టీటీడీ ఏమన్నా పునరావాస కేంద్రమా ?

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నియమించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యులపై అనేక విమర్శలు మొదలయ్యాయి. 25 మందితో కూడిన బోర్డు సభ్యుల ఫైలును జగన్మోహన్ రెడ్డి క్లియర్ చేశారు. అలాగే మరో 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే గతంలో ఎన్నడూ లేనట్లు మొత్తం 75 మందిని బోర్డు సభ్యులుగా నియమించినట్లయ్యింది. ఈ నియామకంలో రాజకీయ అనివార్యతే కనబడుతోంది.

ఇందులో చిన్న ట్విస్టు ఏమిటంటే మొదటి 25 మంది మాత్రమే బోర్డు సమావేశాల్లో పాల్గొంటారు. అవసరమైతే ఓటింగ్ లో పాల్గొనే హక్కు కూడా ఉంటుంది. ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన 50 మందికి బోర్డు సమావేశాలతో సంబంధం లేదు. కాబట్టి అవసరమైనపుడు ఓటింగ్ లో పాల్గొనే అవకాశం కూడా లేనట్లే. కాకపోతే దర్శనాలకు సంబంధించి బోర్డు సభ్యులతో సమానంగా ప్రోటోకాల్ ఉంటుందట. నిజానికి సభ్యులను తీసుకున్నా ప్రత్యేక ఆహ్వానితులను తీసుకున్నా వాళ్ళ వల్ల టీటీడీకి ఏమన్నా ఉపయోగం ఉంటుందా ? అనేదే ప్రశ్న.

ఇక్కడ రెండు విషయాలున్నాయి. మొదటిదేమో బోర్డు సభ్యుల వల్ల టీటీడీకి ఉపయోగం ఉండటం. రెండో అంశం టీటీడీ వల్ల సభ్యులు లాభపడటం. ఈ రెండు అంశాలను తీసుకుంటే సభ్యుల వల్ల టీటీడీకి వస్తున్న లాభం దాదాపు ఉండటం లేదు. సభ్యత్వాన్ని అడ్డంపెట్టుకుని టీటీడీని ఉపయోగించుకుంటున్న వాళ్ళే అత్యధికులు. దశాబ్దాల చరిత్రను తీసుకుంటే ఏదో రూపంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి లబ్ధిపొందిన సభ్యులే అత్యధికులున్నారు కానీ సభ్యుల వల్ల సంస్ధకు జరిగిన ఉపయోగం దాదాపు లేదనే చెప్పాలి.

బోర్డులో ఎంత మందిని సభ్యులుగా నియమిస్తే సంస్ధకు అంత ఇబ్బందలన్న విషయం అందరికీ తెలిసిందే. బోర్డు సభ్యుల హోదాలో దర్శనాలు, ప్రసాదాలు, కాటేజీలను కేటాయింపు చేసుకోవటంలో కంపు చేయడం పెరిగిపోతుంది. వీటికి అదనంగా దేవస్థానం అధికారులపై అధికారాలను చెలాయించటం, బ్రోకర్ వ్యవస్థను పెంచి పోషించటానికి తప్ప ఇంతమంది వల్ల ఉపయోగం ఉండదనే అనుకోవాలి.

వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఎంతమంది సభ్యులకు దేవుడిపైన భక్తి, టీటీడీ అభివృద్ధి పైన శ్రద్ధ ఉన్నాయన్నదే ప్రధానం. నిజంగా దేవుడిపై భక్తి ఉంటే దేవస్థానంపై పెత్తనం, అధికారం చేయాలనే ఆలోచనను పక్కన పెట్టేసి సంస్ధకు ఏదైనా మేలు చేయాలి. అలాంటి వాళ్ళు బోర్డులో సభ్యులుగా కనబడటం లేదు. ఇది ఇప్పటి పరిస్థితి కాదు. చాలా సంవత్సరాలుగా జరుగుతున్నది ఇదే. ఏదేమైనా జగన్ ప్రభుత్వం తాజా నియమించిన 75 మంది సభ్యుల నియామకాలు మాత్రం పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది మాత్రం వాస్తవం.