కేసీఆర్ బీజేపీకి సరెండర్ అవుతున్నారా?

కేసీఆర్ బీజేపీకి సరెండర్ అవుతున్నారా?

తెలంగాణలో పాలక టీఆరెస్, బీజేపీల మధ్య రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. మంచి మెజారిటీతో రెండోసారి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న టీఆరెస్ అధినేత కేసీఆర్ సంబరం ఎక్కువ కాలం నిలవకుండా మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో బీజీపీ నుంచి నలుగురు ఎంపీలుగా గెలిచారు. అదే పెద్ద షాకింగ్ న్యూస్ అయితే.. అలా గెలిచిన నలుగురిలో ఒకరైన కిషన్ రెడ్డికి ఏకంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవి ఇచ్చారు. ఇంకేముంది... కేసీఆర్ దూకుడుకు బ్రేకులు వేసే పని మొదలుపెట్టారు కిషన్ రెడ్డి. 2024 నాటికి తెలంగాణలో అధికారం అందుకుంటామని కిషన్ రెడ్డితో పాటు అమిత్ షా కూడా పదేపదే చెబుతున్నారు. దీంతో కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

పైగా.. కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ లాంటి కొరుకుడుపడని సమస్యనే పరిష్కరించే దిశగా ఆర్టికల్ 370ని రద్దు చేసి ఆ రాష్ట్రాన్ని విభజించేసింది. ఆ నిర్ణయంపై తన ఆత్మీయ మిత్రుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో కలుగులోకి దూరిపోయాడు. ఇవన్నీ చూశాక కేసీఆర్‌కు పరిస్థితి అర్థమైనట్లు.. తత్వ బోధపడినట్లు కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీని ఢీకొట్టడం తన వల్ల కాదని చాలా వేగంగా నిర్ణయించుకుని కేసీఆర్ తెల్లజెండా ఎగురవేస్తున్నారని చెబుతున్నారు.

బీజేపీతో శాంతి ఒప్పందాలు కుదుర్చుకోవడం కోసం కేసీఆర్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారని చెబుతున్నారు. అందులో భాగంగానే ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్‌లకు హిందూ దేవతల పేర్లు పెట్టారని చెబుతున్నారు. ప్రాజెక్టులోని మొదటి ఆనకట్ట మేడిగడ్డకు లక్ష్మి ఆనకట్టగా, కన్నేపల్లికు లక్ష్మి పంప్ హౌస్ గా నామకరణం చేశారు. రెండో ఆనకట్ట అన్నారానికి సరస్వతి ఆనకట్టగా, పంప్ హౌస్‌కు సరస్వతి పంప్ హౌస్‌గా అలాగే సుందిళ్ల ఆనకట్టకు పార్వతి ఆనకట్ట అని, గోలివాడ పంప్ హౌస్‌కు పార్వతి పంప్ హౌస్, నందిమేడారం ఆరో ప్యాకేజీలోని జలాశయం, పంప్ హౌస్‌లకు నంది జలాశయం, పంప్ హౌస్‌గా, ఎనిమిదో ప్యాకేజీలోని లక్ష్మీపూర్ పంప్ హౌస్‌కు గాయత్రి పంప్‌ హౌస్‌ గా నామకరణం చేశారు. నిజానికి సెక్యులర్ దేశంలో ఇలాంటి భారీ ప్రాజెక్టులు, వాటి అనుబంధ వ్యవస్థలకు మతపరమైన ప్రాధాన్యం ఉన్న పేర్లు పెట్టరు. కానీ.. కేసీఆర్ ఆ పనిచేశారు అందుకు కారణం బీజేపీని ప్రసన్నం చేసుకోవడమేనని తెలుస్తోంది.

కేసీఆర్ ఇలా వెనక్కు తగ్గడంలో రెండు వ్యూహాలు కనిపిస్తున్నాయన్న మాట వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తరువాత లోక్ సభ ఎన్నికల సమయంలో కేసీఆర్ తన ప్రచారం ‘హిందుగాళ్లు బొందుగాళ్లు’ అని కామెంట్ చేయడం తెలిసిందే. అది దెబ్బకొట్టడం వల్లే బీజేపీకి ఓట్లు పడి 4 ఎంపీ సీట్లు గెలుచుకుందన్న వాదన ఉంది. ప్రజల్లో ఈ మాట నెగటివ్ ప్రభావం చూపిందని కేసీఆర్‌కూ అర్థమైంది. దాంతో దాన్ని సరిదిద్దుకునేందుకు ఇప్పుడిలా కాళేశ్వరం పంపు హౌస్‌లు, ఆనకట్టలకు హిందూ దేవతల పేర్లు పెట్టినట్లు సమాచారం.

అంతేకాకుండా కాళేశ్వరానికి జాతీయ హోదా కోరుకుంటుండడం.. కేంద్రం నుంచి నిధుల సహకారం కావాలనుకుంటుండడంతో ఆ రకంగానూ కేంద్రాన్నిఅప్రోచ్ కావడానికి వీలుగా ఈ ఎత్తుగడ వేసినట్లు ఒక వాదన వినిపిస్తోంది.

మరోవైపు కేంద్రానికి కూడా తెలంగాణ బీజేపీ నేతలు కేసీఆర్ చేసిన బొందుగాళ్ల వ్యాఖ్యలపై ఫిర్యాదు చేయడంతో కేంద్రం కేసీఆర్‌పై ఓ కన్నేసి ఉంచింది. పైగా మజ్లిస్‌ను కేసీఆర్ నెత్తికెక్కించుకుంటుండడంపైనా కేంద్రానికి కోపం ఉంది. అలాగే... కేసీఆర్ చేసిన విఫల ప్రయోగం ఫెడరల్ ఫ్రంట్ విషయంలోనూ కేంద్రానికి కేసీఆర్‌పై మంట ఉంది. వచ్చే నెల 17న నిజామాబాద్‌లో అమిత్ షా నేతృత్వంలో భారీ స్థాయిలో విమోచన సభ కూడా బీజేపీ నిర్వహించబోతోంది. ఈ పరిస్థితుల్లో కేంద్రానికి తనపై కోపం తగ్గేలా కేసీఆర్ ఈ ఎత్తుగడ వేసినట్లు చెబుతున్నారు. మరి.. కేంద్రం ఈ చర్యతో ఎంతవరకు ఖుషీ అవుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English