యడియూరప్పదీ కుమారస్వామి పరిస్థితే

యడియూరప్పదీ కుమారస్వామి పరిస్థితే

కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయిన తరువాత  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్పకు ముందుముందు పరిస్థితులు నల్లేరుపై నడకేమీ కాదని అర్థమవుతోంది. మరీ ముఖ్యంగా ఆయనకు కొద్దిరోజుల్లేనే కష్టాలు మొదలయ్యే సూచనలూ కనిపిస్తున్నాయి.

మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే క్రమంలోనే యడ్యూరప్ప తీవ్రమైన అసంతృప్తి ఎదుర్కోక తప్పదని తెలుస్తోంది. ముఖ్యంగా రాజధాని బెంగళూరుకు చెందిన ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో మంత్రి పదవులు ఆశిస్తుండడంతో యడ్డీకి చిక్కులు తప్పేలా లేవు.

మొత్తం 34 మందితో తన కేబినెట్ రూపకల్పన చేసుకోవాలని యడ్డీ భావిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఒక్క బెంగళూరు నుంచే 15 మంది పోటీలో ఉండటంతో ఆయనకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఆ 15 మందిలో అందరూ సీనియర్లే కావడంతో వ్యవహారం మరింత క్లిష్టంగా మారిపోయింది. వీరిలో కుమార స్వామి ప్రభుత్వాన్ని గద్దెదించడంలో కీలక పాత్ర పోషించిన వారే. దీంతో బీఎస్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

అయితే, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ముసలం తప్పదని జేడీఎస్ నేతలు అంటున్నారు.. తమ ప్రభుత్వాన్ని కూల్చివేసినంత మాత్రాన సరిపోదని.. ఇప్పుడు యడ్డీ ఏం చేస్తారో చూస్తామని అంటున్నారు.

తను వేసుకున్న సమీకరణాల ప్రకారం బెంగళూరు నుంచి పది మంది ఎమ్మెల్యేలను కేబినెట్‌లోకి తీసుకోవాలని భావించారు. ఇందుకు అధిష్ఠానం నుంచి కూడా అనుమతి తీసుకున్నారు. కానీ బెంగళూరులోని 15 మంది ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవులు కావాలని యడ్డీపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ సమస్యను యడ్డీ ఎలా పరిష్కరించుకుంటారో చూడాల్సి ఉంది.

పూర్తి మెజారిటీ ఉన్న ప్రభుత్వం కాకపోవడంతో ప్రతి దశలోనూ ఎమ్మెల్యేలను బతిమలాడుకునే పరిస్థితి ఉండడంతో యడ్డీ పాపం ముందుముందు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటారో.. కుర్చీని ఎలా కాపాడుకుంటారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English