అధికారంలోకి వ‌స్తే.. రూ.70కే చీప్ లిక్క‌ర్‌

రాష్ట్ర బీజేపీ నాయ‌కులు విజయవాడలో నిర్వ‌హించిన‌ ప్రజాగ్రహ సభ రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు, హాట్ కామెంట్ల‌కు వేదిక‌గా మారింది.  ఈ సభలో వైసీపీ సర్కారు వైఫల్యాలను పార్టీ నేతలు ఓ రేంజ్‌లో ఎండగట్టారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జరుగుతందని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ప్ర‌జాగ్ర‌హ‌ సభను చూసి చాలామంది ఇబ్బంది భయపడుతున్నారని సోము వీర్రాజు పేర్కొన్నారు. జగన్‌కు ఏం చూపించాలో అది చూపించే పార్టీ మాదే అని తెలిపారు.

అయితే.. ఈ సంద‌ర్భంగా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత సంచ‌ల‌నంగా మారాయి. “బీజేపీ అధికారంలోకి రావాల‌ని కోరుకుంటున్న‌ట్టు అంద‌రూ చెబుతున్నారు. మ‌రి కోటి వోట్లు బీజేపీకి వేయండి.. మీ స‌త్తా చూపించండి. పార్టీని అధికారంలోకి తీసుకురండి“ అని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఈ స‌మ‌యంలోనే.. ఆయ‌న బీజేపీ అధికారంలోకి వ‌స్తే.. 70 రూపాయల‌కే చీప్ లిక్క‌ర్ ఇస్తామ‌ని.. హామీ ఇచ్చారు. అంతేకాదు.. ఆర్థిక ప‌రిస్థితి క‌నుక బాగుంటే.. అది స‌ర్దుబాటు కాగానే.. ఇదే చీప్ లిక్క‌ర్‌ను 50 రూపాయ‌ల‌కే ఇస్తామ‌ని స‌భా వేదిక నుంచే మందుబాబుల‌కు ప‌క్కా హామీ గుప్పించారు.

ఇక‌, టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు.. రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేశాయని సోము దుయ్యబట్టారు. ఆస్తులు పోగేసుకునేందుకు ఈ నేతల తాపత్రయం పడ్డారే తప్ప రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. ఏపీలోని అనేక హైవేలను కేంద్రం అభివృద్ధి చేస్తోందన్న సోము.. కేంద్ర పథకాలకు రాష్ట్ర స్టిక్కర్లు అంటిస్తున్నారని పేర్కొన్నారు. ఉపాధిహామీ నిధులతో జగనన్న రైతుభరోసా కేంద్రాలా అని ప్రశ్నించారు. “ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నారని ముందు చంద్రబాబును అడగాలి. ప్రత్యేక హోదా పరిధి నీతి ఆయోగ్‌లో ఉంది“ అని సోము తెలిపారు.

“విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఇప్పటికీ కాపాడుతున్న పార్టీ మాదే. యూనియన్లతో పాఠశాలలను సర్వనాశనం చేసింది కమ్యూనిస్టులే. ట్రేడింగ్ పార్టీలకు ఏజెంట్లు.. కమ్యూనిస్టు పార్టీలు. మా పార్టీ.. హంగులకు, ఆర్భాటాలకు దూరం. బీజేపీ అధికారంలోకి వస్తేనే ఏపీ సర్వతోముఖాభివృద్ధి“ అని సోము చెప్పారు. 31 కేసులున్న వ్యక్తికి ప్రజలు ముఖ్యమంత్రి పోస్టు ఇచ్చి ఇప్పుడు బాధపడుతున్నారని అన్నారు. అమరావతి రాజధాని అని చెప్పి రైతులను మోసగించారని రాష్ట్ర సర్కారుపై ఆయన మండిపడ్డారు. బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని, ఇచ్చిన ప్ర‌తి హామీని అమ‌లు చేస్తామ‌ని సోము చెప్ప‌డం గ‌మ‌నార్హం.