జ‌గ్గారెడ్డి..కొంచెం క్లారిటీ...కొంచెం కన్ఫ్యూజ‌న్‌

జ‌గ్గారెడ్డి..కొంచెం క్లారిటీ...కొంచెం కన్ఫ్యూజ‌న్‌

సంగారెడ్డి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నేత జ‌గ్గారెడ్డి గ‌త కొంత‌కాలంగా అనూహ్య‌మైన కామెంట్ల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో టీఆర్ఎస్ పార్టీని ఎండ‌గ‌ట్ట‌డం ద్వారా మీడియాలో నిలిచిన జ‌గ్గారెడ్డి ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు కేసీఆర్‌పై ప్ర‌శంస‌లు కురిపించ‌డం ద్వారా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు.

గ‌త కొంత కాలంగా ఈ ఒర‌వ‌డిని కొన‌సాగిస్తున్న జ‌గ్గారెడ్డి...తాజాగా  జాతీయ ప‌రిణామాల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆర్టిక‌ల్ 370,35aను ఉప‌సంహ‌రించ‌డం విభిన్న‌మైన విశ్లేష‌ణ చేశారు. బీజేపీ హిందూయిజం పార్టీ..కాంగ్రెస్ సెక్యూలర్ పార్టీ.  ఈ రెండు పార్టీలూ దేశానికి అవసరమన్నారు.

ఆర్టికల్ 370,35a గురించి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విలేక‌రుల స‌మావేశంలో వివ‌రిస్తూ...పార్లమెంట్‌లో జరిగిన ఆర్టికల్ 370 రద్దు చర్చలో మోడీ, అమిత్ షా  నెహ్రుపై అనవసర ఆరోపణలు చేశారన్నారు. పాకిస్థాన్ నుండి కాశ్మీర్‌ను కాపాడడం కోసమే అప్పటి ప్రధాని నెహ్రు ఈ ఆర్టికల్ల‌ను తీసుకువ‌చ్చారని అన్నారు.

పాకిస్థాన్ నుండి కాశ్మీర్‌ను కాపాడడం కోసమే అప్పటి ప్రధాని నెహ్రు ఆర్టికల్  370,35a తీసుకువచ్చారని తెలిపిన జ‌గ్గారెడ్డి ఒకవేళ 370,35a లేకపోతే ప్రస్తుతం ఇబ్బంది పడే వాళ్ళమని పేర్కొన్నారు.

అప్పుడు ఏమి జరిగింది అనేది ప్ర‌స్తుత త‌రం వాళ్లకు తెలియదని, అప్పుడు పాకిస్థాన్ వాళ్ళు కాశ్మీర్‌ను ఆక్రమించుకొని ఉంటే ఇప్పుడు కాశ్మీర్ నుండి దేశానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యేవని అన్నారు. అప్పుడు  మోడీ, అమిత్ షా ఉన్న కూడా వాళ్ళు కూడా అదే నిర్ణయం(ఆర్టికల్) తీసుకునే వాళ్లని జగ్గారెడ్డి తెలిపారు.

కాశ్మీర్‌ను కాపాడడం లో నెహ్రు కీలక పాత్ర పోషించారని, నెహ్రు ఆరోజు కాపాడాడు కాబట్టి ఈరోజు మోడీ ,అమిత్ షా పార్లమెంట్ లో మాట్లాడారని ఆయన అన్నారు. కాశ్మీర్‌లో ఆర్టికల్  370,35a తీసివేయాలని  ఆర్ఎస్ఎస్ ముందు నుండి అనుకుందని, ఆర్ఎస్ఎస్ ఆలోచనతోనే బీజేపీ 370 ఆర్టికల్ రద్దు చేసిందని  జగ్గారెడ్డి అన్నారు.

మన ప్రాంతాన్ని మనం కాపాడుకుందాం అని..  ఇప్పుడున్న పరిస్థితులకు  మోడీ, అమిత్ షా ఆర్టికల్ 370,35a రద్దు చేయడం కరెక్టేనని జగ్గారెడ్డి సమర్ధించారు. అప్పుడు నెహ్రు చేసింది.. ఇప్పుడు మోడీ అమిత్ షా చేసింది రెండు కరెక్టేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ  అని, ఓట్ రాజకీయాలు ఎప్పుడు చేయదని, సీటు కోసం తన భావాలు ఎప్పుడు చంపుకోదని జగ్గారెడ్డి అన్నారు. బీజేపీ ఒక్క మతానికి చెందిన పార్టీ అని అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English