వైసీపీలో సినీవార్...పృథ్వీ వ‌ర్సెస్ పోసాని

వైసీపీలో సినీవార్...పృథ్వీ వ‌ర్సెస్ పోసాని

ఏపీలో అధికారం చేప‌ట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో అప్పుడే లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయి. అయితే, క్రియాశీల రాజ‌కీయాల్లో ఉండే వారి నుంచి కాకుండా సినీరంగం నుంచి వ‌చ్చి పార్టీకి సేవ‌లందించిన వారితో ఈ వివాదం సాగుతోంది. జగన్ సీఎం అవటం సినీ పెద్దలకు ఇష్టం లేదని 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృద్వీ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. అయితే, వైసీపీకే చెందిన‌ పృద్వీ వ్యాఖ్యలను ఆ పార్టీకి సానుభూతిప‌రుడిగా ఉన్న పోసాని కృష్ణ మురళి ఖండించారు. పృద్వీ తొందరపడి మాట్లాడారని అనుకుంటున్నానని, జగన్ సీఎం అవటం సినీ పెద్దలకు ఇష్టం లేదనటం‌ సరైంది కాదన్నారు. చంద్రబాబు గెలవాలని సినీ పెద్దలు సహజంగానే కోరుకుంటారని చెప్పారు.

దగ్గుబాటి సురేష్‌బాబు గతంలో‌ సీఎం సమయం అడిగారని, అసెంబ్లీ సమావేశాల తర్వాత ముఖ్యమంత్రి సమయం ఇస్తారని తెలిసిందని పోసాని కృష్ణ‌ముర‌ళి అన్నారు. ట్విట్టర్లో లోకేష్‌ను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని, 24గంటలు ఖాళీగా ఉన్నాడు కాబట్టి లోకేష్ ట్విట్టర్ లో బిజీగా ఉన్నాడ‌ని ఎద్దేవా చేశారు. జగన్ నచ్చాల్సింది ప్రజలకే కానీ లోకేష్, పవన్ కళ్యాణ్‌కు నచ్చాల్సిన అవసరం లేదన్నారు. శివాజీ కామెంట్స్‌ను తాను పరిశీలించలేదని అయితే...తాను వైసీపీలో ఉన్నానని.. శివాజీ ఏ పార్టీనో చెప్పాలన్నారు. శివాజీ అంత పెద్ద హీరోను కామెంట్ చేసే స్థాయి నాది కాదని ఎద్దేవా చేశారు.

పోలవరం కాంట్రాక్ట విషయంలో సీఎం చొరవను అభినందిస్తున్నాన‌ని పోసాని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మినహా 1983 నుంచి పనిచేసిన అందరి సీఎంల కంటే జగన్ బాగా పనిచేస్తున్నారని అభినందించారు. 2012 ఉప ఎన్నికల్లో జగన్, విజయమ్మ గారి తరుపున ప్రచారం చేశానని తెలిపిన పోసాని అప్పట్లో రోజా, తాను తప్ప సినీ పరిశ్రమ నుంచి ఎవరూ లేరని గుర్తు చేశారు. వైసీపీకి ఎంత చేయాలో అంత చేశానని పోసాని తెలిపారు. పదవి ఇస్తే కాదననని అయితే పదవి కోసం ఎగబడనని పోసాని ఎలిపారు. నాకంటే ఎక్కువ కష్టపడ్డారు కాబట్టే జూనియర్లకు పదవులు వచ్చాయని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఈ సంద‌ర్భంగా త‌న‌ ఆరోగ్యంపై జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని పోసాని ఖండించారు. ``మే 13న అనారోగ్యంతో యసోదా ఆసుపత్రిలో చేరాను. గత రెండు నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడ్డాను. ఒక సందర్భంలో చనిపోతానేమో అనేంత భయపడ్డాను. విషమ పరిస్థితుల్లో పోసాని, వికటించిన పోసాని ఆరోగ్యం...అని సోషల్ మీడియా ప్రచారం చేయటం బాధించింది. సోషల్ మీడియా వల్ల వేషం ఇచ్చేవాళ్ళు కూడా వెనక్కి తగ్గారు. రెండు ఆపరేషన్ల తర్వాత నా ఆరోగ్యం చాలా బాగుంది``అని పోసాని వెల్ల‌డించారు. అయితే, పృద్వీపై పోసాని చేసిన వ్యాఖ్య‌లు స‌హ‌జంగానే చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English