ఎక్క‌డి మంత్రులు అక్క‌డే గ‌ప్‌చుప్‌..!

ఎక్క‌డి మంత్రులు అక్క‌డే గ‌ప్‌చుప్‌..!

స‌చివాల‌యం ఉంది. కానీ.. చ‌డీచ‌ప్పుడు లేదు. మంత్రులున్నారు.. కానీ.. ఎన్న‌డూ అటువైపు రారు. వారివారి శాఖ‌ల‌పై స‌మీక్ష‌లు లేక స‌చివాల‌యం వెల‌వెల‌బోతోంది. కేవలం ఉద్యోగులు, సంద‌ర్శ‌కులు త‌ప్ప అక్క‌డ ఒక్క‌నాడు కూడా మంత్రులు మాత్రం క‌నిపించ‌డం లేద‌ని సెక్ర‌టేరియ‌ట్ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకుంటున్నాయి. ఎక్క‌డి మంత్రులు అక్క‌డే గ‌ప్‌చుప్‌..! అన్న‌ట్టుగా త‌యారైంది తెలంగాణ స‌చివాల‌యం ప‌రిస్థ‌తి. ఇక మంత్రులు సెక్రెటేరియ‌ట్‌కు రాక‌పోవ‌డంతో.. ఉద్యోగులు కూడా ఏం చేయాలో తెలియ‌క సైలెంట్‌గా ఉండిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో పెండింగ్ ఫైళ్లు కూడా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.

సాధార‌ణంగా మంత్రులు అన‌గానే.. రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తూ.. సెక్ర‌టేరియ‌ట్‌కు వ‌స్తూ.. నిరంత‌రం తాజా ప‌రిస్థితుల‌పై స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తూ.. హ‌డావుడిగా క‌నిపిస్తుంటారు. కానీ.. తెలంగాణ మంత్రుల మాత్రం ఇందుకు విరుద్ధంగా క‌నిపిస్తున్నారు. ఈసారి తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లోనే మోస్త‌రు వ‌ర్షం కురుస్తోంది. దాదాపుగా ఎక్కువ ప్రాంతాల్లోనే వ‌ర్షాలే లేవు. చెరువుల్లోకి చుక్క‌నీరు కూడా రాలేదు. కానీ.. వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి మాత్రం నోరు మెద‌ప‌రు. తాజా ప‌రిస్థితుల‌పై స‌మీక్ష చేయ‌రు. దీంతో సంబంధిత శాఖ అధికారులు కూడా చ‌డీచ‌ప్పుడు లేకుండా ఉండిపోతున్నారు.

ఇలా దాదాపుగా మిగ‌తా మంత్రుల ప‌రిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇది సీజ‌న‌ల్ వ్యాధులు ప్ర‌బ‌లే కాలం. అయినా వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఇంత‌వ‌ర‌కూ స‌మీక్ష చేయ‌లేదు. కేవ‌లం త‌న నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిమితం అయిపోయారు. ఇక పంచాయ‌తీరాజ్‌శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు మాత్రం ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో కాస్త హ‌డావుడి చేస్తున్నారు. హైదరాబాద్‌లో మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్ కూడా కాస్త హ‌డావుడి చేస్తున్నారు. హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ, శ్రీ‌నివాస్‌గౌడ్‌, ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి, జ‌గ‌దీశ్‌రెడ్డి త‌దిత‌రులంద‌రూ సైలెంట్ మోడ్‌లో ఉండిపోతున్నారు.

అయితే.. మ‌రికొద్ది రోజుల్లోనే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉండే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని ప‌లువురు మంత్రులు వ‌ణికిపోతుండ‌గా.. మ‌రికొంద‌రు మాత్రం త‌మ ప‌ద‌వులకు ఎలాంటి ఢోకా ఉండ‌దంటూ ధీమాతో ఉంటున్నారు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ త‌ర్వాత మంత్రుల ప‌నితీరులో మార్పు వ‌స్తుంద‌ని గులాబీ శ్రేణులు అంటున్నాయి. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. నూత‌న స‌చివాల‌యం నిర్మాణానికి ప్ర‌భుత్వం శ్రీ‌కారం చుడుతున్న నేప‌థ్యంలోనే మంత్రులు అక్క‌డి రావ‌డంలేద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English