Gulte bulletin : స్టేట్ అప్ డేట్స్ విత్ వన్ క్లిక్

Gulte bulletin : స్టేట్ అప్ డేట్స్ విత్ వన్ క్లిక్

* రేపు అర్ధరాత్రి నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమ్మెకు దిగుతున్నట్లు సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు, ఏపీఎన్జీఓలు ప్రకటించారు. ఈ మేరకు ఈ నెల 7,8 తేదీలలో ఎంపీల ఇళ్లముందు ధర్నా చేయాలని, ఈ నెల 17,18,19 తేదీలలో ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని ఉద్యోగసంఘాలు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నాయి. రేపు మరో సారి రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి నోటీసు ఇస్తామని ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు ప్రకటించారు.

* సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెలో తాము పాల్గొనబోమని సీమాంధ్ర ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. తాము సమ్మెకు దిగితే సామాన్యులు ఇబ్బందులకు గురవుతారని, ప్రైవేటు ఆపరేటర్లు వారిని దోచుకుంటారని..అందుకే సమ్మెకు దూరంగా ఉంటున్నట్లు జేఏసీ వెల్లడించింది.

* తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెడుతున్నామని, అది ఆమోదం పొందుతుందన్న నమ్మకం ఉందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వెల్లడించారు. సుధీర్ఘ కాలంగా తెలంగాణ సమస్య ఉందని, ఈ బిల్లు ఆమోదంతో రాష్ట్రం ఏర్పడుతుందని అన్నారు.

* ప్రధాని మన్మోహన్ సింగ్ ను కేసీఆర్ బృందం కలిసింది. ప్రధానితో సమావేశం అనంతరం తెలంగాణ రాష్ట్రం ఈ పార్లమెంటు సమావేవాలలో ఏర్పడుతుందని ఖాయం అయిందని, తాను చెప్పినట్లే తిరిగి తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెడతానని  కేసీఆర్ అన్నారు. బిల్లుకు సంబంధించి కొన్ని సవరణలు కోరుతూ ప్రధానికి వినతిపత్రం ఇచ్చామని తెలిపారు.

* విభజనకు సంబంధించి సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు దాఖలు చేశారు. ఇప్పటికి దాదాపు ఏడు పిటీషన్లు వేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్, బీజేపీ నేత రఘురామకృష్ణంరాజు, సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ తదితరులు ఈ పిటీషన్లు వేసిన వారిలో ఉన్నారు.

* తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టనున్న నేపథ్యంలో బీజేపీ అగ్రనేత అద్వానీని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలుసుకున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజిస్తుందని ఆయన విమర్శించారు. తెలుగుజాతి మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని, కేంద్రంలోని యూపీఏ రెండు ప్రాంతాల ఉద్యోగ సంఘాలతో ఒక్కసారి కూడా మాట్లాడలేదని విమర్శించారు.

* తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లును నిరసిస్తూ సీమాంధ్ర టీడీపీ నేతలు ఢిల్లీలోని ఏపీభవన్ వద్ద ధర్నా చేపట్టారు. దేశంలోని సంస్థానాలను సర్ధార్ వల్లభాయి పటేల్ కలుపుతే కాంగ్రెస్ ముక్కలు చేస్తుందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ విమర్శించారు. పరిపాలన చేతకాకుంటే రాజకీయాలు మానుకోవాలని సూచించారు.

* సమయాభావం మూలంగా పార్లమెంటరీ పార్టీల సమావేశానికి రాలేకపోతున్నానని, రాష్ట్రంలోని రెండు సభలు తిరస్కరించిన తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టవద్దని, దీనిని తాము వ్యతిరేకిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీకర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

* పది లేదా పన్నెండు రోజులు తెలంగాణ బిల్లును అడ్డుకుంటే ఇక తెలంగాణ రాదని కాంగ్రెస్ అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు. తెలంగాణ బిల్లు అడ్డుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని ఆయన అన్నారు.

* ప్రముఖ నటుడు మోహన్ బాబు పద్మశ్రీ పురస్కారం అంశం మీద నిర్ణయాన్ని రాష్ట్ర హైకోర్టు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతిలో పెట్టింది. దేనికైనా రెడీ సినిమాలో పద్మశ్రీ పురస్కారాన్ని దుర్వినియోగం చేశారన్న దాని మీద కోర్టు విచారణ జరుపుతోంది. హైకోర్టు నిర్ణయం మోహన్ బాబుకు ఇబ్బందికరంగా మారింది.

