దివాలా దిశగా దేశం?

దివాలా దిశగా దేశం?

మోదీ ప్రభుత్వం సంస్కరణలను వేగవంతం చేయడమే దేశ ఆర్థిక వృద్ధి మందగించడానికి కారణమంటూ సాక్షాత్తు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితిని పట్టాలెక్కించడానికి ఆయన కొద్దికాలంగా పలు సూచనలు చేస్తున్న తరుణంలో సంస్కరణలే కొంప ముంచుతున్నాయంటూ బాహాటంగా చేసిన వ్యాఖ్యలను హెచ్చరికలుగానే భావించాలి.

ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్నప్పుడు సైతం భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుదురుగా ఉన్న విషయం మర్చిపోరానిది.. అలాంటిది మంచి రోజులు వచ్చాయంటున్న ప్రస్తుత కాలంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉండడం ఎంతైనా జాగ్రత్త పడాల్సిన విషయమే.

దిల్లీలో నిర్వహించిన బ్లూమ్‌బర్గ్ న్యూ ఎనర్జీ ఫైనాన్స్ సమావేశంలో మాట్లాడిన అమితాబ్ కాంత్ ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి పలు సూచనలు చేశారు. ద్రవ్య నిల్వలు పెరిగేలా చర్యలు చేపట్టడం ప్రథమ కర్తవ్యమని ఆయన చెప్పుకొచ్చారు. ప్రయివేటు రంగం లేకుండా సంపద సృష్టి సాధ్యం కాదు కాబట్టి ప్రయివేటు సెక్టార్‌ను కూడా ప్రోత్సహించడం కూడా అత్యావశ్యకమని చెప్పారు.

కొన్ని వ్యవహారాల నుంచి ప్రభుత్వం తప్పుకొని ఆ బాధ్యతలు ప్రయివేటుకు అప్పగించడం నయమని.. ఇప్పటికే విమానాశ్రయాల నిర్మాణం, గ్యాస్ గ్రిడ్‌ల ఏర్పాటు వంటివాటి విషయంలో ఈ ప్రయోగం జరిగిందని.. చాలా ప్రభుత్వ రంగంలో ఉన్న చాలావాటిని ప్రయివేటుకు అప్పగించాలని సూచించారు.

సంస్కరణలన్నీ ఒకేసారి
అయితే.. కీలక సంస్కరణలన్నీ ఒక్కసారిగా తేవడంతో ఆర్థిక వృద్ధి మందగించిందన్నది ఆయన మాట. జీఎస్టీ, ఇన్‌సాల్వెన్సీ అండ్ బాంకరప్సీ కోడ్ తేవడం.. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు వంటివన్నీ ఒకదాని వెంట ఒకటి తేవడం వల్ల కొంత ఆర్థిక మందగమనం ఉందని చెప్పారు. అయితే ఇవన్నీ మెల్లమెల్లగా ఫలితాలిస్తాయని.. ఆయిల్ అండ్ గ్యాస్, కోల్ మైనింగ్, రైల్వేస్ కూడా ప్రయివేటుకు అప్పగిస్తే వృద్ధి ఊపందుకుంటుందని ఆయన చెప్పారు.

ఆర్థిక మంత్రిదీ అదేమాట
మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా దాదాపు ఇవే అభిప్రాయాలు వ్యక్తం చేయడం తెలిసిందే. భారత ప్రస్తుత ఆర్థిక పరిస్థితి చూసి ఆందోళన చెందుతున్నానని చెప్పలేను.. అలా అని ఆత్మ సంతృప్తి కూడా లేదు అంటూ ఆమె తాజాగా ఎకనమిక్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు దేశ ఆర్థిక పరిస్థితి విషయంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనడానికి సూచనగానే కనిపిస్తున్నాయి.

