ఆగ‌స్టు వ‌చ్చింది... టీడీపీలో టెన్ష‌న్ మొద‌లైంది...

ఆగ‌స్టు వ‌చ్చింది... టీడీపీలో టెన్ష‌న్ మొద‌లైంది...

తెలుగుదేశం పార్టీకి ఆగస్ట్ అంటే అదో టెన్షన్. ఆగస్ట్ నెల వచ్చిందంటే ఆ పార్టీ ముఖ్య నేతలకు గుండెల్లో దడ. ఎందుకంటే ఆగస్టు నెలలోనే టిడిపి ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను 1984 ఆగస్టులో గద్దె దించి నాదెండ్ల భాస్కరరావు సీఎం అయ్యారు. నాటి నుంచి నేటి వరకు ఈ నెలలో టిడిపి ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. చివరకు 1995లో ఎన్టీఆర్‌ను గద్దె దించి చంద్రబాబు సీఎం అయింది కూడా ఆగస్టు నెలలోనే... ఇక తెలుగుదేశం పార్టీకి... ఇంకా చెప్పాలంటే చంద్రబాబు జీవితంలోనే మాయ‌ని మ‌చ్చ‌గా ఉన్న హైదరాబాద్ బ‌షీరాబాగ్‌ కాల్పుల ఘటన కూడా ఆగస్టులోనే జరిగింది.

దివంగత మాజీ మంత్రి, చంద్రబాబు బావమరిది హరికృష్ణ చంద్రబాబు ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసి అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించి కూడా ఆగస్టులోనే.. ఇలా చెప్పుకుంటూ పోతే నందమూరి, నారా ఫ్యామిలీల‌కు ఆగస్టు నెల చాలా బ్యాడ్ సెంటిమెంట్ ఉన్న నెల‌గా మిగిలిపోయింది. టీడీపీలో ఈ రెండు కుటుంబాలకే కాకుండా, పార్టీ సీనియర్ నేతల విషయంలోనూ ఆగస్టు నెల బ్యాడ్ సెంటిమెంట్ గా మిగిలిపోయింది. టీడీపీలో ముఖ్యనేత లాల్ జాన్ పాషా కూడా ఆగస్ట్ నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఇక నందమూరి హరికృష్ణ కూడా ఆగస్ట్ నెలలోనే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

ఇవన్నీ ఆగ‌స్టు నెల‌లో జ‌రిగిన‌ ప్రధానమైన సంఘటనలు.. ఇంకా మరెన్నో సంక్షోభాలు ఆగస్ట్‌ నెలలోనే ఎదురయ్యాయి. ఈ నెల గురించి చంద్ర‌బాబుకు కూడా భ‌యం ఉండేది. 2004లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో చంద్రబాబు ఆగస్టు ఘడియలు మంచి కాదని భావించి పార్టీ కీలక నిర్ణయాలు, సంక్షేమ పథకాలకు సంబంధించిన ఆ నెల‌లో ఎప్పుడూ తీసుకోలేదు. ఇక ఇప్పుడు తాజా ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మితో మ‌రోసారి బాబు, టీడీపీ నేత‌ల‌ను ఆగ‌స్టు భ‌యం వెంటాడుతోంది.

ఇప్పటికే ఏపీలో టీడీపీని లేకుండా చేస్తామని బీజేపీ నాయకులు కంకణం కట్టుకున్నారు. ఇప్ప‌టికే టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు కూడా మొదలయ్యాయి. న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు బీజేపీలోకి వెళ్లిపోయారు. అటు అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం కూడా టీడీపీనే టార్గెట్ చేసింది. ఇక త్వ‌ర‌లోనే అసెంబ్లీలో బీజేపీ ప‌క్ష నేత‌ను చూస్తార‌ని బీజేపీ చెపుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ చేసేది కూడా ఈ నెల‌లోనే అన్న చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. ఈ ప‌రిణామాలే ఇప్పుడు టీడీపీ వాళ్ల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English