అమరావతి మాదిరే పోలవరానికి బ్రేకులు

అమరావతి మాదిరే పోలవరానికి బ్రేకులు

ఏపీ రాజధాని అమరావతిపై అనుమానాలు నిజం కావటం తెలిసిందే. జగన్ ప్రభుత్వం అమరావతిపై ఇప్పటికిప్పుడు ఎలాంటి డెవలప్ మెంట్ యాక్టివిటీస్ చేపట్టకూడదన్న విషయాన్ని నిర్ణయించటమే కాదు.. తొలుత బాబు ప్రభుత్వ హయాంలో భూముల్ని కట్టబెట్టిన వైనంపై లెక్కలు తీసే ప్రయత్నంలో ఉంది. అందుకే.. అమరావతికి ఎలాంటి నిధులు ఇప్పటికిప్పుడు అక్కర్లేదని ప్రధాని మోడీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేయటం తెలిసిందే.

అమరావతి పరిస్థితి ఏమిటన్న దానిపై ఇప్పటికే కాస్తంత క్లారిటీ వచ్చేసినట్లే. మరి.. ఏపీకి జీవనాడిగా మారుతుందన్నఅంచనాలు ఉన్న పోలవరం ప్రాజెక్టు ఫ్యూచర్ ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల పోలవరం ప్రాజెక్టు పనుల్ని చేపట్టిన నవయుగ.. బెకం కంపెనీల టెండర్లను రద్దు చేస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.

దీంతో.. పనులు మందగొడిగా సాగటమే కాదు.. ఇప్పుడు వస్తున్న వరద నీటితో పోలవరం ప్రాజెక్టు వద్ద పరిస్థితి మరింత అయోమయంగా మారిందన్న మాట వినిపిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన నోటీసుల కారణంగా టెండర్లను చేపట్టిన కంపెనీలు రెండు పనుల్ని ఎక్కడికక్కడ నిలిపివేశాయి. వరద నీరు పెద్ద ఎత్తున వస్తున్న వేళ.. దాని కారణంగా ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా చూసుకునేందుకు ఎవరూ లేకపోవటంతో ఈప్రాజెక్టు పై కొత్త సందేహాలు పుట్టుకొస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై కేంద్ర జనశక్తి వనరుల మంత్రిత్వ శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ కారణంగా సమయంతో పాటు విలువైన డబ్బు కూడా వృథా అవుతుందని లోక్ సభ వేదికగా పేర్కొనటం తెలిసిందే. దీంతో.. పోలవరంపై ఏపీ సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై కేంద్రం సానుకూలంగా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే కేంద్రం నుంచి వెలువడిన మరో ప్రకటన షాకింగ్ గా మారింది.

పోలవరం ప్రాజెక్టుకు సంబందించి పర్యావరణ నిబంధనల్ని ప్రస్తావిస్తూ దానిపై వివరణ కోరింది. ఈ ప్రాజెక్టు విషయంలో పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదో ఏపీ సర్కారు వివరణ ఇవ్వాలని పేర్కొంది. ఎందుకిలా జరిగిందన్నది చూస్తే.. పోలవరం మీదా.. దాని అనుబంధ ప్రాజెక్టుల్ని తనిఖీలు నిర్వహించిన పర్యావరణ శాఖ అధికారులు ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతులకు సంబంధించి నిబంధనల్లో ఉల్లంఘనలు చోటు చేసుకున్నట్లుగా గుర్తించారు.

ఈ అంశంపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు సమ్రగ నివేదిక అందించటంతో.. దానిపై స్పందించిన కేంద్రం నోటీసులు జారీ చేసినట్లుగా చెబుతున్నారు. ఒక దాని వెంట మరొకటిగా తెరపైకి వస్తున్న నిర్ణయాలు.. షాకింగ్ నిర్ణయాల నేపథ్యంలో పోలవరం ఫ్యూచర్ మీద కొత్త సందేహాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయని చెప్పకతప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English