అన్ని గ్రాఫ్‌లూ నేల చూపులే..
మరోవైపు ఆర్థిక పరిస్థితి తిరోగమనంలో ఉందనడానికి సూచనలూ కనిపిస్తున్నాయి. పారిశ్రామిక వృద్ధి రేటు ఒక్క జూన్ నెలలోనే 0.2 శాతం పతనమైంది. గత 50 నెలల్లో కనిష్ఠ స్థాయికి చేరింది. అంతేకాదు.. దేశంలోని 11 ప్రధాన ఆటోమొబైల్ కంపెనీల్లో 9 కంపెనీల లాభాలు గత మూడు నెలలుగా భారీగా తగ్గాయి. గత మూడు త్రైమాసికాలు(క్వార్టర్)గా దేశంలో వాహనాల విక్రయం పడిపోతూ వచ్చింది. ఏడాది కాలంలో అమ్మకాలు 30 శాతానికిపైగా పడిపోయాయి. కొన్ని ఆటోమొబైల్ సంస్థలు లాకౌట్ దిశగా వెళ్లినా ఆశ్చర్యం లేదన్న పరిస్థితి. ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ కంపెనీలు  హిందుస్థాన్‌ యూనిలివర్, ఐటీసీ, గోద్రెజ్‌ వంటి వాటి వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో చాలా స్వల్పంగా మాత్రమే నమోదైంది.

ఖర్చేనా పొదుపు లేదా
సేవింగ్స్ అకౌంట్లలోని జమ గత అయిదేళ్ల కాలంలో 5 శాతం తగ్గిపోయింది.. మోదీ గద్దెనెక్కడానికి ముందు జీడీపీలో 22 శాతంగా ఉన్న పొదుపు ఖాతాల సొమ్ము ఇప్పుడు 17 శాతానికి తగ్గిపోయింది. మేకిన్ ఇండియా ఫలితమివ్వలేదు, తయారీ రంగం జోరందుకోలేదు.. ఇవన్నీ ప్రగతిని రివర్స్ గేర్ వేయిస్తున్నాయి.

అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తుండడంతో పెట్టుబడులు వెనక్కు
ఇవన్నీ చాలవన్నట్లు ప్రయివేటు పెట్టుబడులు తగ్గిపోయాయి.. రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణలు మారుతుండడం.. పెట్టుబడులకు అనుకూలమైన దక్షిణాది రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు.. కేంద్రంలోని పాలక పార్టీ వేర్వేరు కావడం... రాష్ట్రాల్లో అధికార మార్పిడి జరిగినప్పుడు రాజకీయ వ్యతిరేకతతో గత ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టులను రివ్యూ చేస్తూ పెట్టుబడిదారులను భయభ్రాంతులను చేసేలాంటి రాజకీయాలు చేయడంతో పెట్టుబడులు వెనక్కు పోవడం వంటివన్నీ సంపద సృష్టికి, ఉపాధి కల్పనకు, ఉత్పత్తికి విఘాతి కలిగిస్తున్నాయి. అత్తమీద కోపం దుత్త మీద చూపినట్లుగా రాజకీయ ప్రత్యర్థులపై ఉండే కక్షను ఆ ప్రత్యర్థుల పాలనలో తీసుకున్న నిర్ణయాలపై ప్రభావం పడేలా చేస్తున్నారు. ఫలితం వృద్ధి రేటు మందగమనం.