* రాష్ట్ర విభజన ఆగిపోతుందని, అది పార్లమెంటులో ప్రవేశపెట్టే పరిస్థితిలేదని, అవినీతి వ్యతిరేక బిల్లు, ఓటాన్ అకౌంట్ బిల్లు పార్లమెంటులో పెట్టాల్సి ఉన్నందున తెలంగాణ బిల్లు పార్లమెంటులో చర్చకు వస్తుందని భావించడం లేదని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. ఒక వేళ తెలంగాణ బిల్లు చర్చకు వచ్చినా తమ పార్టీ ఎంపీలు అడ్డుకుంటారని అన్నారు.

* రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నది తన అభిప్రాయమని, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అబద్దాల కోరని, బీజేపీ నేతలతో అంటకాగుతున్న ఆయన తమను విమర్శించడం ద్యేయంగా పెట్టుకున్నారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. తెలంగాణ నేతలు ఆక్రోశంతో తమ మీద ఆరోపణలు చేస్తున్నారని, ఉభయసభలు తిరస్కరించిన బిల్లు పార్లమెంటులో ఎలా ఆమోదం పొందుతుందని ఆయన ప్రశ్నించారు. విమర్శించారు.

* విభజనను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేయదలుచుకున్న దీక్షపై కాంగ్రెస్ అధిష్టానమే మాట్లాడుతుందని, అన్ని పార్టీల అంగీకారంతోనే విభజన నిర్ణయం జరిగిందని, సీమాంధ్రకు ప్యాకేజీల గురించి అధిష్టానం చూసుకుంటుందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. విభజనపై కిరణ్ కుమార్ రెడ్డి, జగన్, చంద్రబాబు మాట మార్చారని ఆరోపించారు.

* కేంద్ర మంత్రి జైరాం రమేష్ కు సమైక్యాంధ్ర సెగ తగిలింది. జీవోఎం సమావేశానికి వచ్చిన ఆయనను సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడ్డుకున్నారు. జై సమైక్యాంధ్ర నినాదాలలో హోరెత్తించారు. జైరాం రమేష్ కారు మీద లైటుతో కొట్టిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుండి తరలించారు.

* తిరుమల - తిరుపతి వాసులకు టీటీడీ ఉచిత దర్శనం అమలు చేస్తోంది. ఈ మేరకు ప్రతి నెలకు ఒక సారి ఐదువేల మంది స్థానికులకు ఈ అవకాశం కల్పించనున్నారు.

* అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థనను నాంపల్లి సీబీఐ కోర్టు తిరస్కరించింది.

* రాష్ట్రపతి వద్దకే చేరని తెలంగాణ బిల్లు మీద జీవోఎం సమావేశం ఎలా ఏర్పాటు చేస్తారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు కాంగ్రెస్ అప్రజాస్వామిక విధానాలకు అద్దం పడుతున్నాయని ఆయన విమర్శించారు.

* తెలంగాణ బిల్లును ఈ నెల 6 న పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

* సమైక్య నినాదంతో తాను తెలంగాణలో త్వరలోనే పర్యటిస్తానని, తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలలో 5 స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుదంని వైఎస్ జగన్ అన్నారు. సమైక్యానికి మద్దతునిచ్చే వారికి తమ మద్దతు ఉంటుందని, సమైక్యం కోసం జరిగే దీక్షలకు తమ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు.

* హైదరాబాద్ ను రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని, అందుకే గవర్నర్ కు ప్రత్యేక అధికారాలు కోరుతుందని, దీనికి పార్లమెంటులో సవరణలు అవసరం అని బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేత సుష్మాస్వరాజ్ అన్నారు.

* ఈ నెల 10న రాజ్యసభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే రాజ్యసభ చైర్మన్ కు లేఖ రాసినట్లు తెలుస్తోంది.

* ఢిల్లీలో బుధవారం ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు జంతర్ మంతర్ వద్ద చేపట్టబోయే మౌనదీక్షకు సీమాంధ్ర నేతలు పార్టీలకు అతీతంగా కలిసి రావాలని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ కోరారు. ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణతో కలిసి సీమాంధ్ర ప్రజాప్రతినిధులం అంతా రేపు సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతిని కలుస్తామని ఆయన తెలిపారు.

* తెలంగాణ అంశం తుది దశకు చేరిందని, ఈ సమయంలో సీమాంధ్ర నేతలతో అప్రమత్తంగా ఉండి బిల్లును ఆమోదింపజేసుకుంటామని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. బీజేపీ తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తుందన్నది ఊహాగానాలేనని ఆయన అన్నారు.

* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకమని, చిన్న రాష్ట్రాలకు తాము వ్యతిరేకమని సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ స్పష్టం చేశారు. చంద్రబాబుతో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ విభజన దేశాన్ని అస్థిర పరుస్తుందని ఆయన అన్నారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English