బెయిల్‌పై ఉన్న నేతలు ఎప్పుడైనా జైలుకే

ఏపీ బీజేపీ నాయ‌కులు విజ‌య‌వాడ‌లో నిర్వ‌హిస్తున్న ప్ర‌జాగ్ర‌హ స‌భ‌లో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియ‌ర్‌నేత ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను ఉద్దేశించి.. ప‌రోక్షంగా మ‌రింత తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. బెయిల్‌పై ఉన్న‌వారు.. ఎప్పుడైనా.. జైలుకు వెళ్లొచ్చ‌ని సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ఏపీలో చాలామంది నేతలు బెయిల్‌పై ఉన్నారని.. వాళ్లు ఎప్పుడైనా జైలుకు వెళ్లవచ్చని జావదేకర్‌ అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందన్నా రు. వైసీపీ, టీడీపీ, టీఆర్ ఎస్‌.. మూడూ కుటుంబ పార్టీలేన‌ని అన్నారు.

ఈ 3 ప్రాంతీయ పార్టీలు అవినీతికి పాల్పడుతున్నాయని ప్రకాశ్ జవ‌దేకర్‌ ఆరోపించారు. ఏపీలో టీడీపీ, వైసీపీ రెండూ ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది నేతలు బెయిల్‌పై బయట ఉన్నారని, వారంతా త్వరలోనే జైలుకు వెళ్తారని పేర్కొన్నారు. ఏపీలో విధ్వంసకర పాలన సాగుతోంది. మద్య నిషేధం అని చెప్పి మద్యంపై వచ్చిన డబ్బుతోనే పాలన సాగిస్తున్నారు.

ఇచ్చిన హామీలు ఏవీ జగన్‌ నెరవేర్చలేదు. కేంద్ర పథకాలకు రాష్ట్ర స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఇక్కడ కట్టించేది జగనన్న కాలనీలు కాదు.. మోడీ కాలనీలు. నా హయాంలోనే పోలవరానికి అనుమతులు వచ్చాయి. అని మంత్రి వివ‌రించారు. అనుమతులు ఇచ్చి ఏడేళ్లయినా పోలవరం పూర్తి చేయలేదన్నారు. అమరావతి కోసం అటవీ భూములను బదిలీ చేశామ‌న్నారు. రాజధాని విషయంలో టీడీపీ, వైసీపీ ఘర్షణ పడుతున్నాయ‌ని, సభకు వస్తున్నప్పుడు దారిలో ‘పుష్ప’ సినిమా పోస్టర్‌ చూశాన‌ని తెలిపారు.

ఎర్రచందనం స్మగ్లింగ్‌పై వేసిన సిట్‌ను ఏపీలో రద్దు చేశారని తెలిపారు. ఆంధ్ర ప్రజలు ఇప్పటికైనా ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలని జ‌వ‌దేక‌ర్ పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రానికి మేలు చేసే నాయకత్వం తప్పక అవసరమ‌న్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో అధికారం బీజేపీదేన‌ని జావ‌దేక‌ర్ ఉద్ఘాటించారు. అయితే.. ఆయ‌న చేసిన జైలు వ్యాఖ్య‌లు జ‌గ‌న్ గురించేన‌ని.. ప‌లువురు బీజేపీ నేత‌లు గుస‌గుస‌లాడ‌డం స‌భ‌లోనే వినిపించ‌డం గ‌మ‌నార్హం.