విజయసాయి ట్వీట్లు గాడి తప్పుతున్నాయా?

విజయసాయి ట్వీట్లు గాడి తప్పుతున్నాయా?

విపక్షంలో ఉండే వారికి ఎప్పుడూ అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా అడ్వాంటేజ్ ఉంటుంది. కొన్ని అంశాల్ని లేవనెత్తుతూ ఉక్కిరిబిక్కిరి చేసే వీలుంటుంది. ఇలా విపక్షానికి ఉండే సౌలభ్యం అధికారపక్షానికి ఉండదు. పరిమితులు ఎక్కువ. మాట అనే ముందు ఆచితూచి అన్నట్లుగా రియాక్ట్ కావాలి. లేదంటే.. ప్రజల్లో పలుచన అయ్యే అవకాశం ఉంటుంది.

దాదాపు పదేళ్లు ప్రతిపక్షంలో ఉండటం.. అందునా గడిచిన ఐదేళ్లుగా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించే పేరుతో.. ఇష్టారాజ్యంగా విరుచుకుపడినప్పటికీ.. విపక్షానికి ఉండే అడ్వాంటేజ్ తో జగన్ అండ్ కోకు నడిచిపోయింది. పవర్ చేతిలోకి వచ్చిన తర్వాత కూడా విపక్షంపై వారు విరుచుకుపడుతున్న తీరు విస్మయాన్ని కలిగించేలా మారింది. తమను తప్పు పడుతూ.. విమర్శనాస్త్రాల్ని ఎక్కు పెడుతున్న వారి విషయంలో వారు అనుసరిస్తున్న వైనం చూసిన వారికి.. ఇదేం తీరు అన్న భావన అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

జగన్ టీంలో తమ రాజకీయ ప్రత్యర్థులపై అదే పనిగా ట్వీట్లతో తిట్టి పోసే విషయంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి ముందుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబు.. చినబాబు ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీయటంలో విజయసాయి సఫలమయ్యారు. ఎప్పుడైతే పవర్లోకి వచ్చారో.. అప్పటినుంచి విజయసాయి పోస్ట్ చేసే ట్వీట్లలో పంచ్ లైన్ మిస్ కావటమే కాదు.. ఇరిటేషన్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. విపక్షంలో ఉన్నప్పుడు దొరకని విజయసాయి.. ఇటీవల కాలంలో పలుమార్లు దొరికిపోతున్నారు. తాజాగా విజయసాయి చేస్తున్న ట్వీట్లు చూస్తే.. పస తగ్గి నస పెరిగిన వైనం కొట్టొచ్చినట్లు కనిపించకమానదు.

పోలవరం ప్రాజెక్టు పునాదులు కూడా తీయలేదంటూ పాదయాత్ర వేళ జగన్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించిన చంద్రబాబు.. స్పిల్ వే కారణంగా వరద నీటిని తరలిస్తున్నారని.. పునాదులే తీయనప్పుడు నీటి తరలింపు ఎలా సాధ్యమైందంటూ ట్వీట్ లో క్వశ్చన్ వేశారు. ఇలాంటి సూటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని విజయసాయి.. అడ్డ బ్యాటింగ్ లో అడ్డదిడ్డమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలకు దొరికిపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏపీ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ల విషయానికే వస్తే.. పేదలకు కడుపునిండా భోజనం రూ.5 అందించిన పథకం పెద్ద ఎత్తున సక్సెస్ కావటమే కాదు.. చిరుజీతగాళ్లు వీటిల్లో భోజనం చేస్తూ.. ఖర్చులు తగ్గించుకుంటున్న పరిస్థితి. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను మూసివేస్తూ జగన్ సర్కారు నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ విషయాన్ని కవర్ చేసేందుకు మంత్రి బొత్స రంగంలోకి దిగి.. బాబు హయాంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్లలో నెలకొన్న లోపాల్ని సరి చేసి.. మళ్లీ తెరుస్తామని చెప్పటం ద్వారా.. డ్యామేజీని అదుపు చేసే ప్రయత్నం చేశారు.

ఇలాంటివేళ విజయసాయి చేసిన ట్వీట్ పార్టీకి ప్రయోజనం కంటే కూడా నష్టమే ఎక్కువగా జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే..  అన్న క్యాంటీన్లలో రూ.150 కోట్ల స్కాం జరిగిందని.. రెండు లక్షలతో నిర్మించే క్యాంటీన్ కు రూ.30-35 లక్షలు ఖర్చు అయినట్లు లెక్కలు చూపినట్లుగా ఆరోపించారు.  అన్న క్యాంటీన్లు చూసిన వారెవరూ రూ.2లక్షలతో దాన్ని పూర్తి చేయటం సాధ్యం కాదని చెప్పేస్తారు.

రోడ్డు పక్కన పెట్టే చిన్నసైజు టిఫిన్ సెంటర్ సామాన్లకే రూ.2లక్షలు మినిమం అవుతున్న వేళ.. భారీ ఎత్తున ఏర్పాటు చేసిన క్యాంటీన్ల మీద విజయసాయి చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సబబుగా లేవన్న మాట వినిపిస్తోంది. ఇదంతా చూసినప్పుడు ఏదోలా బాబు మీద బండ వేయటానికే జగన్ బ్యాచ్ ప్రయాస పడుతుందన్న భావన కలుగక మానదు. ఇలాంటివి ప్రజల్లో జగన్ ప్రభుత్వం మీద గౌరవాన్ని కోల్పోయేలా చేస్తాయనటంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English