కేసీఆర్ లాగే జ‌గ‌న్‌...వైసీపీ నేత‌ల‌కు టెన్ష‌న్‌

కేసీఆర్ లాగే జ‌గ‌న్‌...వైసీపీ నేత‌ల‌కు టెన్ష‌న్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి మ‌ధ్య ఉన్న సఖ్య‌త గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అనేక నిర్ణ‌యాల్లో ఈ ఇద్ద‌రు సీఎంలది ఒకే మాట‌. చాలా విషయాల్లో సీఎం జగన్... తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు క‌నిపిస్తుంటుంది. అయితే, తాజాగా వైసీపీ నేత‌ల విష‌యంలో కూడా జ‌గ‌న్ అదే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెప్తున్నారు. పార్టీ నేత‌ల‌కు నామినేటెడ్ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌డం గురించే ఈ చర్చంతా.

వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన నేప‌థ్యంలో స‌హ‌జంగా పార్టీ నేత‌లు నామినేటెడ్ ప‌ద‌వుల‌పై ఆశ‌తో ఉంటారు. అయితే, ఈ ప‌ద‌వులు ఇచ్చే విష‌యంలో జగన్ ఆచితూచి అడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకున్నార‌ని స‌మాచారం. అక్టోబర్ 15 తర్వాత ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. స్థానిక ఎన్నికల్లో ప్రతిభ చూపించిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో ఎవరు ఎలా పనిచేస్తున్నారు? ప్రజల్లోకి వెళ్తున్నారా లేదా? సమస్యలను పరిష్కరిస్తున్నారా? లేదా అనేది సర్వే చేసి.. వారికి నామినేటెడ్ పదవులను ఇవ్వబోతున్నట్టు సమాచారం.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే.. ప్రజల్లోకి వెళ్తారో.. ప్రతిభను చూపిస్తారో.. వారికే నామినేటెడ్‌ పదవులు కట్టబెట్టే అవకాశం ఉందన తెలుస్తోంది. ప్రస్తుతం నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తే.. పదవులు దక్కని వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం కూడా ఉంది. ఈ క్రమంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గ‌తంలో ఇదే ట్రెండ్‌ను కేసీఆర్ ఫాలో అయ్యారు. తాజాగా జ‌గ‌న్ అదే నిర్ణ‌యంతో ముందుకు సాగుతున్నార‌ని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English