలిచిన వెంట‌నే తిరుమ‌ల వెళ్లి మ‌రీ మొక్కు తీర్చుకున్నారు. ఇక గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు మోత్కుప‌ల్లి టీఆర్ఎస్‌లో చేరే అంశంపై కూడా చ‌ర్చ జ‌రిగింది.

మోత్కుప‌ల్లి త‌న ఇంట్లో వివాహ కార్య‌క్ర‌మానికి కేసీఆర్‌ను ఆహ్వానించ‌గా.. ముఖ్య‌మంత్రి హోదాలో వెళ్లి మ‌రీ కేసీఆర్ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. దీనిని బ‌ట్టి మోత్కుప‌ల్లికి కేసీఆర్ ఎంత ప్ర‌యార్టీ ఇచ్చారో అర్థ‌మ‌వుతోంది. అయితే అనూహ్యంగా ఆ ఎన్నిక‌ల్లో ఆలేరు నుండి నర్సింహులు ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక కొంత‌కాలంగా రాజ‌కీయంగా సైలెంట్‌గా ఉంటోన్న ఆయ‌న్ను ఆదివారం కిష‌న్‌రెడ్డి, ల‌క్ష్మ‌ణ్ క‌లిసి బీజేపీలోకి ఆహ్వానించ‌డంతో ఆయ‌న ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

2009లో న‌ల్గ‌గొండ జిల్లా తుంగ‌తుర్తి నుంచి పోటీ చేసి గెలిచిన మోత్కుప‌ల్లి, 2014లో అప్పుడు ఖ‌మ్మం ఎంపీగా పోటీ చేసిన నామా నాగేశ్వ‌ర‌రావు కోరిక మేర‌కు మ‌ధిర నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు మోత్కుప‌ల్లికి రాజ్య‌స‌భ సీటు ఇస్తార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. రెండు, మూడు సార్లు రాజ్య‌స‌భ ఎన్నిక‌లు జ‌రిగినా ప్ర‌తిసారి చంద్ర‌బాబు త‌న సామాజిక‌వ‌ర్గం నేత‌ల‌తో పాటు... పారిశ్రామిక‌వేత్త‌ల‌కే ప్రాధాన్య‌త ఇస్తూ వ‌చ్చారు.

బీజేపీతో పొత్తు కారణంగా గవర్నర్ పదవిని కూడ ఇస్తామని చంద్రబాబు మోత్కుపల్లి నర్సింహులుకు హామీ ఇచ్చారు. ఆ త‌ర్వాత బాబు ఎన్డీయేకు దూరం కావ‌డంతో ఆ కోరిక కూడా తీర‌కుండా పోయింది. అప్ప‌టి నుంచి బాబుపై ర‌గిలిపోయిన మోత్కుప‌ల్లి చివ‌ర‌కు టీడీపీ నుంచి ఏకంగా బ‌హిష్క‌ర‌ణ‌కు గుర‌య్యారు. ఇక మోత్కుప‌ల్లి ఈ నెల 18న బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి మోత్కుప‌ల్లి పొలిటిక‌ల్ రీ ఎంట్రీ ఎలా ఉంటుందో ?  బీజేపీలో ఆయ‌న ప్ర‌యాణం ఎలా ఉంటుందో ?  కాల‌మే ఆన్స‌ర్ చేయాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English