మెజార్టీ లేకున్నా... య‌డ్డీ సీఎం అవుతారంటే...

మెజార్టీ లేకున్నా... య‌డ్డీ సీఎం అవుతారంటే...

రోజుకో మ‌లుపు తిరుగుతున్న క‌ర్ణాట‌క రాజ‌కీయంలో తాజా అప్డేట్ ఇది. వారాల త‌ర‌బ‌డి సాగిన కుమారస్వామి ప్ర‌భుత్వ సంక్షోభం ఒక కొలిక్కి వ‌చ్చి..అసెంబ్లీలో జ‌రిగిన బ‌ల‌ప‌రీక్ష‌లో ఫెయిల్ అయిన నేప‌థ్యంలో ఆయ‌న త‌న సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయ‌టం తెలిసిందే. కుమార‌స్వామి రాజీనామా చేసిన వెంట‌నే.. బీజేపీ స‌ర్కారు కొలువు తీరుతుంద‌న్న ప్ర‌చారానికి భిన్నంగా కాస్త ఆచితూచి అన్న‌ట్లుగా అడుగులు వేస్తూ ఆగ‌టం తెలిసిందే.

ఇదిలా ఉండ‌గా.. తాజాగా రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేల‌పై స్పీక‌ర్ ర‌మేశ్ కుమార్ అన‌ర్హ‌త వేటు వేసిన కాసేప‌టికే.. ఆస‌క్తిక‌ర రాజ‌కీయ ప‌రిణామం చోటు చేసుకుంది. కాస్త ఆగి అధికారం చేప‌ట్టాల‌నుకున్న క‌మ‌ల‌నాథులు.. స్పీక‌ర్ చ‌ర్య‌ల‌తో ప్లాన్ మార్చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

బీజేపీ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌య‌డ్యూర‌ప్ప గ‌వ‌ర్న‌ర్ వాజూభాయ్ వాలాతో భేటీ అయ్యారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఈ రోజే అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు. అనంత‌రం రాజ్ భ‌వ‌న్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన య‌డ్డీ.. మీడియాతో మాట్లాడారు. ఈ రోజు సాయంత్రం ఆరు గంట‌ల‌కు తాను ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు.దీనికి గ‌వ‌ర్న‌ర్ కూడా అంగీక‌రించిన‌ట్లుగా చెప్పారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఈ రోజు తాను సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తాన‌ని చెబుతున్న య‌డ్డీకి ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన బ‌లం లేదు. తాజాగా ముగ్గురు ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు ప‌డ‌టంతో స‌భ‌లో స‌భ్యుల సంఖ్య 221కి త‌గ్గింది. ఇందులో స్పీక‌ర్ ను మిన‌హాయిస్తే మొత్తం 220 మంది స‌భ్యులు ఉంటారు. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. 111 మంది ఎమ్మెల్యేలు అవ‌స‌రం. కానీ.. ప్ర‌స్తుతం బీజేపీ బ‌లం 105 మాత్ర‌మే ఉంది.

మిగిలిన  మ‌ద్ద‌తు ఎలా కూడ‌గ‌డ‌తార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. మ‌రోవైపు రాజీనామా చేసిన 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాల‌ను ప‌రిశీలించి నిర్ణ‌యం తీసుకుంటే మాత్రం బీజేపీ బ‌లానికి ఎలాంటి ఢోకా ఉండ‌ని ప‌రిస్థితి. మొత్తంగా.. అనూహ్య మ‌లుపులు తిరుగుతున్న క‌ర్ణాట‌క రాజ‌కీయంలో తాజా ఎపిసోడ్ ఒక ప‌రిణామంగా మాత్ర‌మే చూడాలంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English