ఆర్బీఐ దగ్గరున్న రూ.3.5 లక్షల కోట్ల రిజర్వ్ నిధులు కేంద్రం అడిగిందంటే కారణం అదే..
ఆర్థిక మందగమనానికి ప్రధాన కారణాన్ని స్థూలంగా చెప్పాలంటే ద్రవ్యలోటు గురించి మాట్లాడుకోవాలి. పెట్టుబడుల కొరత.. ఆర్థిక వనరుల వేట ఫలించకపోవడం పరిస్థితిని దిగజారుస్తోంది. కార్పొరేట్ కంపెనీలకూ ఇదే సమస్య.. రాష్ట్రాలకూ ఇదే సమస్య.. అన్నీ కలిపి కేంద్రానికీ ఇదే సమస్య. అన్నిచోట్లా ఆర్థిక సమస్యలే. రిజర్వు బ్యాంకు వద్ద ఉన్న రూ 3.5 లక్షల కోట్ల కోసం కేంద్రం పడుతున్న తాపత్రయం.. మోదీ గత అయిదేళ్ల కాలంలోని చివరి దశలో ఆర్బీఐలో జరిగిన పరిణామాలు అన్నీ చూస్తే కేంద్రం ప్రభుత్వం ద్రవ్యకొరతతో ఎంతగా ఇబ్బందిపడుతోందో అర్థమవుతోంది. ఇదొక్కటే కాదు... ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల విక్రయ ప్రయత్నాలూ అందులో భాగమే.


కాఫీడే సిద్దార్థ మరణం.. తెలుగు నేతల పార్టీ మార్పూ సూచనే..
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కాఫీ డే సంస్థ అధినేత సిద్దార్థ మరణం కూడా కార్పొరేట్ సంస్థల కష్టాలకు సూచికగానే చెప్పాలి. సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడం.. బయపడాలనే ప్రయత్నాలు ఫలించకపోవడం.. పెట్టుబడి సమీకరణ సాధ్యం కాకపోవడం వెరసి ఆర్థిక కష్టాల్లో పూర్తిగా మునిగిపోయి ఏకంగా ఆయన మరణానికి దారితీసింది. దేశంలోని అనేక నిర్మాణ రంగ సంస్థలు, వివిధ రాష్ట్రాల్లో కాంట్రాక్టులు చేస్తున్న సంస్థలూ అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాయి. అలాంటి సంస్థలకు అధిపతులుగా ఉన్నవారు కొందరు రాజకీయ పార్టీల్లో ఉండడంతో నెట్టుకు రాగలుగుతున్నారే కానీ లేదంటే ఆ సంస్థలు, వారి ఆర్థిక డొల్లతనం ఎప్పుడో బయటపడేది. ఇటీవల తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ నేత కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి మారేందుకు సిద్ధమయ్యారు. ఆయన సంస్థలు సుమారు రూ.350 కోట్ల వరకు జీఎస్టీ చెల్లించాల్సి ఉన్న పరిస్థితుల్లో నష్టాలతో ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆయన ఆ జీఎస్టీ మినహాయింపు సాధించుకునే ప్రయత్నాల్లోనే పార్టీ మారేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం ఉంది.

రుణలు తీర్చలేక కంపెనీలు.. బకాయిలు వసూలు కాక బ్యాంకులు దివాళా
దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే కంపెనీలు, బ్యాంకులు రెండూ ఒకదానితో ఒకటి ముడిపడిన సమస్యలతో సతమతమవుతూ దేశ ఆర్థిక వ్యవస్థను కుదుపులకు గురిచేస్తున్నాయి. మొండి బకాయిలు వసూలు కాక బ్యాంకులు దివాళా తీస్తుంటే... తీసుకున్నరుణాలు తీర్చలేక కంపెనీలు దివాళా అవుతున్నాయి.

పొదుపు ఖాతాల ద్వారా నిధుల జమ చేసుకుని రుణాల ద్వారా పెట్టుబడులు అందజేయగలిగే బ్యాంకులు.... రుణాలు తీసుకుని పెట్టుబడులు పెట్టి ఉపాధి, సంపద రెండూ సృష్టించగలిగే కంపెనీలూ రెండూ దెబ్బతింటుంటే దేశ ఆర్థిక వ్యవస్థ అడుగులు తడబడుతున్నాయి.  ఇంకో కీలక రంగమైన సేవారంగంలోనూ కొత్త విప్లవమేమీ రాలేదు. ఈ రంగంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది.

