ఇంగ్లండ్ కేబినెట్లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు

ఇంగ్లండ్ కేబినెట్లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునకకు బ్రిటన్  ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది. బ్రిటన్‌ నూతన ప్రధానిగా కన్జర్వేటివ్‌ పార్టీ సీనియర్‌ నేత బోరిస్‌ జాన్సన్‌ నిన్న బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అనంతరం కేబినెట్‌ కూర్పు జరిగింది. రిషి సునక సహా మరో ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు ఆయన తన కేబినెట్ లో చోటు కల్పించారు. రిషి సునకను ట్రెజరీ విభాగ చీఫ్‌ సెక్రటరీగా నియమించినట్లు యూకే ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

39ఏళ్ల రిషి.. ఇంగ్లాండ్‌లో హాంపర్‌ కౌంటీలో జన్మించారు. ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి.. 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. 2015లో జరిగిన ఎన్నికల్లో యార్క్గ్‌ఫైర్లోని రిచ్‌మాండ్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో థెరిసా మే ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలో ఎంబీఏ చదివే రోజుల్లో సహ విద్యార్థిని అయిన నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. చీఫ్‌ సెక్రటరీ హోదాలో రిషి కేబినెట్‌ సమావేశాలకు హాజరుకానున్నారు.

రిషితో పాటు భారత సంతతికి చెందిన అలోక శర్మ, ప్రీతి పటేల్‌కు కేబినెట్‌లో స్థానం దక్కింది. హోం మంత్రిగా నియమితురాలైన ప్రీతి పటేల్ వయసు 47 ఏళ్లు. ఆమె లండన్‌లోనే జన్మించారు. ఆమె తల్లిదండ్రుల స్వస్థలం గుజరాత్‌. ఆమె తల్లిదండ్రులు మొదట ఉగాండాలో నివసించేవారు. అయితే, ఉగాండాలో అప్పుడున్న పాలకుడు దక్షిణాసియాకు చెందినవారిపై దేశ బహష్కరణ విధించారు. దీంతో ప్రీతి తల్లిదండ్రులు బ్రిటన్‌కు వలసవచ్చారు.

యురోపియన్ యూనియన్ (ఈయూ)ను విమర్శించినవారిలో ప్రీతి కూడా ఉన్నారు. బ్రెగ్జిట్‌ను ఆమె చాలా బలంగా సమర్థించారు.స్వలింగ వివాహాలను వ్యతిరేకించిన ప్రీతి.. ధూమపానంపై ఆంక్షలు విధించడానికి వ్యతిరేకంగానూ మాట్లాడారు.2005 ఎన్నికల్లో నాటింగ్‌హామ్ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయినా, 2010లో విట్‌హామ్ ఎంపీగా ప్రీతి గెలిచారు. అప్పటి నుంచి ఆమె ఆ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. డేవిడ్ కేమరూన్ హయాంలో ఓ ఏడాదిపాటు ట్రెజరీ శాఖలో సహాయమంత్రిగా, మరో ఏడాది ఉద్యోగకల్పన శాఖలో మంత్రిగా పనిచేసే అవకాశం ప్రీతికి లభించింది.

అయితే.. 2017లో ప్రీతి ఇజ్రాయెల్‌లో చేపట్టిన 'వ్యక్తిగత' పర్యటన, విదేశాంగ కార్యాలయానికి సమాచారం ఇవ్వకుండా ఆ దేశ ప్రధాని నెతన్యాహు, ఇతర అధికారులతో సమావేశాలు నిర్వహించడం వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యవహారం కారణంగా ఆ పదవి నుంచి ప్రీతి తప్పుకోవాల్సి వచ్చింది.

ఇంటర్నేషనల్ డెవెలప్‌మెంట్ శాఖ మంత్రిగా అలోక్ వర్మ పదవి స్వీకరించారు. అలోక్ ఆగ్రాలో పుట్టారు. అలోక్‌కు అయిదేళ్లప్పుడు ఆయన కుటుంబం బ్రిటన్ వెళ్లిపోయింది. అయన వృత్తిరీత్యా అలోక్ ఓ చార్టర్డ్ అకౌంటెంట్. రాజకీయాల్లోకి రాకముందు 16 ఏళ్ల పాటు బ్యాంకింగ్ రంగంలో పనిచేశారు. 2010 నుంచి అలోక్ రీడింగ్ వెస్ట్ నుంచి ఎంపీగా ఉన్నారు. 2017 జూన్‌లో ఆయనకు గృహనిర్మాణ శాఖ మంత్రి పదవి వచ్చింది. గ్రీన్‌ఫెల్ టవర్‌లో అగ్ని ప్రమాదం గురించి హౌజ్ ఆఫ్ కామన్స్‌లో 2017 జులైలో అలోక్ భావోద్వేగంతో చేసిన ప్రసంగంతో అందరి దృష్టినీ ఆకర్షించారు. 2018 జనవరిలో అలోక్ ఉద్యోగకల్పన వ్యహారాల శాఖ మంత్రి పదవి చేపట్టారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English