బందరు పోర్టు కాంట్రాక్ట్ రద్దు...కారణం ఇదేనా..!

బందరు పోర్టు కాంట్రాక్ట్ రద్దు...కారణం ఇదేనా..!

గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పులని సరిదిద్దే పనిలో ఉన్న జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని ఒప్పందాలని రద్దు చేసిన వైసీపీ ప్రభుత్వం బందరు పోర్టు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టుల్లో అంచనాలు పెంచేసి పనులు చేస్తున్నందుకు నవయుగకి ఇచ్చిన టెండర్లని రద్దు చేసి రివర్స్ టెండరింగ్ కి వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బందరు పోర్టు అభివృద్ధి విషయంలో గతంలో చేసిన అన్ని‌ కాంట్రాక్ట్ ఒప్పందాలనూ రద్దు చేసింది.

అందులో భాగంగా నవయుగ సంస్థతో మచిలీపట్నం పోర్టు లిమిటెడ్‌ (ఎంపీపీఎల్‌)తో చేసుకున్న ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే వారికి ఇచ్చిన 412.57 ఎకరాలను స్వాధీనం చేసుకోనుంది. అయితే ఈ రద్దు వెనుక గల కారణాలని కూడా ప్రభుత్వం చెప్పింది. నవయుగ ఎప్పుడో కాంట్రాక్ట్ దక్కించుకున్న పనులు మాత్రం ఇంకా పూర్తిగా మొదలుపెట్టలేదు. దీనికోసం గత ప్రభుత్వాలు అనేక సార్లు గడువు పెంచిన పట్టించుకోలేదు.

ఈ నేపథ్యంలోనే కాంట్రాక్ట్ ని రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం పోర్టు నిర్మాణానికి కొత్త ఒప్పందం చేసుకోనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్ధలతోనే బందరు పోర్టు నిర్మాణం చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. అందులో భాగంగానే విశాఖ పోర్ట్ ట్రస్టు ద్వారా బందరు పోర్టు నిర్మాణం, నిర్వహణ చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా, బందరు వాసులతో పాటు కృష్ణా జిల్లా ప్రజలకి ఈ పోర్టు పూర్తవ్వడం చిరకాల కల. అసలు ఎప్పుడు పూర్తవుతుందా అని వారంతా ఆసక్తిగా చూస్తున్నారు.

2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బందరు ఓడరేవు నిర్మాణ బాధ్యతల్ని మైటాస్ కంపెనీకి అప్పగించారు. అయితే ఆ సంస్థ ఆర్థిక సంక్షోభంలో పడడంతో, ఆ తర్వాత వైఎస్సార్ మరణంతో పోర్టు ఆగిపోయింది. ఇక ఈ తర్వాత అప్పటి రోశయ్య ప్రభుత్వం 2010లో నవయుగకు నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. అలాగే రోశ‌య్య త‌ర్వాత‌ వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి 2012లో బందరు పోర్టుకు 5320 ఎకరాలను కేటాయిస్తూ జీవో జారీ చేశారు. అప్పుడు కూడా పనులు ప్రారంభం కాలేదు.

ఇక 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ, 4,500 ఎకరాలు ప్రభుత్వ, అసైన్డ్ భూములతో పాటు ప్రైవేట్ భూముల్ని సేకరించింది. ఈ ఏడాది మార్చి నెలలో పోర్టు పనులు కూడా మొదలుపెట్టారు. కానీ పోర్టు పనుల విషయంలో నవయుగ ఆలస్యం చేయడంతో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వారి కాంట్రాక్ట్ లని రద్దు చేసి, త్వరలో కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి చూస్తోంది. మరి వైసీపీ ప్రభుత్వమైనా త్వరగా పోర్టు పూర్తి చేసి కృష్ణా జిల్లా వాసుల కల నెరవేరుస్తుందేమో ? చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English