బలపరీక్షలో గట్టెక్కిన యడ్యూరప్ప... ముందుంది మరో పరీక్ష

బలపరీక్షలో గట్టెక్కిన యడ్యూరప్ప... ముందుంది మరో పరీక్ష

కర్ణాటక అసెంబ్లీలో యడియూరప్ప బలపరీక్షలో గట్టెక్కారు. 207 మంది సభ్యులున్న అసెంబ్లీలో మెజారిటీ నిరూపణకు 104 మంది సభ్యులు అవసరం కా.. బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా 106 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. 105 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు, ఓ ఇండిపెండెంట్ కూడా మద్దతు పలకడంతో, మేజిక్ ఫిగర్ ను యడ్డీ సర్కారు అధిగమించింది. విశ్వాస పరీక్షకు వ్యతిరేకంగా 100 ఓట్లు వచ్చాయి.  దీంతో 6 ఓట్ల తేడాతో యడ్డీ విజయం సాధించారు.

అంతకు ముందు బల పరీక్ష చర్చ కాసేపు వాడివేడిగా సాగింది. సీఎం యడియూరప్ప, సిద్ధరామయ్యల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రధాని నరేంద్ర మోదీ అడుగుజాడల్లో రైతులకు సాయం చేస్తానని సీఎం ప్రకటించారు. రైతులకు రెండు విడతలుగా ఆర్థిక సాయం అందజేస్తామని సీఎం తెలిపారు. రైతులు తమకు ఆప్త మిత్రులని, ఈ విషయం ఇప్పటికే పలుమార్లు రుజువైందని సీఎం అన్నారు.

దీనిపై సీఎల్పీ నేత సిద్ధరామయ్య స్పందించారు. సీఎం మాటలకు కౌంటర్‌ విసిరారు. తాము ఏడాదిన్నర క్రితమే ఈ పథకాన్ని తీసుకువచ్చామని పేర్కొన్నారు. 2018 ఫిబ్రవరిలో రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టేటప్పుడు ‘రైత బెళగ’ పేరుతో ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు సీఎం తీసుకొచ్చిన పథకంలో కొత్త అంశమేమీ లేదని చురకలు అంటించారు.

కాగా బలపరీక్షలో నెగ్గిన యడ్డీకి ప్రభుత్వాన్ని నడపడం నల్లేరుపై నడకమేమీ కాదని.. అనర్హత వేటు పడిన 17 మంది ఎమ్మెల్యేల స్థానాల్లో జరిగే ఎన్నికల్లో సగం సీట్లు గెలుచుకోకుంటే మళ్లీ ఇబ్బంది తప్పదని అర్థమవుతోంది.  ఆ 17లో కనీసం 8 సీట్లను బీజేపీ గెలుచుకోవాలి.. లేదంటే.. యడ్డీ ప్రభుత్వం తిరిగి పడిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ 17 స్థానాలూ కాంగ్రెస్, జేడీఎస్ సిట్టింగ్ స్థానాలు కావడంతో వాటిని గెలుచుకోవడం యడ్డీకి సవాలే. మరి.. ఆ పరీక్షలో యడ్డీ ఎలా విజయం సాధిస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English