సీఎం పదవి పోయింది.. రాజకీయాలు వదిలేస్తాడట

 సీఎం పదవి పోయింది.. రాజకీయాలు వదిలేస్తాడట

ఓపెన్‌గా చెప్పాలంటే కర్ణాటకలో దేవగౌడ కుటుంబం అంతగా అవకాశ వాద రాజకీయాలు చేసేవాళ్లు దేశంలోనే కనిపించరు. ఆ రాష్ట్రంలో జేడీఎస్ పార్టీ బలం కొన్ని ప్రాంతాలకే పరిమితం. ఎక్కువగా కుల ఓట్లను నమ్ముకుని సీట్లు సాధించే పార్టీ అది. పూర్తిగా కుటుంబ రాజకీయాలే ఉంటాయి ఆ పార్టీలో.

కుటుంబంలో ప్రతి ఒక్కరికీ పదవి అనే సిద్దాంతంతో సాగిపోతుంటారు దేవెగౌడ, కుమారస్వామి. ఒక రాజకీయ పార్టీకి ఎన్ని అవలక్షణాలుండాలో అన్నీ ఆ పార్టీలో.. దాని అధినేతల్లో కనిపిస్తాయి. కానీ పైకి మాత్రం నీతులు గొప్పగా వల్లిస్తారు. గతంలో భారతీయ జనతా పార్టీలో ఒప్పందం చేసుకుని సీఎం పదవిని యడ్యూరప్పతో కలిసి సగం సగం రోజులు పంచుకునే షరతుతో అధికారంలోకి వచ్చి తన టెర్మ్ అయిపోగానే ప్లేటు ఫిరాయించిన ఘనుడు కుమారస్వామి.

ఇక గత ఏడాది ఎన్నికల్లో మెజారిటీకి అవసరమైన దాంట్లో మూడో వంతు సీట్లు కూడా లేకుండానే కాంగ్రెస్ మద్దతుతో సీఎం కుర్చీ ఎక్కాడు కుమారస్వామి. కానీ ఈ ప్రభుత్వం ఏడాది తిరక్కుండానే కూలిపోయింది. ఈ నేపథ్యంలో కుమారస్వామి మళ్లీ సుద్దులు చెప్పడం మొదలుపెట్టాడు. వైరాగ్యపు మాటలు మాట్లాడుతున్నాడు. తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు కుమారస్వామి పేర్కొనడం విశేషం.

"నేను రాజకీయాల్లోకి రావడం.. ముఖ్యమంత్రి అవ్వడం అన్ని యాదృచ్చికంగానే జరిగాయి. దేవుడి దయ వల్ల రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసే అవకాశం వచ్చింది. ఈ 14 నెలలు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడ్డాను. ఎవరినో సంతృప్తి పరచాల్సిన అవసరం నాకు లేదు. రాష్ట్రం కోసం పని చేశాను. ఆ తృప్తి చాలు నాకు. త్వరలోనే రాజకీయాల నుంచి తప్పుకుందామని భావిస్తున్నాను" అని కుమారస్వామి అన్నాడు. ఐతే అధికారం పోగానే కుమారస్వామి ఇలా వైరాగ్యపు మాటలు మాట్లాడటం కొత్తేమీ కాదు. కాబట్టి దీన్ని జోక్ లాగే తీసుకుంటున్నారు కన్నడ జనాలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English