కేసీఆర్ క్లాస్ ఒక‌వైపు..కోర్టు కేసులు మ‌రోవైపు

కేసీఆర్ క్లాస్ ఒక‌వైపు..కోర్టు కేసులు మ‌రోవైపు

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వ్య‌వ‌హార‌శైలి మ‌రోమారు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఓ వైపు కోర్టులో వాదోప‌వాద‌న‌లు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ అదే విష‌యంలో కేసీఆర్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ ఆస‌క్తిక‌రంగా ఉంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌స్తుత సెక్ర‌టేరియ‌ట్ నిర్మాణం, కొత్త సెక్ర‌టేరియ‌ట్‌ నిర్మాణం విష‌యంలో వాదోప‌వాద‌న‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఎర్రమంజిల్‌ బిల్డింగ్‌ ను కూల్చవద్దంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై బుధవారంతో వాదనలు పూర్తయ్యాయి.

వాటన్నింటినీ పరిశీలిస్తామని, ఈ మేరకు తీర్పు వాయిదా వేస్తున్నామని చీఫ్ జస్టిస్‌ ఆర్ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ల డివిజన్‌ బెంచ్‌ తెలిపింది. అయితే, ఇదే స‌మ‌యంలో తరలింపులో జరుగుతున్న జాప్యంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని, ఎందుకిలా లేటవుతోందని ప్రశ్నించారని తెలుస్తోంది. వెంటనే షిఫ్టింగ్ ప్రారంభించాలని ఆదేశించినట్టు సమాచారం. దీంతో అధికారులు హడావుడిగా త‌ర‌లింపు మొదలుపెట్టారు. బుధవారమే రోడ్లు భవనాల శాఖను ఎర్రమంజిల్లోని ఈఎన్సీ ఆఫీసుకు తరలించారు. గురువారం నుంచి శాఖ కార్యకలాపాలు అక్కడే జరుగనున్నాయి.

స‌చివాల‌యం త‌ర‌లింపుపై హైకోర్టు బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘సర్కారు చెబుతున్నదానికి, మాస్టర్‌ ప్లాన్‌కూ తేడాలున్నాయి. 2010 నుంచి 2013 మధ్య ఐదు మాస్టర్‌ప్లాన్లు ఉన్నాయని అంటోంది. ఫస్ట్‌ మాస్టర్‌ ప్లాన్లో హెరిటేజ్‌ బిల్డింగ్స్‌కు రక్షణ గురించి ఉంది. రెండో ప్లాన్‌లో లేదు. సర్కారేమో అన్ని ప్లాన్లకూ సంబంధం ఉంటుందని చెబుతోంది’’ అని పేర్కొంది.  ‘‘వారసత్వ భవనాలకు, పురాతన భవనాలకు తేడా ఏమిటో చెప్పాలి. హెరిటేజ్‌ యాక్ట్‌ రూపొందించినా మాస్టర్‌ ప్లాన్‌ అమల్లో ఉందని పిటిషనర్లు చెబుతున్నదానికి ఏం జవాబు చెబుతారు..’’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
 
ఇదిలాఉండ‌గా, స‌చివాల‌యం త‌ర‌లింపుపై సీఎం కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని స‌మాచారం. స‌చివాల‌యంలోని కీల‌క ప్రాంతాల‌ను మార్చే బీఆర్‌కే భ‌వ‌న్‌పై అస్ప‌ష్ట‌త కొన‌సాగుతోంద‌ని అంటున్నారు. బీఆర్కే భవన్లో రిపేర్లు చాలా అవసరమని, అందుకు కనీసం మూడు వారాల టైం పడుతుందని రోడ్లు, భవనాల శాఖ అధికారులు స్పష్టం చేశారు. దీంతో ముందుగా మంత్రుల పేషీలను షిఫ్ట్ చేసి, తర్వాత శాఖలను మార్చాలని భావించారు. కానీ సీఎం సీరియస్ కావడంతో డిపార్ట్మెంట్ల తరలింపు కూడా వెంటనే చేపట్టాలని నిర్ణయించారు.

జీఏడీ, రోడ్లు భవనాల శాఖ, ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఏజెన్సీల ప్రతినిధులతో సీఎస్ఎస్కే జోషి సమావేశాలు నిర్వహించారు. ఇప్పటికప్పుడు తనకు నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. సీఎస్ పేషీని బీఆర్కే భవన్లోని 9వ ఫ్లోర్లో ఏర్పాటు చేయాలని, సాధ్యమైనంత త్వరగా తరలించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు 9వ ఫ్లోర్ ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. బీఆర్కే భవన్ లో అందరు మంత్రుల చాంబర్లకు ప్లేస్ సరిపోని కారణంగా కొందరి చాంబర్లను ఆయా శాఖల కమిషరేట్లకు తరలించనున్నారు. అన్ని శాఖల్లో ఫైళ్లను ప్యాక్ చేసే పని మొదలుపెట్టారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English