మోడీ దెబ్బ‌కు సంక్షోభంలో తెలుగు ప‌త్రిక‌లు..

మోడీ దెబ్బ‌కు సంక్షోభంలో తెలుగు ప‌త్రిక‌లు..

బాబోయ్‌.. ఇప్ప‌టికే వెబ్, ట్యూబ్‌, టీవీ మీడియాతో ఆద‌ర‌ణ త‌గ్గిపోతున్న ప్రింట్ మీడియాకు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తీసుకున్న నిర్ణ‌యంతో శ‌రాఘాతంగా మారింది. విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకున్న న్యూస్‌ప్రింట్‌పై ప‌దిశాతం అద‌న‌పు సుంకం విధించ‌డంతో తెలుగు దిన ప‌త్రిక‌ల ప‌రిస్థితి దిన‌దిన‌గండంగా మారిపోతోంది. ఇప్ప‌టికే ప్రింటింగ్ ఖ‌ర్చులు, జీత‌భ‌త్యాల‌ను మోయ‌లేక యాజమ‌న్యాలు ల‌బోదిబోమంటున్నాయి. తాజాగా.. మోడీ తీసుకున్న నిర్ణ‌యంతో అన్నింటి లోనూ కోత‌లు పెట్టేందుకు రెడీ అవుతున్నాయి.

ఇప్ప‌టికే ఈ దిశ‌గా ప‌లు అగ్ర‌శేణి దిన‌ప‌త్రిక‌లు కూడా నిర్ణ‌యం తీసుకున్నాయి. త‌మ ప‌త్రిక‌ల పేజీల సంఖ్య‌ను త‌గ్గిస్తున్నాయి. మెయిన్‌తోపాటు టాబ్లాయిడ్ పేజీల సంఖ్య‌ను కూడా త‌గ్గిస్తున్నాయి. ఓ అగ్ర‌శ్రేణి దిన‌ప‌త్రిక త‌మ మెయిన్‌లో సుమారు నాలుగు పేజీలు త‌గ్గించి కేవ‌లం ప‌ద‌హారు పేజీల‌కు ప‌రిమితం అయింది. ఇక టాబ్ల‌యిడ్‌లోనూ ఇర‌వై నుంచి ప‌ద‌హారు పేజీల‌కు వ‌చ్చింది. మ‌రికొద్ది రోజుల్లో ప‌న్నెండు పేజీల‌కు వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేద‌ని ప‌త్రికావ‌ర్గాలు అంటున్నాయి.

రోజురోజుకూ నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు పెరిగిపోతుండ‌డంతో ప‌త్రిక‌లు న‌డుప‌డం ఇక క‌ష్ట‌మేన‌నే ఆలోచ‌న‌కు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే డిజిట‌ల్ ఎడిష‌న్ల‌కు ప్రాధాన్య‌మిస్తున్నాయి. ఇక మ‌రికొన్ని ప‌త్రిక‌లు మాత్రం ఏదో ప‌త్రిక న‌డుపుతున్నామంటే న‌డుపుతున్నాం.. అనే కోణంలో ఉన్నాయి. నిజానికి.. న్యూస్ ప్రింట్ ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగిపోవ‌డంతోనే తెలుగు ప‌త్రిక‌ల నిర్వ‌హ‌ణ‌లో సంక్షోభం మొద‌లైంది. అయితే.. కొద్దిపాటి గ‌వ‌ర్న‌మెంట్ యాడ్స్‌తో నెట్టుకొస్తున్న ప‌త్రిక‌ల యాజ‌మాన్యాల‌ను మోడీ పెంచిన అద‌న‌పు సుంకం బెంబేలెత్తిస్తోంది.

ఈ క్ర‌మంలోనే ప‌త్రిక‌ల యాజ‌మాన్యాలు సిబ్బందికి ఇంక్రిమెంట్లు వేయ‌డం కూడా ఆపేశాయి. మ‌రీ ఇబ్బందిగా ఉంటే.. ఏకంగా ఉద్యోగుల సంఖ్య‌ను కూడా త‌గ్గించినా ఆశ్చ‌ర్య‌పోవాల్సింది ఏమీలేద‌ని ప‌త్రికావ‌ర్గాలు అంటున్నాయి. దీంతో మ‌రికొన్ని సంవ‌త్స‌రాల్లోనే ఉద్యోగుల భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్థకం అవుతుంద‌నే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ ప‌రిణామాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తూ వ‌స్తున్న ప‌లువురు ఉద్యోగులు చిన్న‌గా త‌మ‌దారి తాము చూసుకుంటున్నారు. ఇక మ‌రికొంద‌రు మాత్రం ఉన్న‌న్ని రోజులు ప‌నిచేద్దాం.. ఆ త‌ర్వాత ఎలా అయితే అలా.. అంటూ కాలం గ‌డిపేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English