నష్ట నివారణ చర్యలు మొదలుపెడుతున్న జగన్

నష్ట నివారణ చర్యలు మొదలుపెడుతున్న జగన్

చంద్రబాబు ప్రభుత్వంలో చేసుకున్ని విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దుకు ప్రయత్నాలు.. 25 శాతం పూర్తికాని పనులున్న ప్రాజెక్టులపై సమీక్ష చేసి రద్దు యత్నాలు.. అమరావతి ప్రాజెక్టు నుంచి తప్పుకొన్న ప్రపంచబ్యాంకు.. అమరావతికి నిధులివ్వాలన్న ఆలోచన నుంచి వెనక్కు మళ్లిన ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్.. జగన్ పద్ధతి మార్చుకోకపోతే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం కష్టమేనంటూ మండిపన ఎల్ అండ్ టీ.. ఇప్పుడు సింగపూర్ కన్సార్టియంపై కన్ను... ఇవన్నీ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన పరిణామాలు. ఫలితం ఏపీలో పెట్టుబడులు పెట్టడంపై పారిశ్రామిక వర్గాలు, కార్పొరేట్లలో భయం.

ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన సంస్థల్లో ఆందోళన... జగన్ సీఎం అయిన తరువాత ఏపీ అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకొంటున్నాయంటూ రాజకీయ ప్రత్యర్థులూ మండిపడుతున్నారు. ఇవన్నీ తన ప్రభుత్వానికి మచ్చ తెస్తున్నాయని.. నిజంగానే పెట్టుబడులపై ప్రభావం పడే ప్రమాదముందని జగన్ గుర్తించినట్లు చెబుతున్నారు. అందుకే... నష్ట నివారణ కోసం పెట్టుబడుల సదస్సు ఏర్పాటుచేసి పెట్టుబడులను ఆహ్వానించాలనుకుంటున్నారు. అదికూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరలోనే నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా కంపెనీలను ఆకర్షించేందుకు ఈ ఏడాది సెప్టెంబర్ 9న ‘ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్’ చేపట్టాలని నిర్ణయించారు. విజయవాడలో ఈ సదస్సును నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.  ఈ సదస్సుకు 40 దేశాలకు చెందిన రాయబారులు, దౌత్యవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు హాజరు కానున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో తాము చేపడుతున్న విద్యుత్ సంస్కరణలు, జ్యుడీషియల్ కమిషన్, పారిశ్రామిక రాయితీలు, అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్ విదేశీ ప్రతినిధులకు వివరించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సదస్సుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే మొదలుపెట్టారు. అయితే విజయవాడలో ఈ సదస్సును ఎక్కడ నిర్వహిస్తారన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్ నిర్వహించే ఈ పెట్టుబడుల సదస్సుకు ఎలాంటి రెస్సాన్స్ వస్తుందన్న ఆసక్తి అందరిలో ఏర్పడుతోంది. ఇప్పటికే ఇక్కడి పరిస్థితులపై పారిశ్రామిక, కార్పొరేట్ వర్గాల్లోకి ఒకరకమైన మెసేజ్ వెళ్లిన నేపథ్యంలో ఈ సదస్సును విజయవంతం చేయడం, పెట్టుబడులు సాధించడం జగన్‌కు సవాలే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English