బాలయ్య, ఆయన బంధువు అమరావతిలో 500 ఎకరాలు కొన్నారట

బాలయ్య, ఆయన బంధువు అమరావతిలో 500 ఎకరాలు కొన్నారట

ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించడానికి ముందే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసగించిందని... అమరావతిలో రాజధాని నెలకొల్పాలని నిర్ణయించుకుని.. చంద్రబాబు, ఆయన బంధువులు, ఆ పార్టీకి చెందిన కొందరు పెద్దలు ఆ ప్రాంతాల్లో భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేశారని.. ఆ తరువాతే అమరావతిని రాజధానిగా ప్రకటించారని ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ వర్గాలు చెప్పాయంటూ ప్రముఖ ఆంగ్ల పత్రిక న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంచలన కథనం ప్రచురించింది.

చంద్రబాబుకు వియ్యంకుడు కమ్ బావమరిది అయిన బాలకృష్ణ, ఆయన బంధువులు కలిపి రాజధాని నిర్ణయం కావడానికి ముందే అమరావతిలో 500 ఎకరాలు కొన్నారని ఆ కథనంలో రాసుకొచ్చారు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్, ఆయన కేబినెట్లోని మంత్రులు కూడా అమరావతి విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఇన్ సైడ్ ట్రేడింగ్‌కి పాల్పడిందని పలుమార్లు ఆరోపించారు.

"గుంటూరు - విజయవాడల మధ్య రాజధాని ఉంటుందని ప్రకటించక ముందే బాలకృష్ణ, తన బంధువుతో కలిసి 500 ఎకరాలను కొనుగోలు చేశారు. తెలుగుదేశం నేతలు ఎంతో మంది ఈ ప్రాంతంలో భూములను ముందే కొన్నారు. ఆ వివరాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయి" అని వైసీపీ నేతలు అంటున్నారు. కాగా, నిన్న పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ ను బయటకు తెస్తామని వ్యాఖ్యానించారు. అమరావతిలో భూ సమీకరణ ఓ అతిపెద్ద స్కామ్ అని, తెలుగుదేశం నేతలు రహస్య ప్రమాణాన్ని మీరారని ఆయన ఆరోపించారు. ప్రపంచ బ్యాంకు సైతం ఈ విషయాలను గమనించిన తరువాతనే రాజధాని నిర్మాణానికి నిధులను ఇచ్చేది లేదని తేల్చి చెప్పిందని బొత్స వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత అమరావతి, భూ సమీకరణలపై ప్రభుత్వం తన నిర్ణయాలను ప్రకటిస్తుందని తెలుస్తోంది.

అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూడా రెండు రోజుల కిందట సింగపూర్ కన్సార్టియంను తేవడానికి చంద్రబాబు ప్రభుత్వం అనుసరించిన స్విస్ చాలెంజ్ మెథడ్ అంతా అవకతవకలమయమన్నారు. సింగపూర్ కన్సార్టియం అమరావతిలో 1691 ఎకరాలను అభివృద్ధి చేయడానికి ఒప్పందం చేసుకుని 306 కోట్లు పెట్టుబడి పెడితే చంద్రబాబు ప్రభుత్వం ఆ భూమి ఉచితంగా ఇవ్వడంతో పాటు రూ.5500 కోట్లు పెట్టుబడి పెట్టిందని బుగ్గన ఆరోపించారు. రాష్ట్రం 12000 కోట్ల పెట్టుబడి పెట్టి 48 శాతం వాటా కలిగి ఉంటే సింగపూర్ కన్సార్టియంకు అంతకంటే తక్కవ పెట్టుబడితో 52 శాతం వాటా ఇచ్చారని బుగ్గన ఆరోపించారు. ఇప్పుడు పీపీఏలు, టెండర్ల సమీక్షల తరువాత అమరావతిపై జగన్ ప్రభుత్వం సమీక్ష ప్రారంభిస్తుందని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English