వ్యవసాయం, ఫలసాయం రెండిట్లోనూ జోరు కరవైంది
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి ఇంకో రంగం వ్యవసాయం. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు అన్నీ చెబుతున్నా ఫలితం మాత్రం సున్నా. రైతు పండించే పంటకు మార్కెట్ కొత్తగా ఏమీ పెరగలేదు.. రైతు చేతి నుంచి దాటాకే మార్కెట్ మొదలవుతోంది.

అంతేకాదు... అప్పుడెప్పుడో హరిత విప్లవం తరువాత మళ్లీ ఆ స్థాయిలో కేంద్రం నుంచి నీటి పారుదల రంగం వృద్ది చెంది కొత్త ప్రాజెక్టులు వచ్చి కొత్త ఆయకట్టు పెరిగి దేశంలో సాగు విస్తీర్ణం, తద్వారా వ్యవసాయ ఉత్పత్తి పెరిగే పరిస్థితి లేకపోయింది.

అధిక దిగుబడులు ఇచ్చే వంగడాల అభివృద్ధిలోనూ మనది వెనుకడుగే. చైనా వంటి దేశాల్లో ఎకరా విస్తీర్ణంలో 80 అంతకంటే ఎక్కువ క్వింటాళ్ల దిగుబడి సాధిస్తుంటే మన దేశంలో ఎకరా విస్తీర్ణంలో 30 క్వింటాళ్ల దిగుబడి వస్తే చాలా ఎక్కువ వచ్చినట్లు. వ్యవసాయ ఉత్పత్తే మన దేశానికి ఆర్థిక దన్ను. వర్షాలు కురిసి నదులు ప్రవహించి పొలాలు తడిసి పంటలు పండితే దేశంలో ప్రాథమిక స్థాయి నుంచి విక్రయాలు ఊపందుకుంటాయి. పల్లీ పొట్లాల నుంచి పెద్దపెద్ద కార్ల వరకు అన్నిటి విక్రయాలూ ఆ ఏడాది పంటలు ఎలా పండాయన్న విషయంపైనే ఆధారపడి ఉంటాయన్నది అందరికీ తెలిసిందే.

అంతేకాదు.. భూముల ధరలు పెరగడం.. గృహ నిర్మాణాలు ఊపందుకోవడం.. వివాహాలు, ఇతర వేడుకలు జరగడం.. వాటి కోసం బంగారం కొనుగోళ్లు.. ఇలా అతి పెద్ద మార్కెట్ చైన్‌కు రైతే ఆధారం. కానీ, ఏవో కొన్ని రాష్ట్రాల్లో తప్ప మిగతా అన్నిచోట్లా వ్యవసాయం పడకేసింది. నకిలీ విత్తనాలు, పనికిరాని ఎరువులు... ఆదుకోని వర్షాలు... పూర్తికాని ఇరిగేషన్ ప్రాజెక్టులు.. రద్దయ్యే ప్రాజెక్టు కాంట్రాక్టులు.. ప్రాజెక్టులకు నిధులివ్వని కేంద్రం.. ఇలా ఎన్నో సమస్యలతో వ్యవసాయం పడుతూ లేస్తూ ఉంది. వ్యవసాయ రంగంలో సానుకూల మార్పు లేకపోవడమూ దేశ ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తోందనే చెప్పాలి.

కర్ణుడి చావుకి కోటి కారణాలు
కర్ణుడి చావుకు కోటి కారణాలన్నట్లుగా సంపద సృష్టించే, ఉత్పత్తి సృష్టించే, ఉపాధి సృష్టించే, వనరులను సిద్ధం చేసే, కొనుగోలు శక్తిని పెంచే, పరపతిని పెంచే, ఎగుమలతులను పెంచే, మారక ద్రవ్య నిల్వలను పెంచే, రిజర్వు నిధులను పెంచే... ఇలా ఈ కీలక అవసరాలు, అంశాలతో సంబంధముండే రంగాలన్నీ నీరసించిపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English